నసీరుద్దీన్ షా (బాలీవుడ్) రాయని డైరీ
ఊరికే వచ్చేస్తాయి కోపాలు మనుషులకు! మంచి విషయమే. బతికే ఉన్నామన్న సంగతిని ఒంట్లోంచి ఏదో ఒక కెమికల్ బయటికి తన్నుకువచ్చి చెప్పకపోతే ఎవరి గురించి ఎవరికి మాత్రం తెలుస్తుంది?! కోపం రావడం మంచిదే. కానీ కోపం తెచ్చిపెట్టుకోవడం? అది కూడా మంచి విషయమేనా!
తెచ్చిపెట్టుకోవడం ఎక్కువైంది లోకంలో. లేనిది తెచ్చిపెట్టుకోవడం! నవ్వు ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. ప్రేమ ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. పోనీ అవంటే వేషాలు బతికేయడానికి. కానీ కోపాన్ని కూడానా తెచ్చిపెట్టుకోవడం! అప్పుడు మనం బతికి ఉన్నట్టా? బతికే ఉన్నాం అని చెప్పుకున్నట్టా? జావెద్ అఖ్తర్‌ని అడగాలి.
బాల్కనీలోంచి కిందికి చూస్తూ కూర్చున్నాను.. రోడ్డు మీదకి. సన్నటి జల్లు. ముంబై మబ్బు పట్టేసి ఉంది. కొంచెం మిస్ట్ కూడా! ‘‘ఏమిటి చూస్తున్నారు’’ అంది రత్న నా పక్కనే వచ్చి నిలబడి. తన చేతిలోంచి నా చేతిలోకి ఒక కప్పు టీ అందడం నా జీవితంలో ఎప్పటికీ ఒక హృదయపూర్వక సందర్భం... రోజులో అది ఏ సమయంలోనైనా! ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది తను. అసలు ఇవ్వడానికే తను నా దగ్గరికి వస్తుంది. ఇచ్చాక తన పనిలోకి వెళ్లిపోతుంది. రోడ్డు మీదకే చూస్తూ ఉన్నాను. రాలిన చినుకులు పూల విత్తనాలై నేలలోకి ఇంకిపోతు న్నాయి. ప్రకృతిలోని చల్లదనంలో నన్ను సంతోషపరి చేదేమిటో ఎప్పటికీ నేను కనుక్కోలేను. ప్రకృతి దగ్గర, రత్న దగ్గర నేను యాంబివలెంట్!
చిన్న పిల్లాడు. ఒక్కడే నడుస్తున్నాడు. వాణ్ణే చూస్తున్నాను. డక్బ్యాక్ రెయిన్ కోట్, భుజాలకు స్కూల్ బ్యాగ్. వాడు వాడిలా లేడు. నాలా ఉన్నాడు. దుఃఖపు వర్షంలో వణికిపోతూ, ఇష్టం లేకుండా నేనెలాగైతే స్కూలుకు వెళ్లేవాడినో వాడూ అలాగే వెళుతున్నాడు! పిల్లల వీపుల పైకెక్కి, దున్నపోతుల్లా కూర్చొనే స్కూలు బ్యాగులపై మాత్రం నాకు ఎలాంటి యాంబివలెన్స్ లేదు. ఐ స్టిల్ హేట్ ద డ్యామ్ థింగ్స్.
జీవితంలోని పెద్ద అసంబద్ధత ఈ చదువు! కష్టాలను తట్టుకునే శక్తి లేనివారే లైఫ్ నుంచి పారిపోయి సినిమాల్లో నటించడానికి వచ్చేస్తారని నా నమ్మకం. చదువూ అంతే. జీవితంలో కష్టపడిపోతా రేమోనన్న భయంతో పిల్లల్ని కష్టపెట్టి చదివించడం!
చినుకులు పెద్దవయ్యాయి. లోపలికొచ్చి కూర్చున్నాను. ‘వెయిటింగ్ ఫర్ గాడో’ని తిరిగి ర్యాక్‌లో పెట్టేశాను. జీవితం నిండా అసంబద్ధతలే అంటాడు బెకెట్. జీవితం నిండా కాదు, జీవితమే ఒక అసంబద్ధత. ఎంత అసంబద్ధత కాకపోతే కిశోర్‌కుమార్ మీద, ఆర్డీ బర్మన్ మీద బయోపిక్‌లు తీయడానికి తయారైపోతారు వీళ్లు... పాటలు, డాన్సులతో తలలు పగలగొట్టే ఈ డైరెక్టర్లు! ‘‘వద్దు, ఆర్ట్ పీస్‌లను అలా వదిలేద్దాం’’ అన్నాను. కోపాలొచ్చే శాయ్. అఖ్తర్జీకీ వచ్చింది! రావడం మంచిదే. ఆయనేమిటో నాకు తెలుస్తుంది. తెచ్చిపెట్టుకుంటేనే.. నేనేమిటో అఖ్తర్జీకి తెలియదా అనిపిస్తుంది.
-మాధవ్ శింగరాజు