Neeraj Gupta
-
భారత్–22 ఈటీఎఫ్.. భేష్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 22 కంపెనీల్లో తనకున్న వాటాలను భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా కేంద్రం విక్రయానికి ఉంచగా... కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.8,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఈ ఇష్యూని తీసుకురాగా, ఏకంగా సుమారు రూ.32,000 కోట్లకు సరిపడా బిడ్లు వచ్చాయి. ఇందులో మూడోవంతు విదేశీ ఇన్వెస్టర్ల రూపంలో వచ్చిందే. దీంతో కేంద్రం అనుకున్నదానికంటే అధికంగా రూ.14,500 కోట్లను సమీకరించింది. ఆశించినదానికంటే అధికంగా బిడ్లు వస్తే అదనపు నిధులు సమీకరించాలని కేంద్రం ముందే నిర్ణయించుకుంది. దీంతో రూ.14,500 కోట్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సెక్రటరీ నీరజ్గుప్తా తెలియజేశారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో ఓ కొత్త ఫండ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇప్పటిదాకా జరగలేదని తెలిపారు. ఇష్యూ నాలుగు రెట్లు అధికంగా సబ్ స్క్రయిబ్ అయిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.45 రెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి 1.5 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) నుంచి ఏడు రెట్లు అధికంగా స్పందన వచ్చింది. భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా సమకూరిన రూ.14,500 కోట్లను కూడా కలిపి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సమీకరించిన మొత్తం రూ.52,500 కోట్లకు చేరింది. 2017–18లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,500 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ భారత్– 22 ఈటీఎఫ్‌ను నిర్వహిస్తోంది. ప్రారంభ ఇష్యూ సైజుగా రూ.8,000 కోట్లను నిర్ణయించగా, ఇందులో 25 శాతం కోటా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రూ.2,000 కోట్లకు గాను రూ.12,000 కోట్ల మేర సబ్స్క్రిప్షన్ రావడం గమనార్హం. తగిన సమయంలో దీన్ని లిస్ట్ చేస్తామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ నిమేష్ షా తెలిపారు. -
లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్
• నిర్దిష్ట గడువులోగా పూర్తి • ‘దీపం’ కార్యదర్శి నీరజ్ గుప్తా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తోంది. గత ఎనిమిదేళ్లలో కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టింగ్ కావడం దీనికి ప్రధాన కారణం. దీంతో నిర్దిష్ట కాలావ్యవధిలోగా లాభాల్లో ఉన్న అన్ని పీఎస్‌యూల(భారీ, మధ్య స్థాయి సంస్థలు) పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ)ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎస్‌యూల కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లన్నీ లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా మూడేళ్ల ఆడిటెడ్ అకౌంట్లు, తగినంత మంది స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన పూర్తిస్థాయి బోర్డులను అమల్లోకి తీసుకురావడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఎంతకాలంలో దీన్ని పూర్తిచేస్తారనేది గుప్తా వెల్లడించలేదు. దీపంలో మరో సీనియర్ అధికారి మాత్రం గరిష్టంగా మూడేళ్లలో లాభాల్లో ఉన్న సీపీఎస్ఈల లిస్టింగ్ ప్రక్రియను ముగించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం పేరును మోదీ సర్కారు ‘దీపం’గా మార్చిన సంగతి తెలిసిందే. కాగా, 2017–18 బడ్జెట్లో సీపీఎస్ఈల లిస్టింగ్‌కు సబంధించి స్పష్టంగా దిశానిర్ధేశం చేసిన విషయాన్ని గుప్తా ప్రస్తావించారు. చిన్న కంపెనీల లిస్టింగ్ అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘2009 నుంచి ఇప్పటివరకూ కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టయ్యాయి. ఇందులో 2009 లో రెండు, 2010లో మూడు, 2012లో ఒకటి చొప్పున ఉన్నాయి. ఇక 2012లో నాలుగు కంపెనీలకు అనుమతి లభించినప్పటికీ.. ఇప్పటిదాకా ముందడుగు పడలేదు. 2014–16 మధ్య అసలు ఒక్క పీఎస్‌యూ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాలేదు. అందుకే ఈ ప్రక్రియ కోసం ఒక కచ్చితమైన కార్యాచరణ అవసరం’ అని గుప్తా తేల్చిచెప్పారు.