సాక్షి, అమరావతి: దేశంలో సగటున 10.5 శాతం మంది మద్యానికి బానిసలైతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య 13.7 శాతం. మద్యం సేవించే వారి సంఖ్య జనాభా పరంగా చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మద్యంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంలోనూ రాష్ట్రం తీసిపోలేదు. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్‌కు బానిసలైన వారిలో పిల్లలు, యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (ఎయిమ్స్) అనుబంధంగా పనిచేసే నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్(ఎన్‌డీడీటీసీ) నిర్వహించిన సర్వేలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి.
దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు ఈ సర్వే నిర్వహించారు. 186 జిల్లాల్లో 4,73,569 మందిని ప్రశి్నంచి, నివేదిక రూపొందించారు. 135 జిల్లాల్లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ 72,642 మందిని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు, నిషేధిత డ్రగ్స్, మద్యానికి బానిసలైన వారిపై ఇంత పెద్ద ఎత్తున సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వే వివరాలను కేంద్ర సామాజిక సాధికారిత శాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. ఈ సర్వేను 8 కేటగిరిల్లో నిర్వహించారు. మద్యం లేకపోతే ఉండలేమనే స్థితికి చేరుకోవడం, గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వాడడం, ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం లేదా మత్తు కోసం రసాయన పదార్థాలను పీల్చడం, ప్రమాదకర డ్రగ్స్ వినియోగం ఎలా మాన్పించాలి అనే అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు.
సర్వేలో ఏం తేలిందంటే..
►ప్రధానంగా 10 నుంచి 75 ఏళ్ల లోపు వారు ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారు.
►దేశ జనాభాలో సగటున 10.5 శాతం మంది మద్యం బానిసలు కాగా, ఏపీలో దేశ సగటును మించి మద్యం బానిసలున్నారు.
►జనాభాపరంగా చూస్తే దేశవ్యాప్తంగా మద్యం బానిసల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.
►మద్యం వినియోగంలోనూ ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది.
►దేశంలో మద్యం వినియోగం 18.5 శాతం కాగా, ఏపీలో 43.5 శాతం.
►మద్యానికి బానిసలై వైద్యం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఏపీ రెండో స్థానంలో ఉంది.
►దేశవ్యాప్తంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 8.5 లక్షల మంది ఉండగా, ఏపీలో 69 వేల మంది ఉన్నారు. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో యూపీ, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్ ఉన్నాయి.
►దేశంలో మద్యం సేవించే మహిళలు, పురుషుల నిష్పత్తి 1:17గా ఉంది.
►ఏపీలో 10 నుంచి 17 ఏళ్ల లోపు వారిలో 1.37 శాతం మంది కొకైన్ వినియోగిస్తున్నారు.
►ఏపీలో నల్లమందు లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ 1.4 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారు.
►నిద్రపుచ్చే మత్తు పదార్థాలను తీసుకునే వారు ఏపీలో 0.80 శాతం మంది ఉన్నారు.
►ఏపీలో 10 నుంచి 75 ఏళ్ల లోపు వారిలో 0.2 శాతం మంది గంజాయి సేవిస్తున్నారు.
►నిద్రపుచ్చే మత్తు మందుల వినియోగంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఏపీలో 3.6 లక్షల మంది ఉన్నారు.
ప్రత్యేక వ్యవస్థ అవసరం
►మద్యం, డ్రగ్స్ వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీగా డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
►మద్యం, డ్రగ్స్ వ్యసనపరులను ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం ఓపీ క్లినిక్‌లు మాత్రమే ఉన్నాయి.
►మద్యపానాన్ని నియంత్రించేందుకు, మాదక ద్రవ్యాలను అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తగినంత సిబ్బందిని సమకూర్చాలి.
►దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
►2018 డిసెంబర్ నాటికి ఏపీలో మద్యం బానిసలు13.7%మంది
►దేశ సగటు కంటే అధికం.. జనాభా పరంగా దేశంలో నాలుగో స్థానం
►సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు రాష్ట్రంలో 47 లక్షలు మంది
►ఏపీలో ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారు 69 వేల మంది
మద్యం సేవిస్తున్న వారిలో ఎవరెంత (శాతాల్లో)
Comments
Please login to add a commentAdd a comment