Nawab Shafath Ali Khan
-
హైదరాబాద్ పోటుగాడి వేట.. ఉత్కంఠ
- 15 మందిని చంపేసిన ఏనుగు కోసం వేట.. కొనసాగుతోన్న ఉత్కంఠ - జార్ఖండ్ ప్రభుత్వ అభ్యర్థనతో రంగంలోకి నవాబ్ షఫత్ అలీ ఖాన్ - నేడు(ఆగస్టు 12) ప్రంపంచ ఏనుగుల దినోత్సవం న్యూఢిల్లీ: గ్రామలమీదపడి జనాన్ని చంపేస్తోన్న మదపుటేనుగు ఆట కట్టించేందుకు హైదరాబాద్‌కు చెందిన టాప్ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మళ్లీ తుపాకి పట్టారు. గడిచిన కొద్ది రోజులుగా జార్ఖండ్, బిహార్లలో 15 మంది ఆదివాసీలను పొట్టనపెట్టుకున్న భారీ ఎనుగును మట్టుపెట్టేందుకు.. ఆయన షహీబ్‌గంజ్ అడవుల్లో ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ ఉత్కంఠభరితంగా సాగుతున్నదని, నేడో, రేపో.. ఆ మహమ్మారి చనిపోయిందనే వార్త రావొచ్చని జార్ఖండ్ అటవీశాఖ ముఖ్య అధికారి ఎల్ఆర్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. జార్ఖండ్-బిహార్ సరిహద్దులోని షహీబ్‌గంజ్ అభయారణ్యంలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు.. గ్రామాలపై దాడిచూస్తూ ఇప్పటివరకు 15 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ అబయారణ్యంలో పహారియా తెగకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. ఏనుగు దాడిలో చనిపోయిన 15 మందిలో 9మంది పహారియా తెగకు చెందినవారే కావడం గమనార్హం. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అటవీశాఖ చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో చివరికి ఏనుగును చంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎల్ఆర్సింగ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్.. దేశంలోనే ఏకైక లెసైన్డ్స్ హంటర్. వేటగాడిగా 40 ఏళ్ల అనుభవం. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సూచన మేరకు ఆయన 12 చిరుతపులులను, 7 ఏనుగులను, 3 పులులను హతమార్చారు. 15,200 అడవి పందులు, 1300 అడవి కుక్కలు, 1000 అడవి దున్నలు కూడా నవాబ్ తూటాలకు నేలకొరిగివాటిలో ఉన్నాయి. జనం కోసమే తాను తుపాకి పట్టానని, ప్రభుత్వాల అభ్యర్థన మేరకే క్రూరమృగాలను చంపుతున్నానని అంటారు నవాబ్. ఇదిలా ఉంటే, ఆగస్టు 12.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం కావడంతో నవాజ్ హంటింగ్పై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరజంతువులను చంపించేందుకు నవాజ్‌ను పిలిపించడంపై కేంద్ర మంత్రి మనేకా గాంధీ సాక్షాత్తు పార్లమెంట్‌లోనే మండిపడ్డారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా నవాజ్ మాత్రం తన పని తాను చేసుకుపొతున్నారు. -
ఏనుగు కోసం అలీ ఖాన్ వేట
మదపుటేనుగు కోసం గయలో ప్రారంభించిన హైదరాబాదీ మత్తు ఇచ్చి బంధించాలని బీహార్ ప్రభుత్వం వినతి హైదరాబాద్ : దేశంలోనే ఏకైక లెసైన్డ్స్ హంటర్ హైదరాబాదీ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మరో ‘వేట’ ప్రారంభించారు. బీహార్‌లోని గయ అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏనుగును బంధించేందుకు రంగంలోకి దిగారు. ఆ మదపుటేనుగుకు మత్తిచ్చి పట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అలీఖాన్‌ను ఆహ్వానించింది. బుధవారం రాత్రి గయ చేరుకున్న ఆయన గురువారం నుంచి ఆపరేషన్ ప్రారంభించారు. 15 ఏళ్ల వయసున్న మగ ఏనుగు పది రోజుల క్రితం జార్ఖండ్ నుంచి బీహార్‌లోకి ప్రవేశించి గయ ఫారెస్ట్ డివిజన్‌లోకి చొరబడింది. పగటిపూట అక్కడి కొండల్లో తలదాచుకుంటున్న ఈ గజరాజు రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. పంట, ఆహారధాన్యాలు, ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపైనా విరుచుకుపడుతోంది. దీన్ని తరిమికొట్టడానికి అక్కడి అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు, సిబ్బంది సైతం క్షతగాత్రులయ్యారు. దీంతో ఆ ఏనుగుకు మత్తుమందు ఇచ్చి (ట్రాంక్వలైజేషన్) పట్టుకోడానికి సమర్థుడి కోసం గాలించిన బీహార్ అటవీ శాఖ దేశ వ్యాప్తంగా పలువురి పేర్లు పరిశీలించింది. గతంలో చేసిన ఆపరేషన్లను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పని చేయడానికి షఫత్ అలీఖాన్ సమర్థుడని గుర్తించింది. ఈ మేరకు ఆయన్ను ఆహ్వానిస్తూ బీహార్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్ఎస్ చౌదరి బుధవారం అలీ ఖాన్‌ను లేఖ రాశారు. హుటాహుటిన బయలుదేరి వెళ్లిన ఆయన గురువారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. నగరంలోని ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన షఫత్ అలీఖాన్ దేశవ్యాప్తంగా మ్యానీటర్లుగా మారిన పులులు, చిరుతల్ని మట్టుపెట్టారు. జనానికి ప్రాణహాని కలిగిస్తు న్న మదగజాల్నీ హతమార్చారు. 1976లో కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెడ్డీ కోటలో పులితో ప్రారంభమైన ఆయన ‘వేట’ అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల్లో సాగింది. షఫత్ అలీ ఖాన్ ‘సాక్షి’తో ఫోనులో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేయాలి. బాధిత గ్రామాల్లో పర్యటించి ఏనుగు వ్యవహారశైలిని అర్థం చేసుకోవాలి. ఆ తరవాత ఎక్కడ? ఎలా? దానికి మత్తుమందు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం’ అని అన్నారు. -
అదిగో పులి! ఇదిగో షఫత్ అలీ!!
ఉత్తరప్రదేశ్ అడవుల్లో గత కొన్నాళ్లుగా పులికీ మనిషికీ మధ్య పోరాటం సాగుతోంది. ఈ పోరాటంలో చివరికి ఎవరు ఎవరి చేత చిక్కుతారు? పులి మిగులుతుందా? అలీ మిగులుతాడా? గత కొన్ని పగళ్లు, కొన్ని రాత్రిళ్లుగా నవాబ్ షఫత్ అలీ ఖాన్ తుపాకీ భుజాన వేసుకుని ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ అడవుల్లో మాటు వేసి ఉన్నాడు. చెట్లపైన, ఎత్తయిన మంచెల మీద, ప్రభుత్వ పాఠశాల గదుల్లో పొంచి ఉండి అతడు వే టాడబోతున్నది... ఇప్పటికే తొమ్మిది మంది గ్రామస్థులను పొట్టన పెట్టుకున్న పెద్ద పులిని! అతడే వేటాడతాడా? లేక పులే అతడిని వేటాడుతుందా అన్నది ఏ క్షణమైనా తేలిపోవచ్చు. అయితే మనమంతా కోరుకోవలసింది షఫత్ పులిని వేటాడాలని. అవును. పులి వేటాడితే షఫత్ ప్రాణాలతో ఉండడు. షఫత్ వేటాడితే పులి ప్రాణాలతో ఉంటుంది. పులిని చంపడం అతడి ఉద్దేశం కాదు. మత్తు బులెట్లతో పులిని బంధించడం అతడి మొదటి ప్రాధాన్యత. పులిని చంపడమన్నది అతడి చేతుల్లో లేని రెండో ప్రాధాన్యత. కిల్లర్ టైగర్ బారి నుండి తమ రాష్ట్ర ప్రజలను కాపాడమని కోరుతూ, కొద్ది రోజుల క్రితమే షఫత్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి పిలిపించుకుంది. దట్టమైన ఆ అడవిలోకి అడుగుపెట్టగానే షఫత్కు ఓ విషయం అర్థమైంది. అక్కడ సంచరిస్తున్నది ఆడపులి! ఆడపులి పంజా గుర్తులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయట. పులిజాతి అంతరిస్తున్నట్లే... పులుల ప్రవర్తనల గురించి చెప్పగలవారిలో షఫత్‌ను అంతరించిపోతున్న ‘ట్రాకర్’లలో ఒకరిగా భావించాలి. క్రూర మృగాల అడుగు జాడలను బట్టి వాటి కదలికలను పసిగట్టే నిపుణులే ట్రాకర్లు. ‘పులిని బంధించడం ఎలా?’ అని తరచు అటవీశాఖ ఏర్పాటు చేసే తరగతి గది పాఠాలు అడవులలో ఎంతవరకు ఉపయోగపడతాయన్నది శిక్షణ పొందిన ఆ వేటగాళ్లకే తెలియాలి. కానీ షఫత్ వేరు. తాతగారు నవాబ్ సుల్తాన్ అలీ ఖాన్ బహదూర్‌తో కలిసి తన ఐదవ ఏట నుంచే అడవుల్లో వేటకు వెళ్లిన అనుభవం అతడికి ఉంది. బ్రిటిష్ దొరలకు బహదూర్ వేట సంరక్షకునిగా, సలహాదారుగా ఉండేవారు. ఇక షఫత్ జాతీయస్థాయిలో షూటింగ్ చాంపియన్ అయి వుండడం కూడా అతడికి బాగా కలిసి వచ్చింది. జంతువులకు మత్తివ్వడానికి సాధారణ పశువైద్యులు చాలు. కానీ తప్పించుకు తిరుగుతున్న మృగానికి మత్తివ్వడానికి షూటింగ్ కూడా తెలిసి ఉండాలి. అందుకే ఈ రెండూ తెలిసిన షఫత్ దగ్గర ఆంధ్రప్రదేశ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, బీహార్, కర్నాటక రాష్ట్రాలలోని అటవీశాఖ అధికారులు, పశువైద్యులు శిక్షణ పొందుతుంటారు. షఫత్ తొలిసారి తన 19 యేట ప్రభుత్వం తనకు అప్పజెప్పిన పనిని విజయవంతంగా నెరవేర్చారు. మైసూరులో వేర్వేరు సమయాలలో పన్నెండు మందిని తొక్కి చంపిన మదగజానికి మత్తిచ్చి అతడు పడగొట్టాడు. నాటి నుంచి నేటి వరకు పన్నెండుసార్లు క్రూరమృగాలను బంధించాడు. కాగా షఫత్ ఇప్పుడు భుజానికెత్తుకున్నది అత్యంత ప్రమాదకరమైన పదమూడవ బాధ్యత. ఎందుకింత ప్రమాదకరం అంటే, మనుషులను చంపి తప్పించుకు తిరుగుతున్న ఈ ఆడపులి ఒక్క ఉత్తరప్రదేశ్ అటవీప్రాంత పరిధిలోనే సంచరించడం లేదు. కాసేపు సరిహద్దుల్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో వేటకు వస్తుంది. ఇంకాసేపు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లిపోతుంది. పైగా అడవిలో ఉన్నది అదొక్కటే పులి కాదు. మిగతావాటి నుంచీ కాపాడుకోవాలి. ఏది ఎటు నుంచి వచ్చి మీద పడుతుందో తెలీదు. ఇవన్నీ అలా ఉంచితే, నరమాంసం రుచిమరిగిన ఈ పులి ఉత్తరప్రదేశ్ సరిహద్దుదాటి ఉత్తరాంచల్లోకి ప్రవేశించిందా... ఇక షఫత్ చేసేదేమీ లేదు. అక్కడి వరకే అతడి వేట పరిధి. ఏదైమేనా ఆ ‘కిల్లర్ టైగర్’ త్వరగా తన చేతికి చిక్కాలని షఫత్ ఆశిస్తున్నారు. లేదంటే గ్రామస్థుల నుంచి జీవవైవిధ్యానికి హాని పొంచి ఉంటుంది. పులిని చంపడం కోసం వారు మేకలకు విషం ఇచ్చి వాటిని చెట్లకు ఎరగా కట్టేస్తారు. పులి వాటిని తిని చనిపోతే, ఆ చనిపోయిన పులిని తిని రాబందులు చనిపోతాయి. ఇదంతా ఒక విషవలయం. ఈ వలయం నుంచి ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడ్డానికి షఫత్ తన పనిని వేగవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. అడవిలో షఫత్ ఒక్కరే ఉండరు. ఆయనతో పాటు కొందరు సహాయకులు ఉంటారు. వారంతా ఆయన సూచనల మేరకు పులిని వలపన్నేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ఉంటారు. పులి దొరికేవరకు అందరూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒక్కరు లఘశంక కోసం ఆగినా మిగతావారు ఆ ఒక్కరి చుట్టూ రక్షణగా నిలుచోవలసిందే. ఇంతా చేసి, ప్రాణాలకు తెగించీ షఫత్ చేస్తున్నది డబ్బుల కోసం కాదు. మనుషుల మీద అతడికి ఎంత మక్కువో, వన్యమృగాల మీదా అంతే ప్రేమ. రెండు జాతులకూ అతడు హితుడు. అంతమాత్రాన 55 ఏళ్ల షాఫత్ తన కుమారుడు అస్ఘర్‌కు తన సాహసోపేతమైన వారసత్వాన్ని ఇవ్వదలచుకోవడం లేదు. ‘‘ఇంట్లో సంపాదించేవాళ్లు ఒక్కరైనా ఉండాలి కదా’’ అంటారు నవ్వుతూ.