National President
-
G20 Summit: జీ20కి పిలవకుండా ఎలా వెళ్లాలి?: ఖర్గే
బనశంకరి: ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు ఎలా వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇంతవరకు ఇలాంటి రాజకీయాలు చేయలేదని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జీ20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు ఆహా్వనం ఇవ్వకపోవడం వంటి పనికిమాలిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తుపై పత్రికల్లో చూశానని, దేవెగౌడ, నరేంద్ర మోదీ చేతులు కలపడం చూశానని అన్నారు. ఇద్దరూ ఒకటి కావడానికి ప్రయతి్నస్తున్నారని, వారి మధ్య సీట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. కానీ, వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. సనాతన ధర్మం విషయంలో రాజకీయాలు తీసుకురాకూడదని, అందరూ ఒక్కటే అనే భావనతో వెళ్లాలని సూచించారు. -
రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా పెనుగొండ లక్ష్మీనారాయణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారతీయ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన దాదాపు 45 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఎనిమిదేళ్లుగా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ వివిధ విమర్శనా గ్రంథాలు రాశారు. అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు నేతృత్వం వహించారు. కాగా జాతీయ అధ్యక్షులుగా పెనుగొండ, ఆంధ్రప్రదేశ్ అభ్యదయ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం, ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
రక్షణ రంగాన్ని మోదీ బలోపేతం చేశారు
డెహ్రాడూన్: రక్షణ రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులను పెంచడం ద్వారా ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని బలోపేతం చేశారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం వ్యాఖ్యానిం చారు. ఉత్తరాఖండ్‌లోని రైవాలాలో మాజీ సైనికు లతో ఆయన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. 2011–12లో రూ. 1,45,000 కోట్లుగా ఉన్న రక్షణరంగ బడ్జెట్ నేడు రూ. 4,78,000 కోట్లకు చేరుకుందని అన్నారు. ప్రధాని మోదీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చెప్పడానికి ఈ అంకెలు చాలని పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శంకుస్థాపన చేసిన ప్రపంచ పొడవైన సొరంగ హైవే (9.02 కిమీ) మోదీ హయాంలో పూర్తయిందన్నారు. 10 వేల అడుగుల ఎత్తులో మనాలిని లేహ్‌తో కలుపుతున్న ఈ సొరంగ మార్గం యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిందన్నారు. నిర్ణయాత్మ కతతో పాటు ముందుచూపు కలిగిన ప్రధాని మోదీ ఢిల్లీలోని వార్ మెమోరియల్ నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఆర్మీలో ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేశారని చెప్పారు. నిర్ణయాలు తీసుకొనే అధికారా న్ని మోదీ సాయుధ బలగాలకు ఇచ్చారని చెప్పారు. పదేళ్ల క్రితం అలాంటి నిర్ణయాల కోసం ప్రభుత్వం చెప్పే వరకు బలగాలు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. -
బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్‌లాల్ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన అనంతరం 2019 ఆగస్ట్ నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతుండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని గత కొంతకాలంగా సోనియాగాంధీ భావిస్తున్నారు. అందులోభాగంగా జూన్‌లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. సోమవారం వర్చువల్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై చర్చించారు. అయితే దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు విషమించిన కారణంగా అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయడమనే సబబు అని సీడబ్ల్యూసీ సభ్యులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. దీంతో సంక్షోభం సద్దుమణగగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడితే మూడు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు. మోదీ తన తప్పులు సరిదిద్దుకోవాలి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా విస్తృత వ్యాప్తిపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిన తప్పుకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మోదీ తన తప్పులను సరిదిద్దుకోవాలని, వ్యక్తిగత ఎజెండాను పక్కనబెట్టాలని దేశానికి సేవ చేయాలని సీబ్ల్యూసీ హితవుపలికింది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం వాస్తవ గణాంకాలను బహిర్గతంచేయడంలేదని ఆరోపించింది. నిజాన్ని దాచేస్తే సరిపోదని, సవాళ్లను ఎదుర్కొంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, కరోనా కట్టడి కోసం చేపట్టే చర్యలు, కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీబ్ల్యూసీ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్థితి చాలా భయంకరంగా మారిందని సోనియా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా వైఫల్యాలు ఎక్కువై పరిస్థితులు మరింత కష్టతరంగా మారాయని వ్యాఖ్యానించారు. వైరస్ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను ప్రభుత్వం వారి ప్రయోజనం కోసం ఆమోదించిందని విమర్శించారు. నత్తనడకన కోవిడ్ వ్యాక్సినేషన్ ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోనియా గాంధీ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ ప్రభుత్వం తన బాధ్యతను విరమించుకుందని, ఆ బాధ్యతను రాష్ట్రాలపై వదిలేసిందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం ఆర్థికంగా మరింత సమర్థించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కోవిడ్ కారణంగా దేశంలో పరిస్థితి మరింత భయంకరంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. పాలన వైఫల్యాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోందన్నారు. ప్రజాభిప్రాయాలు, సద్విమర్శలను పక్కకునెట్టి మోదీ సర్కార్ తన స్వప్రయోజనాలు, ఇతర భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాభీష్టానికి తగ్గట్లు కోవిడ్ చర్యలు చేపట్టాలని సోనియా కోరారు. ఢిల్లీలో కోవిడ్కాలంలోనూ కొనసాగుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వృథాగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం దేశానికి సహాయం చేయడానికి ముందుకొస్తున్న అన్ని దేశాలకు, సంస్థలకు కాంగ్రెస్ తరపున సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరును సమీక్షించారు. ఎన్నికల ఫలితాలతో చాలా నిరాశ చెందుతున్నామని చెబితే సరిపోదని, ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సోనియా తెలిపారు. కేరళ, అస్సాంలో మనం ఎందుకు ఓడిపోయామో, పశ్చిమ బెంగాల్లో కనీసం ఒక్క సీటు ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. మనం వాస్తవికతను అర్థంచేసుకోకపోతే, భవిష్యత్తు కోసం ఎలా పాఠాలు నేర్చుకుంటామని సోనియా గాంధీ సభ్యులను ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. పార్టీ ఓటమికి గల వాస్తవ కారణాలను తెలపాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లను సోనియా ఆదేశించారు. కోవిడ్ కారణంగా ఈ చర్చలో రాహుల్‌గాంధీ పాల్గొనలేదు. -
ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు
చెన్నై: పార్కింగ్ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తనను వేధిస్తున్నారంటూ 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. వాడిన మాస్కులను, వేపాకులను తన ఇంటి ముందు పడేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ వీడియోలను పోలీసులకు అందించారు. మహిళ బంధువు, అప్‌కమింగ్ కమెడియన్ బాలాజీ విజయరాఘవన్.. దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాదం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముగం మా ఆంటీ పర్మిషన్తో పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు గాను 1500 రూపాయల అద్దె చెల్లించాల్సిందిగా మా ఆంటి షణ్ముగాన్ని కోరింది’ అని తెలిపాడు. (72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం) బాలాజీ మాట్లాడుతూ.. ‘దాంతో షణ్ముగం మా ఆంటీ ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్‌లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది’ అని తెలిపారు. షణ్ముగం, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానే కాక కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ హెడ్‌గా పని చేస్తున్నారు. (ప్రయాణికుల్లా వచ్చి...) ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్లో స్పందించారు. ‘మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారింది. సీఎంఓ తమిళనాడు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో, ఫిర్యాదు అన్ని ఫేక్ అంటుంది ఏబీవీపీ. జాతీయ అధ్యక్షుడి పరువు తీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డది. ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఎన్ఎస్యూఐ ఉందని ఆరోపించింది. -
‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లో జరిగిన ఆల్ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు -
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా సుబ్బయ్య
సాక్షి, ముంబై: బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన డా.ఎస్ సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా ముంబైకి చెందిన ఆశిష్ చౌహాన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి డా.రామన్ త్రివేది తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఏబీవీపీ 63వ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. -
ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేశ్
సాక్షి ప్రతినిధి,న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ గురువారం తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లు ఉంటారు. ఆగ్రాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వెల్లడించారు. అలాగే రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా నరేశ్ ఉత్తమ్ మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేశ్ స్వయంగా ఆహ్వానించినా తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ ఎస్పీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో అఖిలేశ్ అధ్యక్షతనే ఆ పార్టీ 2019లో లోక్‌సభ, 2022లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఈ పరిణామాలు పార్టీపై అఖిలేశ్ పట్టు మరింత పెరిగిందన్న సంకేతాలిస్తున్నాయి. సమావేశం అనంతరం అఖిలేశ్ మాట్లాడుతూ... తన తండ్రి హాజరుకాకపోయినా ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారని తెలిపారు. అఖిలేశ్ ఎన్నికతో ములాయం సింగ్ యాదవ్ శకం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా ములాయం, శివపాల్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం రాబోయే రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం: రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్, చరణ్ సింగ్ లాంటి సామ్యవాద నాయకుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ములాయం 1967లో తొలిసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి యూపీలో బలమైన శక్తిగా ఎదిగారు. ఆ తరువాత మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1997లో దేవెగౌడ రాజీనామా చేసిన తరువాత ములాయం ప్రధాని పదవికి ప్రధాన పోటీదారునిగా నిలిచినా, ఆర్జేడీ అధినేత లాలూతో పాటు మరికొందరు వ్యతిరేకించడంతో ఆయన కు నిరాశ తప్పలేదు. 2012లో జరిగిన యూపీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించినా అనారోగ్యం కారణంగా తనకు బదులు కుమారుడు అఖిలేశ్‌కు సీఎం బాధ్యతలు అప్పగించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీపై పట్టుకోసం జరిగిన కుటుంబ కలహాల కారణంగా తండ్రి, కొడుకుల మధ్య దూరం పెరిగింది. శివపాల్ మద్దతుతో ములాయం, రామ్ గోపాల్ మద్దతుతో అఖిలేశ్ వేర్వేరు వర్గాలుగా ఏర్పడ్డారు. -
క్రైస్తవులపై నిర్లక్ష్యం తగదు
విజయవాడ (గుణదల) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉన్నా కేవలం ఒక సంప్రదాయానికే పెద్ద పీట వేసి రాజ్యాంగాన్ని కించపరుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేడెట్ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు గేరా హానోక్ విమర్శించారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మతాలకు చెందిన వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పుష్కరాల పేరుతో దుర్వినియోగం చేయటమే కాకుండా ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ దేశంగా పిలిచే భారతదేశంలో మత పరంగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం శోచనీయమన్నారు. అభివృద్ధి పేరుతో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తారాపేట చర్చిని కూల్చేయటం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బహిరంగ లేఖ ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జాతీయ గౌరవ అ«ధ్యక్షులు బిషప్ జాన్ ఎస్. డి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు ఎం ఎలీయూజర్, కొలమూరి ప్రభాకర్, సలహాదారు పీఎస్ రావు, యువజన విభాగం అధ్యక్షులు అభిలాష్, నగర అధ్యక్షులు కె. ప్రభాకర్, కోశాధికారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
-
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు
-
పీఆర్సీఐ కొత్త అధ్యక్షుడిగా బి.ఎన్.కుమార్
హైదరాబాద్: పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) జాతీయ అధ్యక్షుడిగా బి.ఎన్.కుమార్ నియమితులయ్యారు. కాన్సెప్ట్ పీఆర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అయిన కుమార్ గతంలో పీఆర్సీఐ ఉపాధ్యక్షుడిగా, ముంబై చాప్టర్, పీఆర్సీఐకు అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారని పీఆర్సీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్‌గా, జర్నలిస్టుగా కుమార్‌కు 40 ఏళ్ల అపార అనుభవం ఉందని పీఆర్సీఐ చీఫ్ మెంటార్, చైర్మన్ ఎమిరిటస్ కూడా అయిన ఎం.బి. జయరామ్ పేర్కొన్నారు. -
మందుల తయారీ భేష్
* 210 దేశాలకు ఎగుమతి * నకిలీ మందులకు అడ్డుకట్ట * ఐఎండీఏ ప్రదర్శనలో జాతీయ అధ్యక్షులు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ సంస్థలు అంతర్జాతీయ నాణ్యత కలిగిన మందులను తయారుచేసే స్థాయికి చేరుకున్నాయని ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (ఐఎండీఏ) అధ్యక్షులు వీ.వీరమణి తెలిపారు. అందుకే 210 దేశాల్లో భారతీయ ఉత్పత్తులను వినియోగిస్తున్నారని చెప్పారు. ఐఎండీఏ- పారామాక్ సౌత్-2014 పేరుతో చెన్నై ట్రేడ్‌సెంటర్‌లో రెండు రోజుల ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం లో అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మందుల ధరలను మాత్రం తగ్గిస్తున్నామని తెలిపారు. దేశం మొత్తం డొమెస్టిక్ మందుల వాడకం రూ.70 వేల కోట్లుకాగా ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతమన్నారు. అలాగే రూ.90వేల కోట్ల విదేశీ ఎగుమతుల్లో 30 శాతం దక్షిణాది రాష్ట్రాల ఘనతగా ఆయన పేర్కొన్నారు. విదే శాల నుంచి ఆర్డర్లు పొందడం అంత సులువుకాదన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌కు వచ్చి ఉత్పత్తి విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిగానీ ఎగుమతులకు అంగీకరించరని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 200 ప్రముఖ మందుల కంపెనీలు తమ ఉత్పత్తులను రెండురోజుల పాటు ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యకరమైన భారత ప్రగతికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని అన్నారు. డెప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ మణివ ణ్ణన్ మాట్లాడుతూ నకిలీ మందుల చలామణి దాదాపు అరికట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చె ప్పారు. 20 ఏళ్ల క్రితం ఎక్కువగా ఉండినా ప్రస్తుతం .004 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. నకిలీల అడ్డుకట్టకు, కాలం చెల్లిన మందులు అమ్మకుండా కట్టడిచేసేందుకు గతంలో కంటే పెద్దసంఖ్యలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ల్యాబ్‌ల సంఖ్యకూడా పెంచామన్నారు. ఐఎండీఏ తమిళనాడు శాఖ చైర్మన్ ఎం.రాజరత్నం, వైస్ చైర్మన్ జయశీలన్ మాట్లాడుతూ దేశంలో నకిలీ నోట్ల చలామణిలా నకిలీ మందులని, ఎంతగా నిఘా పెట్టినా కొన్ని మార్కెట్టుకు చేరుతున్నాయని తెలిపారు. పేరొందిన సంస్థలు ఎంతమాత్రం నకిలీలను ఉత్పత్తి చేయడం లేదని ఆయన గుర్తుచేశారు. -
బీజేపీ మద్దతుతోనే తెలంగాణ
వెంకయ్యనాయుడు సూర్యాపేట, న్యూస్‌లైన్ బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ సూర్యాపేటలో ఆ పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల అభిష్టం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణ ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలకు ఓటువేస్తే కేంద్రంలో ఏమీ చేయలేరన్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందని, 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని అయినా రాష్ట్రం సాధించలేక పోయిందన్నారు. బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేకపోయేదన్నారు. సోనియాగాంధీ వరం వల్లే అంటూ తెలంగాణలో.. బీజేపీ వల్లే రాష్ట్రం విడిపోయిందని సీమాంధ్రలో చెబుతూ కాంగ్రెస్ నాటకాలాడుతుందని ఆరోపించారు. బీజేపీ హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి చెందిందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, రామోజి షణ్ముఖ, పోతెపాక సాంబయ్య, రామినేని ప్రభాకర్, రంగరాజు రుక్మారావు, చలమల్ల నర్సింహ, గోదల రంగారెడ్డి, నల్లగుంట్ల అయోధ్య, జీడి భిక్షం, సారగండ్ల మాణిక్యమ్మ పాల్గొన్నారు.