రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
గండేడ్/కుల్కచర్ల, న్యూస్‌లైన్: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను సిమెంట్‌లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బైకును లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మహమ్మదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐలు జానకీరాంరెడ్డి, కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ దాస్యానాయక్ తండాకు చెందిన నేనావత్ బాస్‌నాయక్ (27)కు గత 2010లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తాండూరులో పనిచేసిన ఆయన ఇటీవల మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ అయ్యాడు.
విధుల్లో భాగంగా శనివారం బోసునాయక్ ఓ కేసు విచారణ కు మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామానికి బైకుపై వెళ్లి తిరిగి ఠాణాకు ప్రయాణమయ్యాడు. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ (ఏపీ04వై 7786) రెడ్డిపల్లి సమీపంలో గురుకుల పాఠశాల దగ్గర బాస్‌నాయక్ బైకును వెనుక నుంచి ఢీకొంది. తలకు తీవ్రంగా గాయాలైన ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో మొకర్లాబాద్ సమీపంలో పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. బాస్‌నాయక్ మృతితో మహమ్మదాబాద్ ఠాణా సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబీకులు ఘనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు.
దాస్యానాయక్ తండాలో విషాదం
దాస్యానాయక్ తండాకు చెందిన దుగ్యానాయక్, మున్నమ్మ దంపతుల రెండో కుమారుడు బాస్‌నాయక్. మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ ఆయిన నుంచి ఆయన నిత్యం స్వగ్రామం నుంచి ఠాణాకు రాకపోకలు సాగిస్తున్నాడు. బాస్‌నాయక్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మేకగూడకు చెందిన జ్యోతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నెల రోజుల క్రితం ఓ కుమారుడు పుట్టాడు.
బాస్‌నాయక్ తండ్రి ఐదు నెలల క్రితం పంటకు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం బాస్‌నాయక్ పెద్ద అన్న కిషన్‌నాయక్ అదృశ్యమై తిరిగి రాలేదు. కానిస్టేబుల్ దుర్మరణంతో భార్య జ్యోతి, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కానిస్టేబుల్ మృతితో దాస్యానాయక్ తండాలో విషాదం అలుముకుంది.