హాకీలో ‘యువ’ దుందుభి
జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న అరవింద్, రామకృష్ణ
స్పోర్ట్స్ హాస్టళ్లలో ఉంటూ టోర్నమెంట్లలో సత్తాచాటుతున్న యువకులు
వెన్నుతట్టి ప్రోత్సహించిన సుదర్శన్‌రెడ్డి, ఉస్మాన్
ఒకనాడు ఒలింపిక్స్‌లో భారతదేశం పేరును మార్మోగించిన క్రీడ అది. భారతావని ముద్దుబిడ్డ ధ్యాన్చంద్హాకీ స్టిక్ చేతపట్టి మైదానంలో వరుస గోల్స్ చేస్తుండగా నాడు లక్షలాది మంది పులకించిపోయేవారు. మన జాతీయ క్రీడగా చిరస్థానం సంపాదించిన హాకీలో జిల్లా యువతేజాలూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్నారు. వారిపై ప్రత్యేక కథనమిది. – న్యూశాయంపేట
గ్రామీణ నేపథ్యమున్నా.. క్రీడా వసతులు అంతంత మాత్రమే ఉన్నా ఆ యువకులు పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. హాకీ ప్రాక్టీస్ చేసేందుకు సరైన సౌకర్యాలు లేకున్నా వారు వెనుకడుగు వేయడం లేదు. పాఠశాల స్థాయి పోటీల్లో సత్తాచాటి పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ హాస్టళ్లలో సీటు సంపాదించారు. నాటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, ఎస్.డి.ఉస్మాన్‌ల ప్రోత్సాహంతో వీరు హాకీలో రాణించారు.
క్రీడా నేపథ్యం..
4వేల సంవత్సరాల క్రితం హాకీ క్రీడ చీకటి ఖండంగా పేరొందిన ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో పురుడుపోసుకుంది. సుమారు 1000 బీ.సీ సంవత్సరం నాటికి రోమన్లు, గ్రీకులు, దక్షిణ అమెరికావాసులు హాకీ ఆడేవారట. మన దేశంలో తొలిసారిగా 1885–86 సంవత్సరంలో కోల్‌కతా నగరంలో హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా శిబిరాన్ని నిర్వహించారు. దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో హాకీకి మంచి ప్రజాదరణ ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు సాధించి పెట్టిన హాకీ జట్టులో క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ కీలకపాత్ర పోషించారు. ఆయన ఆటతీరు నేటి యువతకు ఆదర్శప్రాయం.
అరవింద్.. క్రీడా నైపుణ్యం అదుర్స్
ఆ యువకుడి పేరు అరవింద్. మహబూబాబాద్ మండలం పరిధిలోని గుర్రపుతండావాసి. పాఠశాల స్థాయిలో తమ ఉపాధ్యాయుడి ద్వారా హాకీ క్రీడ ఆడే పద్ధతిని తెలుసుకున్నారాయన. వినడం, తెలుసుకోవడం వరకు అంతా బాగానే ఉంది. ఇక నేర్చుకోవడం సంగతి ఎలా? మన బడుల్లో కబడ్డీ, ఖోఖో తప్పించి వేరే గేమ్స్ ప్రస్తావన అంతగా ఉండదనే విషయం అందరికీ తెలుసు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ఎలాగైనా హాకీ నేర్చుకోవాలనుకున్నాడు అరవింద్ . ‘సంకల్ప దీక్ష ఉంటే.. ఏదైనా సాకారమవుతుంది’ అనే పెద్దల మాటను ఒంటపట్టించుకున్నాడు. మానుకోటలోనే చదువుతూ ఏడో తరగతిలో పాఠశాల స్థాయి హాకీ పోటీల్లో ఓ మెరుపు మెరిశాడు. స్టిక్ చేతపట్టి మైదానంలో పాదరసంలా కదంతొక్కాడు. అదును దొరికినప్పుడల్లా ప్రతి బంతిని గోల్‌గా మలిచాడు. అతడి ప్రతిభను చూసి అందరూ శభాష్ అనకుండా ఉండలేకపోయారు. ఈ ప్రతిభకు పట్టం కడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ హాస్టల్లో అరవింద్‌కు సీటు లభించింది. ప్రస్తుతం అక్కడే ఇంటర్ చదువుతున్నాడు. ఏడోతరగతి నుంచి మెుదలుకొని ఇప్పటిదాకా(ఇంటర్మీడియట్) హాకీపై తనకున్న మక్కువను కొంతకూడా తగ్గించుకోలేదు. ప్రతిదినం క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాడు. ఆ తపన ఫలించి, అండర్–19 జాతీయ క్రీడా పోటీ(నేషనల్ స్కూల్ గేమ్స్)ల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ చాన్స్ లభించినప్పుడు అరవింద్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో జిల్లాలో ఉన్న ‘శాయ్’ హాస్టల్లో ఉన్నారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ‘పైకా నేషనల్ గేమ్స్’లోనూ పాల్గొని ప్రతిభ కనబరిచారు. 2014 సంవత్సరంలో అండర్–19 స్టేట్ లెవల్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకున్నారు. 2016 ఫిబ్రవరిలో జూనియర్ విభాగంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీ, రాంచీలలో జరిగిన అండర్–11 స్కూల్ గేమ్స్, కేరళలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ టోర్నీలో, ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవల్ నేషనల్ టోర్నీల్లోనూ అరవింద్ పాల్గొన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్‌లో బెస్ట్ ప్లేయర్ అవార్డు పొందారు. కడపలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు.
అత్యుత్తమ ఆటతీరుకు కేరాఫ్ రామకృష్ణ
పరకాలకు చెందిన రామకృష్ణ ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నారు. 2010 సంవత్సరంలో 7వతరగతిలో స్పోర్ట్స్ హాస్టల్లో సీటు దక్కడంతో ఆయన అడుగులు క్రీడారంగం వైపు మళ్లాయి. ఆ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలనే తపన జ్వలించింది. వెరసి పలు జాతీయ, రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. 2016 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఇటావాలో సీనియర్ నేషనల్స్ హాకీ టోర్నీలో పాల్గొని తన లోని క్రీడా నైపుణ్యాల్ని చాటిచెప్పారు. ఆయన అత్యుత్తమ ఆట తీరుకుగానూ బెస్ట్ ప్లేయర్ అవార్డు వరించింది. 2014 సంవత్సరంలో చెన్నైలో జరిగిన జూనియర్ నేషనల్స్ టోర్నీలోనూ ఉత్తమ క్రీడాకారుడి పురస్కారాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నారు. నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో జరి గిన అంతర్ జిల్లా ఓపెన్ టోర్నమెంట్లలో పాల్గొని ‘బెస్ట్ సెంటర్ ప్లేయర్’ అవార్డులను అందుకున్నారు. హాకీ మైదానంలో బంతిని నిలువరించడంలో, నియంత్రించడంలో.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.