NCERT report
-
విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: భారతీయులు తమ నల్లధనాన్ని భారీ మొత్తంలో విదేశాల్లో దాచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమైంది. ఇదంతా కేవలం 1980–2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్‌సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. 1980–2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్సీఏఈఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది. 1990–2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్‌ఐఎఫ్‌ఎమ్ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది. అయితే నల్లధనానికి సంబంధించి ఈ మూడు సంస్థల నివేదికలు ఒకేలా ఉంటాయని భావించలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారని పార్లమెంటరీ ప్యానల్ తన నివేదికలో వెల్లడించింది. దీనిని ప్రాథమిక నివేదికగానే భావించాల్సి ఉందని.. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. -
లెక్కల్లో వెనుకబడ్డ ఢిల్లీ పిల్లలు!
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ఎన్సీఈఆర్టీ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ విద్యార్థులు వెనుకబడ్డారు. ఆంగ్లంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఐదో స్థానంలో, గణితంలో వెనకబడిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. విద్యార్థుల సామర్థ్యాన్ని, విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు జాతీయ విద్యా పరిశోధన సంస్థ(ఎన్సీఈఆర్టీ) దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించింది. సర్వేలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో 32శాతం మాత్రమే ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. గణిత ప్రశ్నలకు 34 శాతం విద్యార్థులు మాత్రమే సమాధానం చెప్పారు. మూడో తరగతి విద్యార్థులపై సర్వే నిర్వహించగా 54శాతం గణిత ప్రశ్నలకు, 58 శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 44 శాతం గణిత ప్రశ్నలకు, 52శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నాస్ సర్వేలో రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ వెనుకబడి ఉంది. ఢిల్లీకి చెందిన జానకి రాజన్ అనే ప్రొఫెసర్ నాస్ సర్వేపై స్పందిస్తూ...విద్యార్థులకు లెక్కలు కూడా రాకుండా విద్యాశాఖ మంత్రి బెస్ట్ ఎడుకేషన్ మినిస్టర్ గా అవార్డులు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంచాలకులు సౌమ్య గుప్తా స్పందిస్తూ.. నాస్ సర్వే ఫలితాలకు తాము ఆశ్యర్యం చెందలేదని, తమ సర్వేలో విద్యార్థులకు నేర్చుకునే నైపుణ్యం లేదని తేలిందని తెలిపారు. అయితే, లక్షకుపైగా విద్యార్థులకు చదివే నైపుణ్యం మెరుగుపడిందని తెలిపారు. -
5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు!
న్యూఢిల్లీ: 5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముందని కేంద్రం సంకేతాలిచ్చింది. ‘3, 5, 8, 10వ తరగతి విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాల్లో గణనీయ పురోగతి అవసరమని ఎన్సీఈఆర్టీ నివేదిక పేర్కొంది. విద్యార్థులు నేర్చుకునే విధానం వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల విద్యా నేపథ్యం, కనీస వసతులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది’ అని హెచార్డీ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కష్వాహ గురువారం రాజ్యసభలో అన్నారు.