NDDTC
-
చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్న కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం ఎంత కారణమో.. ఇంట్లో తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్‌ను చూసి కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు నేషనల్ డ్రగ్ డిపెండెన్సీ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) సర్వేలో తేలింది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలలో 8 నుంచి 12వ తరగతికి చెందిన 6 వేల మంది విద్యార్థులతో సర్వే నిర్వహించింది. ఇందులో 10 శాతం మంది యువత పొగాకు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు తేలింది. వారికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఇంట్లో పెద్దలను చూసి అలవాటు చేసుకున్నట్లు బయటపడటం గమనార్హం. స్మార్ట్ ఫోన్లో డ్రగ్స్ కోసం శోధన.. కరోనా అనంతరం పిల్లలకు సెల్‌ఫోన్ వినియోగడంతో ఆన్లైన్లో మత్తు పదార్థాల కోసం శోధిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్స్ వాట్సాప్ గ్రూప్‌లలో యువతను చేర్చి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న కేసులు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం. నిద్రమాత్రలు, ఆల్ప్రాజోలం, క్లోర్డియాజిపాక్సైడ్ వంటి యాంగ్జైటీ మాత్రలు, దగ్గు టానిక్‌లు, పెయిన్ కిల్లర్స్ వంటి ఫార్మసీ మెడిసిన్స్ కూడా పిల్లలు వినియోగిస్తున్నట్లు అమృతా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ దేవికా రాణి తెలిపారు. రిహాబిలిటేషన్ కౌన్సెలింగ్ పలువురు యువతలో ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. నెలకు సుమారు వంద మంది మత్తు బానిసలు ఆశ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటిలో 10– 15 కేసులు 18 ఏళ్ల లోపు వయసున్న యువతే ఉన్నారు. పసిగట్టకపోతే ప్రమాదమే.. పని ఒత్తిడి లేదా బోర్ అనిపించినా ఇంట్లో పెద్దలు పొగాకు, ఆల్కహాల్ వంటివి సేవిస్తుండటం చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, గొడవలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం కూడా పిల్లల మీద చూపిస్తోంది. పిల్లల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మత్తుకు బానిసలుగా మారి ఎంత దారుణానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉంది. నేరాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. చెడు వ్యవసాల నుంచి యువతను మాన్పించడం సైకాలజిస్ట్లకు కత్తి మీద సాము. ఎందుకంటే ఆ వయసు పిల్లల్లో మెదడు సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి చెందదు. దీంతో తిరిగి సులువుగా చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతుంటారు. ఆడుకోవటం, ఇతరులతో మాట్లాడకపోవటం, ఎప్పుడూ బద్ధకంగా ఉంటారు. ఎక్కువగా ఏడుస్తుంటారు లేదా పడుకుంటారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. ప్రతి అంశానికీ భావోద్వేగాలకు లోనవుతుంటారు. సామాజిక మాధ్యమాలలో లైఫ్ గురించి నెగిటివ్ కొటేషన్లు పెడుతుంటారు. ఉన్నట్టుండి చదువులో తక్కువ మార్కులు రావటం. ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు. డ్రగ్స్‌కు సంబంధించిన పేర్లను సెల్ఫోన్లలో షార్ట్‌కట్‌లో పేర్లు పెట్టుకుంటారు. చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్లు అత్యవసరం కేరళ, ఢిల్లీ, ముంబైలో ఉన్నట్లు ప్రభుత్వ చైల్డ్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లు మన దగ్గర లేవు. రిహాబిలిటేషన్ వైద్యం ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత చాలా మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీంతో చెడు వ్యసనాల నుంచి పేద విద్యార్థులు, యువతను కాపాడి, ఉజ్వల భవిష్యత్తును అందించినట్లవుతుంది. – కె.దేవికా రాణి, డైరెక్టర్, అమృతా ఫౌండేషన్ (చదవండి: ఇంటికో ఉద్యోగమని మొండిచేయి చూపారు: వైఎస్ షర్మిల) -
ఏపీలో మద్యం బానిసలు 13.7 శాతం
సాక్షి, అమరావతి: దేశంలో సగటున 10.5 శాతం మంది మద్యానికి బానిసలైతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య 13.7 శాతం. మద్యం సేవించే వారి సంఖ్య జనాభా పరంగా చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మద్యంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంలోనూ రాష్ట్రం తీసిపోలేదు. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్‌కు బానిసలైన వారిలో పిల్లలు, యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (ఎయిమ్స్) అనుబంధంగా పనిచేసే నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్(ఎన్డీడీటీసీ) నిర్వహించిన సర్వేలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు ఈ సర్వే నిర్వహించారు. 186 జిల్లాల్లో 4,73,569 మందిని ప్రశి్నంచి, నివేదిక రూపొందించారు. 135 జిల్లాల్లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ 72,642 మందిని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు, నిషేధిత డ్రగ్స్, మద్యానికి బానిసలైన వారిపై ఇంత పెద్ద ఎత్తున సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వే వివరాలను కేంద్ర సామాజిక సాధికారిత శాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. ఈ సర్వేను 8 కేటగిరిల్లో నిర్వహించారు. మద్యం లేకపోతే ఉండలేమనే స్థితికి చేరుకోవడం, గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వాడడం, ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం లేదా మత్తు కోసం రసాయన పదార్థాలను పీల్చడం, ప్రమాదకర డ్రగ్స్ వినియోగం ఎలా మాన్పించాలి అనే అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు. సర్వేలో ఏం తేలిందంటే.. ►ప్రధానంగా 10 నుంచి 75 ఏళ్ల లోపు వారు ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారు. ►దేశ జనాభాలో సగటున 10.5 శాతం మంది మద్యం బానిసలు కాగా, ఏపీలో దేశ సగటును మించి మద్యం బానిసలున్నారు. ►జనాభాపరంగా చూస్తే దేశవ్యాప్తంగా మద్యం బానిసల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ►మద్యం వినియోగంలోనూ ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ►దేశంలో మద్యం వినియోగం 18.5 శాతం కాగా, ఏపీలో 43.5 శాతం. ►మద్యానికి బానిసలై వైద్యం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ►దేశవ్యాప్తంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 8.5 లక్షల మంది ఉండగా, ఏపీలో 69 వేల మంది ఉన్నారు. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో యూపీ, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్ ఉన్నాయి. ►దేశంలో మద్యం సేవించే మహిళలు, పురుషుల నిష్పత్తి 1:17గా ఉంది. ►ఏపీలో 10 నుంచి 17 ఏళ్ల లోపు వారిలో 1.37 శాతం మంది కొకైన్ వినియోగిస్తున్నారు. ►ఏపీలో నల్లమందు లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ 1.4 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారు. ►నిద్రపుచ్చే మత్తు పదార్థాలను తీసుకునే వారు ఏపీలో 0.80 శాతం మంది ఉన్నారు. ►ఏపీలో 10 నుంచి 75 ఏళ్ల లోపు వారిలో 0.2 శాతం మంది గంజాయి సేవిస్తున్నారు. ►నిద్రపుచ్చే మత్తు మందుల వినియోగంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఏపీలో 3.6 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేక వ్యవస్థ అవసరం ►మద్యం, డ్రగ్స్ వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీగా డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►మద్యం, డ్రగ్స్ వ్యసనపరులను ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం ఓపీ క్లినిక్‌లు మాత్రమే ఉన్నాయి. ►మద్యపానాన్ని నియంత్రించేందుకు, మాదక ద్రవ్యాలను అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తగినంత సిబ్బందిని సమకూర్చాలి. ►దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ►2018 డిసెంబర్ నాటికి ఏపీలో మద్యం బానిసలు13.7%మంది ►దేశ సగటు కంటే అధికం.. జనాభా పరంగా దేశంలో నాలుగో స్థానం ►సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు రాష్ట్రంలో 47 లక్షలు మంది ►ఏపీలో ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 69 వేల మంది మద్యం సేవిస్తున్న వారిలో ఎవరెంత (శాతాల్లో) -
దేశంలో మద్యపాన ప్రియులు 16 కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 14.6 శాతం (16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్ ఆధ్వర్యంలోని ఎన్డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం– సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. ‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది’ అని నివేదిక తయారుచేశాం’ అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. జాతీయ స్థాయిలో 186 జిల్లాలలో ఈ సర్వే చేశారు. దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచిచూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు (వైద్యులు చెప్పిన పరిమితికన్నా ఎక్కువ) ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది. -
డ్రగ్స్ బానిసలపై ఎయిమ్స్ సర్వే
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలపై ఆధారపడి జీవిస్తున్న వారి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు చెందిన నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్(ఎన్డీడీటీసీ) సహకారంతో సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో డ్రగ్స్‌పై ఆధారపడిన వారి సమాచారంతోపాటు, అవి వినియోగదారులకు ఏ విధంగా చేరవేస్తారన్న వాటిని గుర్తించనున్నారు. అయితే ఈ సర్వే నిర్వహించడానికి దాదాపు రూ.22.41 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. గత కొన్నేళ్లుగా ప్రపంచ మాదకద్రవ్యాల వార్షిక నివేదికలో భారత సమాచారం లేదు. 15 ఏళ్ల క్రితం నిర్వహించిన ఇలాంటి సర్వేలో రాష్ట్రాలవారీగా సమాచారం లేదని, మహిళల్లో ఏ మేరకు డ్రగ్స్ ప్రభావం ఉందనేదిలేదని సామాజిక న్యాయ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించనున్నారు.