Natco Pharma
-
మూడింతలైన నాట్కో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్కో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడురెట్లకుపైగా అధికమై రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.513 కోట్ల నుంచి రూ.795 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.432 కోట్ల నుంచి రూ.539 కోట్లకు పెరిగాయి. ఫార్ములేషన్స్ ఎగుమతుల ద్వారా ఆదాయం రూ.334 కోట్ల నుంచి రూ.605 కోట్లను తాకింది. దేశీయంగా ఫార్ములేషన్స్ అమ్మకాల ద్వారా ఆదాయం రూ.101 కోట్ల నుంచి రూ.99 కోట్లకు వచ్చి చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడవ మధ్యంతర డివిడెండ్ రూ.1.25 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. నాట్కో ఫార్మా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో బుధవారం 3.10 శాతం ఎగసి రూ.883.85 వద్ద స్థిరపడింది. -
నాట్కో మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం తగ్గి రూ.62 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.591 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నాట్కో షేరు ధర బీఎస్ఈలో గురువారం 0.38 శాతం క్షీణించి రూ.529.10 వద్ద స్థిరపడింది. -
నాట్కో ఫార్మాకు నష్టాలు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ నాట్కో ఫార్మా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 50.5 కోట్ల నికర నష్ట్రం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 331 కోట్ల నుంచి రూ. 597 కోట్లకు జంప్ చేసింది. అయితే నిల్వల విలువలో రైటాఫ్తోపాటు.. క్రెడిట్ నష్టాల అంచనాలకు అనుగుణంగా కేటాయింపులు చేపట్టడం ప్రధానంగా క్యూ4లో నష్టాలకు కారణమైనట్లు కంపెనీ వివరించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నాట్కో ఫార్మా నికర లాభం దాదాపు 62 శాతం క్షీణించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 442 కోట్లకుపైగా ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు 3.2 శాతం పతనమై రూ. 658 వద్ద ముగిసింది. -
సీఎం జగన్‌కు లేఖ రాసిన నాట్కో ఫార్మా సంస్థ
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నాట్కో ఫార్మా సంస్థ లేఖ రాసింది. కోవిడ్ చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆ లేఖలో నాట్కో ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు వారు తెలిపారు. రూ. 4 కోట్ల 20 లక్షలు ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఇవ్వనున్నట్టు తెలిపారు. విడతల వారీగా రానున్న కొద్ది వారాల్లో ఈ మెడిసిన్ సరఫరా చేయనున్నట్టు నాట్కో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వీ.సీ నన్నపనేని స్పష్టం చేశారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
నాట్కో ఖాతాలో మరో మైలురాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ఖాతాలో మరో మైలురాయి పడింది. గ్లాటిరామర్ ఎసిటేట్ ఇంజెక్షన్ విక్రయానికై సంస్థ మార్కెటింగ్ భాగస్వామి అయిన మైలాన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. 20 ఎంజీ, 40 ఎంజీ సామర్థ్యం గల ఇంజెక్షన్లను నాట్కో తయారు చేయనుంది. కేంద్ర నాడీ మండల సంబంధ చికిత్సలో వాడే గ్లాటిరామర్ ఎసిటేట్ ఔషధం టెవా ఫార్మా తయారీ కోపాగ్జోన్ బ్రాండ్‌కు జనరిక్ రూపం. యూఎస్‌లో ప్రాచుర్యంలో ఉన్న కోపాగ్జోన్ వార్షిక అమ్మకాలు రూ.28,000 కోట్లపైమాటే. మైలాన్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం నాట్కో ఫార్మా 20 ఎంజీ ఉత్పాదనపై 30 శాతం, 40 ఎంజీ ఉత్పాదనపై 50 శాతం లాభం అందుకోనుంది. -
అమెరికాలో మరో 10 జనరిక్ ఔషధాలు
వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో నాట్కో లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొత్తగా మరో 10 జనరిక్స్ ఔషధాల తయారీ అనుమతుల కోసం ఏఎన్‌డీఏలు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ కీలకమైన ఔషధాలకు సంబంధించి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏకి 38 ఏఎన్‌డీఏలు దాఖలు చేసింది. సూత్రప్రాయ అనుమతులు లభించిన మూడింటితో పాటు మొత్తం 16 ఏఎన్‌డీఏలకు అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా ఇన్వెస్టర్లకు తెలిపింది. ఎఫ్‌డీఏ సమీక్షిస్తున్న 21 ఔషధాల మార్కెట్ విలువ దాదాపు 15.4 బిలియన్ డాలర్ల మేర ఉండనున్నట్లు పేర్కొంది. అమెరికా మార్కెట్‌కు సంబంధించి అల్వోజెన్, మైలాన్ తదితర సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నాట్కో ఆదాయాల్లో ఆరు శాతం పైగా వెచ్చిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 309 కోట్ల ఆదాయంపై రూ. 51 కోట్ల ఆదాయం ఆర్జించింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం లాభంతో రూ. 659.55 వద్ద ముగిసింది. -
నాట్కో ‘కొత్తూరు’ ప్లాంట్‌పై ఎఫ్‌డీఏ తనిఖీ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తూరులోని తమ ప్లాంటు తని ఖీకి సంబంధించి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ నుంచి తనిఖీ నివేదిక (ఈఐఆర్) అందుకున్నట్లు నాట్కో ఫార్మా తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ప్లాంటులో ఔషధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 29- మార్చి 7 మధ్య ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ ప్లాంటులో ఇతర దేశాలకు ఎగుమతుల కోసం నాట్కో ఔషధాలు తయారు చేస్తోంది. -
నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: నాట్కో ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల తనిఖీలు జరిపింది. చెన్నై సమీపంలోని మనాలిలో ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారు చేసే ప్లాంట్‌లోనూ, హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులోని ఫార్మాస్యూటికల్ ప్లాంట్ల్లో యూఎస్ఎఫ్డీఏ ఈ తనిఖీలు నిర్వహించిందని నాట్కో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిల్లో ఈ తనిఖీలు జరిగాయని పేర్కొంది. ఈ రెండు ప్లాంట్లకు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ 483 అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అయితే అవి స్వల్పమైనవేనని వివరించింది. వీటికి తగిన స్పందనను ఎఫ్‌డీఐకి నివేదించామని, ఈ రెండు ప్లాంట్ల ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన ప్రభావం ఉండబోదని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేరు 13 శాతం క్షీణించి రూ. 1,409 వద్ద ముగిసింది. -
ముగిసిన నాట్కో ఫార్మా క్విప్ ఇష్యూ
రూ. 341 కోట్ల సమీకరణ ఇష్యూ ధర రూ. 2,130 త్వరలో షేర్ల విభజన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాట్కో ఫార్మా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా రూ. 341 కోట్లు సమీకరించింది. మంగళవారం సమావేశమైన డెరైక్టర్ల సమావేశంలో క్విప్ ఇష్యూ ధరను నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 5 శాతం తక్కువ ధరకు షేర్లను అర్హతకలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు అలాట్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ. 2,243గా నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ కంటే రూ. 112 తక్కువగా రూ. 2,131కు షేర్లను కేటాయించడం జరిగింది. మొత్తం 16 లక్షల షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 341 కోట్లను సమీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సేకరించిన నిధులతో కంపెనీల విస్తరణ కార్యక్రమాలు, ఫ్లాంట్స్ ఆధునీకరణకు వినియోగించనుంది. రెండేళ్లలో వైజాగ్ యూనిట్ సిద్ధం విశాఖపట్నం రాంకీ సెజ్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ రెండేళ్లలో సిద్ధమవుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన యూనిట్ సివిల్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2017-18 ఆర్థిక ఏడాదికల్లా ఈ యూనిట్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ యూనిట్‌ను సుమారు రూ. 150 కోట్లతో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు షేర్లుగా విభజన గడిచిన ఏడాది కాలంలో షేరు ధర భారీగా పెరగడంతో ప్రతీ షేరును ఐదు షేర్లుగా విభజించాలని కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్ 26న జరిగే కంపెనీ 32వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రూ. 2గా విభజించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు కంపెనీ రుణ సేకరణ పరిమితిని రూ. 600 నుంచి రూ. 1,000 కోట్లకు పెంచడానికి ఈ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతి తీసుకోనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో షేరు రూ. 2225 వద్ద స్థిరంగా ముగిసింది. -
రూ.10వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ : నాట్కో ఫార్మా, మైలాన్ ల్యాబరేటరీస్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 10,379 కోట్లు ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) సిఫార్సుల మేరకు వీటిని ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 13 ప్రతిపాదలనపై నిర్ణయాలను వాయిదా వేసింది. ఆరు ప్రతిపాదనలను తిరస్కరించింది. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే (విలువ సుమారు రూ. 1,200 కోట్లు) ప్రతిపాదన ఉంది. -
టెవా-మైలాన్ డీల్ నాట్కోకి దెబ్బా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ‘కొపాక్జోన్’ పేటెంట్ వివాదం మరింత ముదరనుందా? ప్రస్తుతం అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో సంచలనం రేపుతున్న టెవా- మైలాన్ డీల్ వార్తలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నాట్కో ఫార్మాకి కొంత ఇబ్బంది కలిగిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాన్ కంపెనీని టెవా ఫార్మా కొనుగోలు చేస్తే అది కొపాక్జోన్ పేటెంట్‌పై తప్పకుండా ప్రభావం చూపుతుందని, ఈ భయాలతోనే బుధవారం నాట్కో ఫార్మా షేరు ఒకానొక దశలో ఆరు శాతంపైగా నష్టపోయిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చివరకు నాలుగు శాతం నష్టంతో రూ. 2,064 వద్ద ముగిసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మైలాన్‌ను రూ. 2.50 లక్షల కోట్లకు కొనుగోలు చేయడానికి ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న టెవా ఫార్మా బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం జరిగితే ఫార్మా చరిత్రలో ఇదే అతిపెద్ద టేకోవర్‌గా రికార్డులకు ఎక్కడమే కాకుండా అమ్మకాల పరంగా టెవా ఫార్మా నంబర్‌వన్ స్థానానికి ఎగబాకుతుంది. ఆందోళనకు ఇదీ కారణం నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు వినియోగించే కొపాక్జోన్ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఉంది. 2014లో రూ 26,460 కోట్ల విలువైన కొపాక్జోన్ అమ్మకాలు జరిగాయి. టెవా లాభంలో 50 శాతం ఈ ఒక్క ఔషధం నుంచే వస్తోందంటే ఇది ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. కొపాక్జోన్పై టెవా ఫార్మా కలిగి ఉన్న పేటెంట్ హక్కులు ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నాయి. దీనికి సంబంధించి జెనరిక్ వెర్షన్‌ను విక్రయించే అనుమతుల్ని దేశ, విదేశాల్లో మైలాన్‌తో కలిసి నాట్కో ఫార్మా దక్కించుకుంది. దీన్ని సవాల్ చేస్తూ టెవా కోర్టులకు ఎక్కింది. పలు కోర్టుల్లో ఈ తీర్పు నాట్కోకి అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ వివాదం ఇంకా అమెరికా కోర్టు వద్ద పెండింగులో వుంది. అమెరికాలో ఈ ఔషధ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతుల్ని నాట్కో పొందింది. ఇప్పుడు మైలాన్‌ను టెవా ఫార్మా కొనుగోలు చేస్తే నాట్కో ఫార్మాతో ఉన్న కొపాక్జోన్ మార్కెటింగ్ ఒప్పందం ఏమవుతుందనేది కీలకంగా మారింది. ఈ ఒప్పందానికి టెవా ఫార్మా ఒప్పుకోదని, దీంతో నాట్కో ఫార్మా వేరే మార్కెటింగ్ భాగస్వామిని వెతుక్కోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కొపాక్జోన్ జెనరిక్ వెర్షన్ విడుదల మరింత ఆలస్యం చేసే విధంగా ఉన్నాయని, ఇది కచ్చితంగా నాట్కో ఎగుమతుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని అంచనా. జరుగుతున్న పరిణామాలపై నాట్కో ఫార్మా ప్రతినిధులు మాట్లాడటానికి నిరాకరించారు. కానీ మైలాన్ టేకోవర్ వార్తలు మాత్రం నాట్కో యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేశాయని, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నదానిపై బుధవారం అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. -
మదుపర్లకు తీపి‘మాత్ర’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది. కలిసొచ్చిన అంశాలనేకం ఈ నాలుగేళ్లలో ఫార్మా షేర్ల దూకుడుకు అనేక అంశాలు కలిసొచ్చాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సాధారణంగా మార్కెట్లు పడుతున్నప్పుడు ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ సెక్టార్లయిన ఫార్మా, ఎఫ్ఎంసీజీలకేసి చూస్తారని, అయితే ఇదే సమయంలో రూపాయి పతనం ఈ రంగానికి మరింత కలిసొచ్చిందంటున్నారు. గత నాలుగేళ్లుగా దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో సగటున 20 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. అంతే కాకుండా మన ఫార్మా కంపెనీలు విదేశీ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించడం, అనేక పేటెంట్ కేసుల్లో విజయం సాధించాయి. ఈ నాలుగేళ్ళలో నాట్కో ఫార్మా సాధించిన విజయాలే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించేటట్లు చేసిందంటున్నారు మార్కెట్ నిపుణులు ఈ నాలుగేళ్లలో నాట్కో ఫార్మా రిజాట్రిప్టాన్ బెంజోయేట్ తదితర ఔషధాలను ప్రవేశపెట్టడం, స్లెరోసిస్ చికిత్సలో ఉపయోగపడే కొపాగ్జోన్ ఔషధం పేటెంటు వివాదంలో టెవా ఫార్మాపై విజయం, క్యాన్సర్ ఔషధం నెక్సావర్ జనరిక్ వెర్షన్ విషయంలో కంపల్సరీ లెసైన్సు దక్కించుకోవడం వంటి అంశాలు షేరు పెరుగుదలకు కారణమయ్యయి. ఇక డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఈ కాలంలో అధిక మార్జిన్లు ఉన్న కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. డోన్పెజిల్, డివాల్‌ప్రొయెక్స్ ఈఆర్ వంటి ఔషధాల్లో ఏకైక జనరిక్ సంస్థగా నిలబడటమే కాకుండా పోటీ తక్కువగా ఉండి మార్జిన్లు అధికంగా ఉండే ఔషధాలపై సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఈ షేరు ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. చిన్న ఫార్మా షేర్లే ముద్దు ఇప్పటికే ఫార్మా షేర్లు బాగా పెరగడంతో వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి లాభాలను ఆశించడం కష్టమేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలైతే డిఫెన్సివ్ సెక్టార్ అయిన ఫార్మా నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతారని, కానీ ఇప్పటికీ కొన్ని చిన్న ఫార్మా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. రూపాయి విలువ క్షీణత, ఎగుమతులు వంటి అంశాలు ఫార్మా కంపెనీలకు కలిసొచ్చే అంశాలు కావడంతో ఈ రంగంలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఇండియా ఇన్ఫోలైన్ తెలిపింది. ఈ సమయంలో పెద్ద ఫార్మా షేర్లలో కంటే చిన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటరని, ఎంపిక చేసిన చిన్న ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి సూచిస్తున్నారు. -
నాట్కో ఫార్మా లాభం 28% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా నికర లాభం 28 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 27 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు మాత్రం రూ. 162.91 కోట్లకు తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో అమ్మకాలు రూ. 169.16 కోట్లు కాగా లాభం రూ. 20.99 కోట్లు. వేల్యూ యాడెడ్ ఫార్ములేషన్ల ఎగుమతులు మెరుగైన పనితీరుకు దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. కొపాక్జోన్ వివాదంలో ఊరట.. మల్టిపుల్ స్లెరోసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే కొపాక్జోన్ జనరిక్ వెర్షన్‌కి సంబంధించి టెవా ఫార్మాతో వివాదంలో అమెరికా కోర్టులో నాట్కోకి ఊరట లభించింది. ఈ ఔషధ జనరిక్ తయారీపైనా, తన పేటెంట్ హక్కుల గడువు ఏడాది ముందే ముగిసిపోతుందన్న అప్పీళ్ల కోర్టు ఉత్తర్వులపైనా స్టే విధించాలంటూ టెవా ఫార్మా వేసిన పిటీషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇక అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు కూడా లభిస్తే వచ్చే ఏడాదిలో కొపాక్జోన్ జనరిక్ని ప్రవేశపెట్టేందుకు నాట్కోకి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తతం టెవా లాభాల్లో దాదాపు 50 శాతం కొపాక్జోన్దే ఉంటుంది. దీనిపై టెవా పేటెంట్ హక్కుల గడువు 2015 కాకుండా 2014లో ముగిసిపోతుందని అప్పీల్స్ కోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై టెవా సుప్రీం కోర్టుకు వెళ్లగా తాజా ఆదేశాలు వచ్చాయి.