సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల వివరాలపై స్పష్టతనివ్వడానికి కేసు విచారణ ను గురువారానికి వాయిదా వేయాలని తెలం గాణ ప్రభుత్వం కోరడంపై జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా మేడిగడ్డ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తు న్న గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 672 హెక్టార్ల అటవీ భూమి ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు.
అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకోలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్టుగా స్టేజ్–1 అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలే దన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘2007 నుంచి ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పరిధిలోని అటవీ భూముల వివరాలు తెలియకపోవడమేంటి’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment