అదిగో పులి! ఇదిగో షఫత్ అలీ!! | Hunting man-eaters: clues and challenges | Sakshi
Sakshi News home page

అదిగో పులి! ఇదిగో షఫత్ అలీ!!

Published Sun, May 25 2014 1:20 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

అదిగో పులి! ఇదిగో షఫత్ అలీ!! - Sakshi

అదిగో పులి! ఇదిగో షఫత్ అలీ!!

ఉత్తరప్రదేశ్ అడవుల్లో గత కొన్నాళ్లుగా పులికీ మనిషికీ మధ్య పోరాటం సాగుతోంది. ఈ పోరాటంలో చివరికి ఎవరు ఎవరి చేత చిక్కుతారు? పులి మిగులుతుందా? అలీ మిగులుతాడా?
 
 గత కొన్ని పగళ్లు, కొన్ని రాత్రిళ్లుగా నవాబ్ షఫత్ అలీ ఖాన్ తుపాకీ భుజాన వేసుకుని ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ అడవుల్లో మాటు వేసి ఉన్నాడు. చెట్లపైన, ఎత్తయిన మంచెల మీద, ప్రభుత్వ పాఠశాల గదుల్లో పొంచి ఉండి అతడు వే టాడబోతున్నది... ఇప్పటికే తొమ్మిది మంది గ్రామస్థులను పొట్టన పెట్టుకున్న పెద్ద పులిని! అతడే వేటాడతాడా? లేక పులే అతడిని వేటాడుతుందా అన్నది ఏ క్షణమైనా తేలిపోవచ్చు. అయితే మనమంతా కోరుకోవలసింది షఫత్ పులిని వేటాడాలని. అవును. పులి వేటాడితే షఫత్ ప్రాణాలతో ఉండడు. షఫత్ వేటాడితే పులి ప్రాణాలతో ఉంటుంది. పులిని చంపడం అతడి ఉద్దేశం కాదు. మత్తు బులెట్‌లతో పులిని బంధించడం అతడి మొదటి ప్రాధాన్యత. పులిని చంపడమన్నది అతడి చేతుల్లో లేని రెండో ప్రాధాన్యత.
కిల్లర్ టైగర్ బారి నుండి తమ రాష్ట్ర ప్రజలను కాపాడమని కోరుతూ, కొద్ది రోజుల క్రితమే షఫత్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి పిలిపించుకుంది. దట్టమైన ఆ అడవిలోకి అడుగుపెట్టగానే షఫత్‌కు ఓ విషయం అర్థమైంది. అక్కడ సంచరిస్తున్నది ఆడపులి! ఆడపులి పంజా గుర్తులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయట. పులిజాతి అంతరిస్తున్నట్లే... పులుల ప్రవర్తనల గురించి చెప్పగలవారిలో షఫత్‌ను అంతరించిపోతున్న ‘ట్రాకర్’లలో ఒకరిగా భావించాలి. క్రూర మృగాల అడుగు జాడలను బట్టి వాటి కదలికలను పసిగట్టే నిపుణులే ట్రాకర్లు.
 
 ‘పులిని బంధించడం ఎలా?’ అని తరచు అటవీశాఖ ఏర్పాటు చేసే తరగతి గది పాఠాలు అడవులలో ఎంతవరకు ఉపయోగపడతాయన్నది శిక్షణ పొందిన ఆ వేటగాళ్లకే తెలియాలి. కానీ షఫత్ వేరు. తాతగారు నవాబ్ సుల్తాన్ అలీ ఖాన్ బహదూర్‌తో కలిసి తన ఐదవ ఏట నుంచే అడవుల్లో వేటకు వెళ్లిన అనుభవం అతడికి ఉంది. బ్రిటిష్ దొరలకు బహదూర్ వేట సంరక్షకునిగా, సలహాదారుగా ఉండేవారు. ఇక షఫత్ జాతీయస్థాయిలో షూటింగ్ చాంపియన్ అయి వుండడం కూడా అతడికి బాగా కలిసి వచ్చింది. జంతువులకు మత్తివ్వడానికి సాధారణ పశువైద్యులు చాలు. కానీ తప్పించుకు తిరుగుతున్న మృగానికి మత్తివ్వడానికి షూటింగ్ కూడా తెలిసి ఉండాలి. అందుకే ఈ రెండూ తెలిసిన షఫత్ దగ్గర ఆంధ్రప్రదేశ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, బీహార్, కర్నాటక రాష్ట్రాలలోని అటవీశాఖ అధికారులు, పశువైద్యులు శిక్షణ పొందుతుంటారు.
 
 షఫత్ తొలిసారి తన 19 యేట ప్రభుత్వం తనకు అప్పజెప్పిన పనిని విజయవంతంగా నెరవేర్చారు. మైసూరులో వేర్వేరు సమయాలలో పన్నెండు మందిని తొక్కి చంపిన మదగజానికి మత్తిచ్చి అతడు పడగొట్టాడు. నాటి నుంచి నేటి వరకు పన్నెండుసార్లు క్రూరమృగాలను బంధించాడు. కాగా షఫత్ ఇప్పుడు భుజానికెత్తుకున్నది అత్యంత ప్రమాదకరమైన పదమూడవ బాధ్యత. ఎందుకింత ప్రమాదకరం అంటే, మనుషులను చంపి తప్పించుకు తిరుగుతున్న ఈ ఆడపులి ఒక్క ఉత్తరప్రదేశ్ అటవీప్రాంత పరిధిలోనే సంచరించడం లేదు. కాసేపు సరిహద్దుల్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో వేటకు వస్తుంది. ఇంకాసేపు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లిపోతుంది. పైగా అడవిలో ఉన్నది అదొక్కటే పులి కాదు. మిగతావాటి నుంచీ కాపాడుకోవాలి. ఏది ఎటు నుంచి వచ్చి మీద పడుతుందో తెలీదు. ఇవన్నీ అలా ఉంచితే, నరమాంసం రుచిమరిగిన ఈ పులి ఉత్తరప్రదేశ్ సరిహద్దుదాటి ఉత్తరాంచల్‌లోకి ప్రవేశించిందా... ఇక షఫత్ చేసేదేమీ లేదు. అక్కడి వరకే అతడి వేట పరిధి.
 
 ఏదైమేనా ఆ ‘కిల్లర్ టైగర్’ త్వరగా తన చేతికి చిక్కాలని షఫత్ ఆశిస్తున్నారు. లేదంటే గ్రామస్థుల నుంచి జీవవైవిధ్యానికి హాని పొంచి ఉంటుంది. పులిని చంపడం కోసం వారు మేకలకు విషం ఇచ్చి వాటిని చెట్లకు ఎరగా కట్టేస్తారు. పులి వాటిని తిని చనిపోతే, ఆ చనిపోయిన పులిని తిని రాబందులు చనిపోతాయి. ఇదంతా ఒక విషవలయం. ఈ వలయం నుంచి ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడ్డానికి షఫత్ తన పనిని వేగవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. అడవిలో షఫత్ ఒక్కరే ఉండరు. ఆయనతో పాటు కొందరు సహాయకులు ఉంటారు. వారంతా ఆయన సూచనల మేరకు పులిని వలపన్నేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ఉంటారు. పులి దొరికేవరకు అందరూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.  ఒక్కరు లఘశంక కోసం ఆగినా మిగతావారు ఆ ఒక్కరి చుట్టూ రక్షణగా నిలుచోవలసిందే.
 
 ఇంతా చేసి, ప్రాణాలకు తెగించీ షఫత్ చేస్తున్నది డబ్బుల కోసం కాదు. మనుషుల మీద అతడికి ఎంత మక్కువో, వన్యమృగాల మీదా అంతే ప్రేమ. రెండు జాతులకూ అతడు హితుడు. అంతమాత్రాన 55 ఏళ్ల షాఫత్ తన కుమారుడు అస్ఘర్‌కు తన సాహసోపేతమైన వారసత్వాన్ని ఇవ్వదలచుకోవడం లేదు. ‘‘ఇంట్లో సంపాదించేవాళ్లు ఒక్కరైనా ఉండాలి కదా’’ అంటారు నవ్వుతూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement