‘మరుగుదొడ్ల’ పై విచారణకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నతస్థాయి విచారణ జరగనుంది. ఈ బాగోతంలో కమీషన్ల రూపంలో రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై వాస్తవాలు త్వరలోనే వెలుగుచూసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ అహ్మద్ బాబు విచారణ కమిటీని వేశారు. నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్న వ్యవహారంపై కూపీ లాగనున్నారు. నిర్మాణం చేపట్టకుండానే సుమారు లక్ష మరుగుదొడ్లకు ముందస్తుగా టూల్‌కిట్స్ కొనుగోలు పేరిట రూ.17.60 కోట్లు తగలేయడం రచ్చ రచ్చగా మారింది. ఈ బాగోతంపై ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు పంపిన కలెక్టర్
‘ధనలక్ష్మికి దాసోహం’, ‘ధనలక్ష్మిపై చర్యలేవి?’ తదితర శీర్షికలతో ‘సాక్షి’లో వెలువడిన కథనాలపై స్పందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ కొనుగోలు బాగోతంపై విచారణ జరిపేందుకు ఏజేసీ వెంకటయ్య నేతృత్వంలో కమిటీ వేశారు. వెంకటయ్య చైర్మన్‌గా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్ కో-కన్వీనర్‌గా, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఎస్ఈలు ఉమామహేశ్వర్‌రెడ్డి, హంసారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఎవరి మెడకు చుట్టుకుంటుందో?
టూల్‌కిట్స్ బాగోతంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా స్పందించిన ఓ రాష్ట్రసాయి అధికారి అవకతవకలపై విచారణ జరుపుతూనే మరుగుదొడ్ల నిర్మాణంలో అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం సూచించిన ధరకు టూల్‌కిట్స్‌ను సరఫరా చేసిన ధనలక్షి ఏజెన్సీ నాణ్యతను తుంగలో తొక్కిందన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ ఏజేసీ వెంకటయ్య చైర్మన్‌గా కమిటీ వేశారు. దీంతో ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ వ్యవహారం ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శుల మెడకు చుట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే టూల్‌కిట్స్ నేరుగా లబ్ధిదారుడి ద్వారా కొనుగోలు చేయించాలని నిబంధనలున్నా, అప్పుడున్న ఉన్నతాధికారులు ‘ధనలక్ష్మి’కి దాసోహం అన్నారు. ఈ మేరకు ఆ సంస్థ ద్వారా టూల్‌కిట్స్ సరఫరా చేసేందుకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోల ద్వారా రూ.17.60 చెల్లింపులు చేశారు.
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఉన్నతాధికారులు ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వహించడం లేదు. ఇప్పుడున్న ఉన్నతాధికారులు బాధ్యులపై ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. దీంతో ఆ ముగ్గురు అధికారుల ఒత్తిళ్ల మేరకు రూ.17.60 కోట్లు చెల్లించిన ఎంపీడీవోలు మాత్రమే బాధ్యులుగా చూసే అవకాశం ఉంది. ప్రభుత్వం సూచించిన ధర మేరకు టూల్‌కిట్స్ సరఫరా చేశారని, అయితే ఆ టూల్కిట్స్లో నాణ్యత ఉందా? లేదా? చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులదే కదా! అన్న వాదనను తెరపైకి తెస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా టూల్‌కిట్స్ కొనుగోలులో అవకతవకలు కళ్లకు కనబడుతున్నా, చివరకు ఈ బాగోతం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.