national green trubunal
-
‘పాలమూరు–రంగారెడ్డి’లో.. ఉల్లంఘనలు నిజమే
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో తెలంగాణ సర్కార్ పర్యావరణ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు తేల్చిచెబుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్‌కు శుక్రవారం జాయింట్ కమిటీ నివేదిక ఇచ్చింది. ముందస్తు పనులు చేపట్టడానికి మాత్రమే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతిస్తే.. 120 టీఎంసీలు తరలించే పూర్తిస్థాయి నిర్మాణ పనులు చేపట్టిందని నివేదికలో స్పష్టంచేసింది. తనిఖీల సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతోందని తేల్చిచెప్పింది. ఇలా 1,916 రోజులపాటు నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేపట్టారని.. ఇది ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా–ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) –2006 ప్రకటనలో నిబంధనలను ఉల్లంఘించడమేనని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలిగిందని.. తక్షణ పరిహారం కింద రూ.3,70,87,500లను తెలంగాణ సర్కార్ నుంచి వసూలుచేయాలని జాయింట్ కమిటీ సూచించింది. ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు చేసిన సిఫార్సుల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ నివేదికపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వండి పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫున తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ రామన్ కోరారు. దీంతో సంయుక్త కమిటీ నివేదిక శుక్రవారం ఉదయమే అందినందున దానిని పూర్తిగా చదవాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. ఆరేళ్ల క్రితం నాటి ప్రాజెక్టుపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తే విచారించకూడదన్నారు. పిటిషన్‌కు విచారణ అర్హతలేదని, ఈ తరహా పిటిషన్లు విచారించడానికి ఎన్జీటీకి పరిధిలేదని తెలిపారు. నివేదికపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని వాటిపై వాదనలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ప్రాజెక్టు ఆరేళ్ల నాటిదైనా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లేనని రామన్ స్పష్టంచేశారు. దీంతో వచ్చే మంగళవారం 5వ తేదీలోపు వైఖరి చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది డి. మాధురిరెడ్డిలు హాజరయ్యారు. జాయింట్ కమిటీ నివేదిక ముఖ్యాంశాలివీ.. ►శ్రీశైలం జలాశయం నుంచి రెండు నెలల్లో 120 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టింది. ►తాగునీటి కోసం శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ఎత్తిపోతలను చేపట్టామని.. ఇందుకు అనుమతివ్వాలని 2017లో కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలంటూ కేంద్రం షరతులతో అనుమతిచ్చింది. ►కానీ.. తెలంగాణ సర్కార్ 120 టీఎంసీలు తరలించేలా.. 4,97,976 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ప్రాజెక్టు పనులు చేపట్టింది. నిజానికి 1,226 గ్రామాలకు తాగునీటి కోసం 7.15 టీఎంసీలు సరిపోతాయి. ►ఈ ప్రాజెక్టు అంతర్భాగంగా నార్లాపూర్, ఏదులా, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌లో68 టీఎంసీలు నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మిస్తోంది. ►ఈఐఏ–2006 ప్రకటన మేరకు ఈ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ.. అవేమీ తీసుకోకుండా తెలంగాణ చట్టాన్ని ఉల్లంఘించింది. è అలాగే, నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింది. ►దీనివల్ల తక్షణ పరిహారం కింద రూ.3.70 కోట్లను తెలంగాణ సర్కార్ నుంచి వసూలుచేయాలి. ►కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు అని నివేదిక ఇవ్వగా.. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, గనుల శాఖ సహాయ డైరెక్టర్లు మాత్రం తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు. -
ఎన్జీటీని ఆశ్రయించిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగునీటి ప్రాజెక్ట్‌గానే ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. -
వంద కోట్ల జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరంలోని బకింగ్‌హాం కాలువ, కూవం, అడయార్ నదులు కలుషితం కావడాన్ని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. ఈ నదుల్లో పూడికతీత కరువు, దుర్గంధం వంటి అంశాలతో పాటు నిధులు కేటాయించినా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి రూ. వంద కోట్లు జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీలుకు అధికార వర్గాలు సిద్ధం అవుతున్నాయి. చెన్నైలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్ నదులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నదుల్లో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహించేవి. పడవ సవారీ కూడా సాగేదని చెప్పవచ్చు. కాలక్రమేనా నగరాభివృద్ధితోపాటు స్వచ్ఛత కరువై మురికి నీటి మార్గంగా ఈ నదులు మారాయి. కూవం, అడయార్ నదీ పరివాహక ప్రదేశాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఆ నదుల తీరంలోని పరిశ్రమలు, నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలతో, చెత్తా చెదారాలతో మురికి కూపంగా, అటువైపు వెళ్తే చాలు ముక్కు మూసుకోవాల్సినంత పరిస్థితి తప్పడం లేదు. కూవం ప్రక్షాళన, అడయార్‌కు మహర్దశ అంటూ పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిధుల్ని సైతం కేటాయిస్తున్నా, అందుకు తగ్గపనులు అడుగైనా ముందుకు సాగడం లేదు. అందుకే 2015లో చెన్నై భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. కుండపోత వర్షం, పోటెత్తిన వరదలతో కూవం, అడయార్‌లు ఉప్పొంగి జనావాసాల మీదుగా దూసుకొచ్చాయి. అష్టకష్టాల్ని చెన్నై వాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, పాలకులు గుణపాఠం నేర్వలేదు. వర్షాలు వస్తున్నాయంటే, హడావుడి సృష్టిం చడం, ఆతదుపరి యథారాజా తథా ప్రజా అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ట్రిబ్యునల్‌లో పిటిషన్.. కూవం, అడయార్, బకింగ్‌హాంల కలుషితంపై పర్యావరణ ట్రిబ్యునల్‌లో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది తిరువాన్మియూరుకు చెందిన జవహర్లాల్ షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యులన్ తీవ్రంగా పరిగణించింది. బకింగ్ హాం కాల్వలో అత్యధికంగా నిర్మాణ శకలాలు ఉన్నాయని, మట్టి, చెత్తాచెదారాలు పేరుకు పోయాయని, వర్షా కాలంలో నివాసాల వైపు వరదలు దూసుకొచ్చేంతగా పరిస్థితి ఉందని ఆ పిటిషన్లో జవహర్లాల్ వివరించారు. దీంతో ఇది వరకు దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ విచారించడం మొదలెట్టింది. ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. గతంలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్‌ల ప్రక్షాళన పేరిట 1,646 కోట్లతో ప్రత్యేక పథకం, తొలి విడతగా రూ.604 కోట్ల కేటాయింపు వంటి అంశాల ప్రస్తావన ట్రిబ్యునల్ ముందుకు చేరింది. 2016లో చేపట్టిన చర్యలు, అలాగే, 13 పరిశ్రమలు, ఆ తీరం వెంబడి ఉన్న విద్యా సంస్థల నుంచి వెలుపలకు వస్తున్న మురికి అంతా కలిపి ఆ నదుల్ని పూర్తి స్థాయిలో కలుషితంకు కారణంగా తేల్చే రీతిలో నివేదికలు చేరాయి. వీటన్నింటిని పర్యావరణ ట్రిబ్యునల్ సమగ్రంగానే పరిశీలించినట్టుంది. శనివారం ఢిల్లీలో సాగిన విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యం అన్నది కొట్టచ్చినట్టు కనిపిస్తున్నదని, పాలకులు చర్యలు అసంతృప్తికరంగా ఉందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా విఫలం అయ్యారని, కలుషితం కాబడ్డ నదుల్లో పూడిక తీత, వ్యర్థాల తొలగింపు అన్నది సక్రమంగా సాగలేదని, ప్రక్షాళన అన్నది ప్రకటకే పరిమితం కావడంతో తమిళనాడు ప్రభుత్వానికి రూ.వంద కోట్లు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించి మధ్యంతర ఉత్తర్వుల్ని ట్రిబ్యునల్ జారీ చేయడం గమనార్హం. కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వంద కోట్ల జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఉపయోగించాలని ట్రిబ్యునల్ పేర్కొనడంతో పళని సర్కారుకు షాక్ తగిలినట్టు అయింది. దీంతో సోమవారం పర్యావరణశాఖ, ప్రజా పను లశాఖ వర్గాలతో సీఎం పళనిస్వామి సమాలోచనకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు అప్పీలు ప్రయత్నాలు చేపట్టబోతున్నారు. -
‘సరి–బేసి’కి ప్రాతిపదికేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేయబోతున్నారో తెలపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని పాటించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు సరి–బేసి విధానాన్ని పాటించిన సమయంలో కూడా గాలిలో పీఎం 10, పీఎం 2.5 రేణువుల స్థాయి ఏమాత్రం తగ్గలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ) ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘వాహనాల సరి–బేసి విధానాన్ని ఈ రకంగా అమలు చేయడానికి వీల్లేదు. ఈ విధానంతో ప్రజల్ని మరిన్ని వ్యక్తిగత వాహనాలు కొనాల్సిందిగా మీరు ప్రోత్సహిస్తున్నారు. సరి–బేసి విధానంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని మీరు నిరూపించేవరకు దీని అమలుకు మేం అనుమతివ్వం’ అని జస్టిస్ స్వతంతర్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. సరి–బేసి విధానం ఓ ప్రహసనంగా మారిందని వ్యాఖ్యానించింది. సరి–బేసి విధానం అమలు సందర్భంగా ఢిల్లీలో ప్రజలందరూ ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) నడిపే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా రవాణాను వాడుకునేలా ఢిల్లీ వాసుల్ని ప్రోత్సహించడానికే ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల వివరాలపై స్పష్టతనివ్వడానికి కేసు విచారణ ను గురువారానికి వాయిదా వేయాలని తెలం గాణ ప్రభుత్వం కోరడంపై జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా మేడిగడ్డ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తు న్న గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 672 హెక్టార్ల అటవీ భూమి ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకోలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్టుగా స్టేజ్–1 అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలే దన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘2007 నుంచి ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పరిధిలోని అటవీ భూముల వివరాలు తెలియకపోవడమేంటి’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
అమరావతిపై ఎన్జీటీ విచారణ 19కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈ నెల 19కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేసిన ట్రిబ్యునల్.. అప్పటికీ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేసింది.