న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 22 కంపెనీల్లో తనకున్న వాటాలను భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా కేంద్రం విక్రయానికి ఉంచగా... కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.8,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఈ ఇష్యూని తీసుకురాగా, ఏకంగా సుమారు రూ.32,000 కోట్లకు సరిపడా బిడ్లు వచ్చాయి. ఇందులో మూడోవంతు విదేశీ ఇన్వెస్టర్ల రూపంలో వచ్చిందే. దీంతో కేంద్రం అనుకున్నదానికంటే అధికంగా రూ.14,500 కోట్లను సమీకరించింది.
ఆశించినదానికంటే అధికంగా బిడ్లు వస్తే అదనపు నిధులు సమీకరించాలని కేంద్రం ముందే నిర్ణయించుకుంది. దీంతో రూ.14,500 కోట్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సెక్రటరీ నీరజ్‌గుప్తా తెలియజేశారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో ఓ కొత్త ఫండ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇప్పటిదాకా జరగలేదని తెలిపారు. ఇష్యూ నాలుగు రెట్లు అధికంగా సబ్ స్క్రయిబ్ అయిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.45 రెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి 1.5 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్‌ఐఐ), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) నుంచి ఏడు రెట్లు అధికంగా స్పందన వచ్చింది.
భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా సమకూరిన రూ.14,500 కోట్లను కూడా కలిపి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సమీకరించిన మొత్తం రూ.52,500 కోట్లకు చేరింది. 2017–18లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,500 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ భారత్– 22 ఈటీఎఫ్‌ను నిర్వహిస్తోంది. ప్రారంభ ఇష్యూ సైజుగా రూ.8,000 కోట్లను నిర్ణయించగా, ఇందులో 25 శాతం కోటా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రూ.2,000 కోట్లకు గాను రూ.12,000 కోట్ల మేర సబ్‌స్క్రిప్షన్ రావడం గమనార్హం. తగిన సమయంలో దీన్ని లిస్ట్ చేస్తామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ నిమేష్ షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment