న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేయబోతున్నారో తెలపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని పాటించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు సరి–బేసి విధానాన్ని పాటించిన సమయంలో కూడా గాలిలో పీఎం 10, పీఎం 2.5 రేణువుల స్థాయి ఏమాత్రం తగ్గలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ) ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
‘వాహనాల సరి–బేసి విధానాన్ని ఈ రకంగా అమలు చేయడానికి వీల్లేదు. ఈ విధానంతో ప్రజల్ని మరిన్ని వ్యక్తిగత వాహనాలు కొనాల్సిందిగా మీరు ప్రోత్సహిస్తున్నారు. సరి–బేసి విధానంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని మీరు నిరూపించేవరకు దీని అమలుకు మేం అనుమతివ్వం’ అని జస్టిస్ స్వతంతర్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. సరి–బేసి విధానం ఓ ప్రహసనంగా మారిందని వ్యాఖ్యానించింది. సరి–బేసి విధానం అమలు సందర్భంగా ఢిల్లీలో ప్రజలందరూ ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) నడిపే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా రవాణాను వాడుకునేలా ఢిల్లీ వాసుల్ని ప్రోత్సహించడానికే ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment