లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు, అతని కుమారుడు అఖిలేష్‌కు అతి సన్నిహితునిగా పేరొందారు.
నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్ ఒక ట్వీట్‌లో తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్ యాదవ్ నా టికెట్ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.
యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటున్నారు.
ఇటీవల బల్లియా లోక్‌సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే నాడు ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్ రాయ్ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment