టీడీపీ, జనసేన మధ్య బిగుస్తున్న ‘సీటు’ముడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. నరసాపురం టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి నియోజకవర్గంలో రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది. జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది.
మింగుడు పడని రాజకీయం
రాష్ట్రంలోనే అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. రాజకీయ పరంగా ప్రతిపక్షాలకు ఆదినుంచీ కొరుకుడుపడని విధంగానే ఉంటోంది. ఇప్పుడు కూడా సీటు విషయంలో గందరగోళం నెలకొని టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడుపడటం లేదు. రెండు పార్టీలకు కనీస స్థాయిలో కూడా బలమైన ఇన్చార్జిలు లేకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం, కుల సమీకరణాలు కీలక ప్రాధాన్యంగా మారడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
1983 నుంచి 2004 వరకు నరసాపురంలో టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. 2009లో ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఘన విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. పూర్తిగా పాజిటివ్ పాలిటిక్స్‌తో అర్థరహిత విమర్శలకు పోకుండా నియోజకవర్గంలో గడచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు నిర్వహించారు. మొదటినుంచీ ఆయన జనంలో బలంగా తిరుగుతున్నారు. ప్రసాదరాజు అన్నివర్గాలనూ కలుపుకుపోతూ నానాటికీ బలపడుతుండటంతో టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినా..
2019 ఎన్నికల్లో జనసేన ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి దాదాపు 35 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానానికి జనసేన గండి కొట్టింది. నాటినుంచి నేటివరకు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించగా.. టీడీపీ దారుణంగా పతనమై 27,059 ఓట్లకు పరిమితమైంది.
ఈ నేపథ్యంలో పొత్తు లేకుండానే అత్యధిక ఓట్లు సాధించాం కాబట్టి పొత్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముందు నరసాపురం సీటును జనసేన పార్టీకే ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాతోపాటు బహిరంగంగానూ బలంగా వాణి వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పనైపోయిందంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు, సమన్వయ కమిటీ కార్యక్రమాలకు, చంద్రబాబు పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ సైతం జనసేనతో ఇదే దూరం పాటిస్తోంది.
టీడీపీలో టికెట్ లొల్లి
టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది. నలుగురు అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2019లో ఓడిపోయిన బండారు మాధవనాయుడును టీడీపీ ఇన్చార్జిగా తొలగించి అత్యంత మొక్కుబడి నాయకుడైన పొత్తూరు రామరాజును ఇన్చార్జిగా నియమించింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి వేర్వేరుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాగా.. టీడీపీ సీటు ఆశిస్తూ ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకు కేటాయించడం లేదని.. టీడీపీకి చెందిన ముగ్గురికీ కాకుండా తనకే వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సొంత అజెండాతో ప్రతిచోటా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక అపార అనుభవం ఉండి.. అన్ని రాజకీయ పార్టీలూ తిరిగి వచ్చిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ టికెట్ కోసం విపరీతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా చంద్రబాబు తనకే సీటిస్తానని చెప్పారంటూ హడావుడి చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జనసేనలోనూ గందరగోళమే
మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంలో జనసేన పార్టీలోనూ గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌కు ఈసారి ఆ పార్టీ నుంచి సీటొస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ టికెట్ కోసం కూడా కరీ్చప్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నరసాపురం జనసేన సీటు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఆక్వా వ్యాపారి చాగంటి మురళీకృష్ణ కూడా జనసేన టికెట్‌పై కన్నేశారు.