NCPCR
-
బోర్నవిటాకు ఎన్సీపీసీఆర్ షాక్.. కారణం ఇదే!
బూస్ట్, బోర్నవిటా వంటి వాటికి భారతీయ మార్కెట్లో మంచి క్రేజు ఉంది. ఈ కారణంగానే వీటి అమ్మకాలు కూడా భారీగా ఉన్నాయి. ఇటీవల మాండెలెజ్ ఇండియాకు చెందిన బోర్నవిటా కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించే వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్ లేబుళ్లను చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జాతీయ పిల్లల హక్కుల కమీషన్ (NCPCR) నివేదికల ప్రకారం, బోర్నవిటాను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మాండెలెజ్ ఇండియా చేసినట్లు తెలిసింది. దీనిపైన సమగ్రమైన వివరణ ఇవ్వాలని NCPCR ఆదేశించింది. బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి దారితీసిన తర్వాత నోటీసు వచ్చింది. పిల్లల ఎదుగుదలను అభివృద్ధి పరుస్తామంటూ ప్రచారం చేయబోయే బోర్నవిటాలో పిల్లల ఆరోగ్యానికి హానిచేసే చక్కర శాతం, ఇతర పదార్థాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. లీగల్ నోటీసు అందించిన తర్వాత వీడియోను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించినప్పటికీ, ఇది ఇప్పటికే దాదాపు 12 మిలియన్స్ వ్యూవ్స్ పొంది బాగా పాపులర్ అయిపోయింది. మీ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ప్యాకేజింగ్, వ్యాపార ప్రకటనలు చేసినట్లు కమిషన్ గుర్తించిందని మాండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-ఇండియా 'దీపక్ అయ్యర్'కు జారీ చేసిన ప్రకటనలో ఎన్సీపీసీఆర్ వెల్లడించింది. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!) పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు మా ఉత్పత్తిని సమగ్రంగా టెస్ట్ చేయడం జరిగిందని. ఉత్పత్తిలో ఆహార పదార్థాలు అన్ని విధాలా సరైనవే అని నిర్దారించిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు బోర్నవిటా ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపైనా ఇప్పుడు ఎటువంటి సమాధానం లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రూయా చిన్న పిల్లల ఆసుపత్రి.. భేష్
సాక్షి, తిరుపతి: రూయా చిన్నపిల్లల ఆసుపత్రిని జాతీయ బాలల హక్కుల కమిషన్(NCPCR) సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అక్కడి సేవలు, సిబ్బంది పని తీరుపై అభినందనలు గుప్పించారు. శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్జీ ఆనంద్. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారాయన. ఈ సందర్భంగా.. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం, అక్కడి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని.. సంబంధిత విభాగపు హెచ్‌వోడి డా. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ఆర్సీ లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ఆర్సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్.. ఇద్దరూ వైద్య ఆరోగ్యానికి, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారాయన. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు. తనిఖీ సందర్భంగా ఆయన వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
జేఈఈ మెయిన్ తొలివిడత సాధ్యమేనా?
సాక్షి,అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు బాంబే హైకోర్టులో పరీక్ష వాయిదాను కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీపీసీఆర్ పరీక్షల షెడ్యూల్ మార్పు అంశాన్ని పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జేఈఈ మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే.. జేఈఈ మెయిన్–2023ని రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డిసెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి సెషన్ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే జనవరిలో సీబీఎస్ఈ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ బోర్డుల ప్రీ ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. దీనివల్ల జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని తాము కోల్పోవలసి వస్తుందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2021, 2022లో జేఈఈ మెయిన్‌లో విజయం సాధించినా అవకాశం అందుకోలేక డ్రాపర్లుగా మిగిలిపోయిన అభ్యర్థులు కూడా పరీక్ష సన్నద్ధతకు తమకు సమయం లేకుండా పోతోందని అంటున్నారు. దీనివల్ల తాము మళ్లీ నష్టపోతామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా జేఈఈ మెయిన్‌కు ఎన్టీఏ పేర్కొన్న అర్హతల్లోనూ కొన్ని సడలింపులు ఇవ్వాలని కొందరు తొలి నుంచి కోరుతున్నారు. ఈ అర్హతలపైన కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్లో 75 శాతం ఉత్తీర్ణత నిబంధనపైనా.. ఇంకోవైపు జేఈఈ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్టీఏ గత మూడేళ్లుగా రద్దు చేసింది. కోవిడ్ కారణంగా తరగతులు, పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్‌గా నడుస్తుండటంతో ఈసారి మళ్లీ 75 శాతం మార్కుల నిబంధనను పునరుద్ధరించింది. జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు ఎన్ఐటీలు, ఐఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించినా.. ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఎన్టీఏ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. -
Delhi Pollution: క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు తక్కువ స్థాయికి పడిపోతుంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్ ఫ్రం హోమ్) ఆదేశాలు జారీ చేసింది. ప్రేవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది. పాఠశాలలు బంద్ ఢిల్లీలో శనివారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది. చదవండి: ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు! ఆ వాహనాలపై నిషేదం కేవలం అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది. కమర్షియల్ డీజిల్ ట్రక్స్ వాహనాలు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే గతేడాది అవలంబించినటే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి యోచిస్తోంది ఢిల్లీ సర్కార్. అప్రమత్తమైన ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని కోరింది. పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తుండటం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారతదేశ సమస్య అని, ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించవని అన్నారు. దీనికి ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి సమయం కాదని అన్నారు. రైతులను తప్పు పట్టలేం ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి తామే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పడిపోతున్న గాలి నాణ్యత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. గాలి నాణ్యత సూచికలో ప్రస్తుతం యూపీలోని నోయిడా 562తో తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తరువాత గురుగ్రామ్ 539(హర్యానా). ఢిల్లీ యూనివర్సీటీ సమీపంలో 563 ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుత గాలి నాణ్యత 472గా ఉంది. ఘజియాబాద్-391, నోయిడా-388, గ్రేటర్ నోయిడా-390, గురుగ్రామ్-391, ఫరీదాబాద్-347గా నమోదైంది. -
చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించొద్దు: కొత్త మార్గదర్శకాలు రెడీ!
న్యూఢిల్లీ: సీరియళ్లు, రియాలిటీ షోలంటూ బుల్లితెర మీదే కాదు.. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ మధ్య డిజిటల్ స్క్రీన్ మీద కూడా పిల్లలను అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. వినోద రంగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) డ్రాఫ్ట్ గైడ్లెన్స్ జారీ చేసింది. సినిమాలు, టీవీ, రియాలిటీ షో, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వార్తలు, సోషల్ మీడియా వెబ్సైట్ కంటెంట్ విషయంలోనూ కొత్త గైడ్‌లైన్స్ వర్తిస్తాయని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. సైబర్ చట్టాలు, పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రూల్స్‌ను సిద్ధం చేసింది కమిషన్. తాజా డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం.. మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. చనుబాలు..రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను పాటించకుంటే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియళ్లు, ఓటీటీ .. ఇలా అన్ని కేటగిరీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతేకాదు.. చిల్ట్రన్ ఇన్ న్యూస్ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది ఎన్సీపీసీఆర్. దీని ప్రకారం.. పిల్లలు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు.. వాళ్లకు ఇబ్బందికలిగించేలా వ్యవహారించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలోనూ విజువల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే.. సంబంధిత చానెల్స్‌పై శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. నిర్భంధంతో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ వర్తిస్తుంది. అలాగే.. సోషల్ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరింది. ధూమపానం, మద్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా, ఇబ్బందికర పరిస్థితులలో చూపించకూడదు. భారీ భారీ డైలాగులతో.. సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్ చేయడం మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది ఎన్సీపీసీఆర్. చివరిసారిగా.. 2011లో మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్సీపీసీఆర్. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత.. కొత్త చట్టాలు, పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్ గైడ్‌లెన్స్‌ను.. అదీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే సిద్ధం చేసింది ఎన్సీపీసీఆర్. వినోద రంగం నుంచి ఓ ప్రత్యేక కమిటీ ఈ మార్గదర్శకాల ప్రతిపాదనలను పరిశీలించి.. అభ్యంతరాలను, మార్పులు చేర్పులను తెలపనుంది. -
ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది. శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది. రాహుల్ పోస్ట్‌పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సదరు ట్వీట్‌ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్‌టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్‌పై కౌంటర్ దాడులు చేస్తోంది. -
వయసు 10.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు.. రోజుకు 4 గంటలు
న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్‌ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్‌ను, 10.1శాతం మంది ఆన్లైన్లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు 76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్ ఎక్కాకా ఫోన్ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. -
చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌పై ట్విటర్ వివరణ
పిల్లల అశ్లీల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ట్విటర్ పై నిన్న ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే, నేడు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది. పిల్లల అశ్లీల కంటెంట్ విషయాల్లో సంస్థ జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లు తెలిపింది. సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగానే గుర్తించి తొలగిస్తుందని, అటువంటి విషయాల్లో చట్టానికి సహకరిస్తామని కంపెనీ తెలిపింది. "ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగా గుర్తించి తొలగించడంలో మేము కృషి చేస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడం కోసం, భారతదేశంలోని చట్టాల అమలు కోసం ఎన్జిఓ భాగస్వాములతో పనిచేస్తాము" అని ట్విటర్ ప్రతినిధి ఎఎన్ఐకు తెలిపారు . జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిన్న(జూన్ 29) ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ట్విటర్ పై కేసు నమోదు చేసింది. అశ్లీల కంటెంట్ ను తొలగించాలని, మైక్రోబ్లాగింగ్ సైట్ లో సర్క్యులేట్ చేసిన ఖాతాల వివరాలను పంచుకోవాలని ట్విటర్ ను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సైబర్ సెల్) అన్యేష్ రాయ్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యు) ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక వారంలోగా మీడియా వేదిక నుంచి అన్ని అశ్లీల కంటెంట్ ను తొలగించాలని కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్