ఏనుగు కోసం అలీ ఖాన్ వేట | Nawab shafath ali khan hunt in gaya forest | Sakshi
Sakshi News home page

ఏనుగు కోసం అలీ ఖాన్ వేట

Published Fri, Jan 22 2016 10:57 AM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

ఏనుగు కోసం అలీ ఖాన్ వేట - Sakshi

ఏనుగు కోసం అలీ ఖాన్ వేట

మదపుటేనుగు కోసం గయలో ప్రారంభించిన హైదరాబాదీ
మత్తు ఇచ్చి బంధించాలని బీహార్ ప్రభుత్వం వినతి

 
హైదరాబాద్ : దేశంలోనే ఏకైక లెసైన్డ్స్ హంటర్ హైదరాబాదీ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మరో ‘వేట’ ప్రారంభించారు. బీహార్‌లోని గయ అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏనుగును బంధించేందుకు రంగంలోకి దిగారు. ఆ మదపుటేనుగుకు మత్తిచ్చి పట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అలీఖాన్‌ను ఆహ్వానించింది. బుధవారం రాత్రి గయ చేరుకున్న ఆయన గురువారం నుంచి ఆపరేషన్ ప్రారంభించారు.
 
15 ఏళ్ల వయసున్న మగ ఏనుగు పది రోజుల క్రితం జార్ఖండ్ నుంచి బీహార్‌లోకి ప్రవేశించి గయ ఫారెస్ట్ డివిజన్‌లోకి చొరబడింది. పగటిపూట అక్కడి కొండల్లో తలదాచుకుంటున్న ఈ గజరాజు రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. పంట, ఆహారధాన్యాలు, ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపైనా విరుచుకుపడుతోంది. దీన్ని తరిమికొట్టడానికి అక్కడి అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు, సిబ్బంది సైతం క్షతగాత్రులయ్యారు. దీంతో ఆ ఏనుగుకు మత్తుమందు ఇచ్చి (ట్రాంక్వలైజేషన్) పట్టుకోడానికి సమర్థుడి కోసం గాలించిన బీహార్ అటవీ శాఖ దేశ వ్యాప్తంగా పలువురి పేర్లు పరిశీలించింది. గతంలో చేసిన ఆపరేషన్లను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పని చేయడానికి షఫత్ అలీఖాన్ సమర్థుడని గుర్తించింది. ఈ మేరకు ఆయన్ను ఆహ్వానిస్తూ బీహార్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్‌ఎస్ చౌదరి బుధవారం అలీ ఖాన్‌ను లేఖ రాశారు.
 
హుటాహుటిన బయలుదేరి వెళ్లిన ఆయన గురువారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. నగరంలోని ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన షఫత్ అలీఖాన్ దేశవ్యాప్తంగా మ్యానీటర్లుగా మారిన పులులు, చిరుతల్ని మట్టుపెట్టారు. జనానికి ప్రాణహాని కలిగిస్తు న్న మదగజాల్నీ హతమార్చారు.

1976లో కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెడ్‌డీ కోటలో పులితో ప్రారంభమైన ఆయన ‘వేట’ అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల్లో సాగింది. షఫత్ అలీ ఖాన్ ‘సాక్షి’తో ఫోనులో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేయాలి. బాధిత గ్రామాల్లో పర్యటించి ఏనుగు వ్యవహారశైలిని అర్థం చేసుకోవాలి. ఆ తరవాత ఎక్కడ? ఎలా? దానికి మత్తుమందు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement