సాక్షి ప్రతినిధి,న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ గురువారం తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లు ఉంటారు. ఆగ్రాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వెల్లడించారు. అలాగే రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా నరేశ్ ఉత్తమ్ మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేశ్ స్వయంగా ఆహ్వానించినా తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ ఎస్పీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో అఖిలేశ్ అధ్యక్షతనే ఆ పార్టీ 2019లో లోక్‌సభ, 2022లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఈ పరిణామాలు పార్టీపై అఖిలేశ్ పట్టు మరింత పెరిగిందన్న సంకేతాలిస్తున్నాయి. సమావేశం అనంతరం అఖిలేశ్ మాట్లాడుతూ... తన తండ్రి హాజరుకాకపోయినా ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారని తెలిపారు.
అఖిలేశ్ ఎన్నికతో ములాయం సింగ్ యాదవ్ శకం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా ములాయం, శివపాల్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం రాబోయే రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.
50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం: రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్, చరణ్ సింగ్ లాంటి సామ్యవాద నాయకుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ములాయం 1967లో తొలిసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి యూపీలో బలమైన శక్తిగా ఎదిగారు. ఆ తరువాత మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1997లో దేవెగౌడ రాజీనామా చేసిన తరువాత ములాయం ప్రధాని పదవికి ప్రధాన పోటీదారునిగా నిలిచినా, ఆర్జేడీ అధినేత లాలూతో పాటు మరికొందరు వ్యతిరేకించడంతో ఆయన కు నిరాశ తప్పలేదు. 2012లో జరిగిన యూపీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించినా అనారోగ్యం కారణంగా తనకు బదులు కుమారుడు అఖిలేశ్‌కు సీఎం బాధ్యతలు అప్పగించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీపై పట్టుకోసం జరిగిన కుటుంబ కలహాల కారణంగా తండ్రి, కొడుకుల మధ్య దూరం పెరిగింది. శివపాల్ మద్దతుతో ములాయం, రామ్ గోపాల్ మద్దతుతో అఖిలేశ్ వేర్వేరు వర్గాలుగా ఏర్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment