పద్మావతి ఉంటే రహస్యాలు లీక్!
⇒ పద్మావతిని వెయిటింగ్లో పెట్టాలి
⇒ తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం డిమాండ్
⇒ సీఎం బ్లాక్ వరకు ర్యాలీ
హైదరాబాద్: ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పద్మావతిని వెయిటింగ్లో పెట్టాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు నేతి మంగమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు బుధవారం సచివాలయంలోని ఆర్థికశాఖ ఛాంబర్ నుంచి సీఎం బ్లాక్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా మంగమ్మ విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి చెందిన పద్మావతిని నవీన్‌మిట్టల్ పీఎస్‌గా నియమించారని తెలిపారు. తనకు పదోన్నతులు కావాలంటూ ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులు ఏమీ చేయలేరని... తనకు పదోన్నతి ఖాయమని పద్మావతి ప్రచారం చేస్తున్నారని మంగమ్మ విమర్శించారు. ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ పద్మావతి ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఆర్థికశాఖలో ఆమె ఉంటే అనేక రహస్యాలు బయటకు వెళ్తాయని మంగమ్మ అనుమానం వ్యక్తంచేశారు. రివ్యూ డీపీసీ వద్దని... ఒరిజినల్ డీపీసీనే పెట్టాలని డిమాండ్ చేశారు.