National Security Force
-
ఉగ్రవేటకు బ్లాక్ క్యాట్ కమెండోలు
శ్రీనగర్/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్ఎస్జీ కమెండోల బృందాన్ని కశ్మీర్‌కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్‌కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్ఎస్జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్చేసే రాడార్లు, స్నైపర్ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేర్పాటువాదుల అరెస్ట్ జమ్మూకశ్మీర్‌లో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫారుఖ్‌ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు. సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారని పాకిస్తాన్ విమర్శించింది. -
‘ఉగ్రవాదులకు ప్రజల మద్దతు’
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, చొరబాటుదార్లకు ప్రజల మద్దతు లభిస్తోందని, దీన్ని అడ్డుకోకపోతే ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉంటాయని జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) తన నివేదికలో హెచ్చరించింది. ప్రజలు ఎలా మద్దతిస్తున్నారో ఇందులో వివరించకున్నా.. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారికి, స్థానికులకు మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో జరిగిన పేలుళ్లను విశ్లేషిస్తూ నివేదిక రూపొందించారు. నివేదిక ప్రకారం.. ఆయుధాగారాల్లో తయారు చేసిన గ్రెనేడ్ల వంటి వాటిని కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్లు వాడుతున్నట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో మొత్తం 93 పేలుళ్లు జరగ్గా 39 మంది చనిపోయారు. ఒక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే 48 పేలుళ్లు జరిగాయి. -
వీవీఐపీ భద్రత నుంచి కమాండోల ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చర్యల్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమెండోలు మరింతగా పాలుపంచుకునే దిశగా.. 600 మంది కమాండోలను వీవీఐపీల భద్రత యూనిట్ నుంచి ఎన్ఎస్జీ తప్పించింది. ప్రముఖులకు భద్రత నిర్వహిస్తున్న ఎన్ఎస్జీ కమాండోల్ని వెనక్కు రప్పించాలని రెండేళ్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో ఎన్ఎస్జీ సిబ్బందిని ఇకమీదట కచ్చితంగా ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కొనేందుకే వినియోగించాలన్న భావనకు వచ్చారు. తాజాగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం 11వ ప్రత్యేక రేంజర్స్ గ్రూప్(ఎస్ఆర్జీ)లోని మూడు బృందాల్లో రెండింటిని వీవీఐపీ భద్రత కార్యకలాపాల నుంచి ఉపసంహరించాలని భావిస్తున్నారు. వీరిని స్పెషల్ యాక్షన్ గ్రూప్(ఎస్ఏజీ)తో కలసి ఉగ్రవాద మూకలపై పోరాడేందుకు సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఎన్ఎస్జీ కమాండో బృందాలు ప్రస్తుతం ఐదు ప్రాథమిక యూనిట్లుగా ఉంది. -
భారత్‌ని హెచ్చరించడం ఎవ్వరి వల్ల కాదు
-
ఇక అడవుల్లోనూ ఎన్ఎస్జీ ఆపరేషన్లు
కమాండోలకు ‘బందీల విడుదల’లో శిక్షణ న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వీవీఐపీలకు భద్రత వంటి పట్టణప్రాంత కార్యకలాపాలకే పరిమితమైన జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) ఇక దట్టమైన అడవుల్లోనూ సత్తా చాటనుంది! ఉన్నతస్థాయి నేతలను, అధికారులను నక్సల్ కిడ్నాప్ చేస్తుండడం పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి బందీల విడుదలపై దృష్టి సారించింది. దీనికోసం అడవుల్లో కచ్చితత్వంతో కూడిన ఆపరేషన్లను ఎలా చేపట్టాలన్నదానిపై తన బ్లాక్ క్యాట్ కమాండోల్లోని ఒక బృందానికి శిక్షణ ఇస్తోంది. ఎన్ఎస్జీ 30 ఏళ్ల చరిత్రలో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లోని దర్భాఘాట్‌లో రాజకీయ నేతలను నక్సల్స్ హతమార్చడం, మల్కనగిరి(ఒడిశా), సుక్మా(ఛత్తీస్) కలెక్టర్లను అపహరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సల్స్‌కు చెక్ పెట్టేందుకు ఎన్ఎస్జీ ఓ ప్రత్యేక దళాన్ని సిద్ధం చేస్తోందని వ్యూహాత్మక భద్రతా నిపుణులు చెప్పారు. దీని కోసం ఎన్ఎస్జీ డెరైక్టర్ జనరల్ జేఎన్ చౌధురి ఓ బ్లూప్రింట్ సిద్ధం చేశారని, దానికి అనుగుణంగా ప్రస్తుతం కమాండోలకు శిక్షణ ఇస్తున్నారని వెల్లడించారు. హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోకి చేరుకోవడం, పారాచ్యూట్ల నుంచి నిశ్శబ్దంగా దిగడం, నిఘా సమాచారంతో రహస్యంగా నక్సల్స్ శిబిరాలకు చేరుకోవడం ఈ శిక్షణలో ఉన్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత దేశంలో నాలుగు చోట్ల నెలకొల్పిన ఎన్ఎస్జీ హబ్‌లను ఈ కమాండోలు వాడుకోవచ్చని బ్లూప్రింట్‌లో ఉంది. వామపక్ష తీవ్రవాదులను ఉగ్రవాదులుగా కేంద్ర ప్రభుత్వంలో చాలా ఏళ్లకిందటే ప్రకటించిన నేపథ్యంలో ‘టార్గెట్ జంగిల్’ శిక్షణ మొదలైంది.