
లక్నో : ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఊహించని పోస్టర్లు వెలిశాయి. యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, మరో మాజీ సీఎం బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాదు, బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, మరో ఎస్పీ నేత అజాం ఖాన్ ఫొటోలు కూడా ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. మరింత ఆశ్చర్యకరంగా మాయావతి ఫొటో మాత్రం చాలా పెద్దగా వేశారు.
పుల్పూర్, గోరఖ్‌పూర్‌లో తమకు విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు అని పేర్కొంటూ ఎస్పీ కార్యకర్త అహ్మద్ లారీ ఈ ఫ్లెక్సీలు వేయించారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్, పుల్పూర్ నియోజవర్గాలను బీఎస్పీ సాయంతో బీజేపీని ఓడించి ఎస్పీ తమ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం అఖిలేశ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా పోస్టర్లు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.