Netravati
-
సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్ఎం కృష్ణ
బెంగళూరు : ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమై విగత జీవిగా మారిన కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అంత్యక్రియలకు ఆయన మామ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బయలు దేరారు. బెంగళూరులో తన స్వగృహం నుంచి అంత్యక్రియలు జరిగే బేళూరుకు పయనమయ్యారు. సిద్ధార్థ మృతికి సంతాపంగా దేశ వ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డేలు ఈ రోజు (బుధవారం) బంద్‌ను పాటిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి అదృశ్యమైన వీజీ సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో ఈ ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. సిద్ధార్థ మరణం షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వీజీసిద్ధార్థ మరణించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. స్నేహపూర్వకంగా ఉండే జెంటిల్మెన్. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాఫీ డేకు ఈ కఠిన సమయాన్ని తట్టుకునే ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సిద్ధార్థ ఎవరో నాకు తెలియదు. ఆయన ఆర్థిక సమస్యల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసింది ఒక్కటే పారిశ్రామికవేత్తలు వ్యాపార నష్టాలతో బలవన్మరణం పొందడం సరైంది కాదు. ఎందుకంటే ఇది పారిశ్రామికరంగాన్నే చచ్చిపోయేలా చేస్తుంది’- ఆనంద్ మహింద్ర. -
కాఫీ డే ‘కింగ్’ కథ విషాదాంతం
సాక్షి, బెంగళూరు : సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ కథ చివరకు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీడే యజమాని, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ సొంతూరు కాఫీ సీమ చిక్కమంగళూరు అయితే ముంబైలో వ్యాపార మెళుకువల్ని ఒంటబట్టించుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ రంగంలో మేటిగా నిలిచారు. వీజీ సిద్ధార్థ తనకు ఇష్టమైన కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలతో పాటు పలు దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలో అనూహ్యమైన ఆటుపోట్లు వచ్చాయో, ఏమో.. ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలో నేత్రావతి నది వంతెన వద్ద అదృశ్యమైన సిద్ధార్థ చివరకు శవమై తేలారు. చదవండి: నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం కావడంతో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవిక భర్తే సిద్ధార్థ. సదాశివనగరలోని ఉన్న ఎస్ఎం కృష్ణ నివాసానికి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సిద్ధార్థ ఆత్మహత్యతో నగరంలోని రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఎస్ఎం కృష్ణ ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు సిద్ధార్థ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి సిద్ధార్థ మృతదేహానికి మంగళూరులోని వెన్లాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంగుళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఇవాళ ఉదయం నేత్రానదిలో ఓమృతదేహం లభ్యమైందని, దాన్ని అదృశ్యమైన వీజీ సిద్ధార్థగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని, ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సీపీ వెల్లడించారు. ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ మరోవైపు ఈ విషాద సంఘటనపై ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ అని బీజేపీ మహిళా నేత శోభ ట్వీట్ చేశారు. అలాగే సిద్ధార్థ ఆత్మహత్యపై శృంగేరి ఎమ్మెల్యే టీడీ రాజేగౌడ మాట్లాడుతూ..‘ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఒత్తిడితో సిద్ధార్థ కొంచెం అప్సెట్ అయ్యాడు. ఆస్తులు అమ్మి సెటిల్ చేద్దామనుకున్నాడు. అతడికున్న అప్పుల కన్నా ఆస్తులే ఎక్కువ. ఇంతలో ఈ దారుణం జరిగింది.’ అని అన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎస్ఎం కృష్ణను నిన్న (మంగళవారం) పలువురు ప్రముఖులు పరామర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, డీకే శివకుమార్, మాజీ సీఎం కుమారస్వామి, సిద్దరామయ్య, నటులు శివరాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్రరాజ్‌కుమార్, మాజీమంత్రులు ఆర్.వి.దేశ్‌పాండే, శివశంకర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్.అశోక్, కట్టా సుబ్రమణ్యం నాయుడు, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, హెచ్‌కే. పాటిల్ తదితరులు ఎస్ఎం కృష్ణను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సిద్ధార్థ మృతదేహం లభ్యం
సాక్షి, బెంగళూరు : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. (చదవండి : కాఫీ కింగ్ అదృశ్యం) (చదవండి : వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) -
ఎంత పని చేశావు తల్లీ?
గుత్తి(అనంతపురం): వారిద్దరు. వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. చిన్ని కుటుంబం. చింతల్లేకుండా సాగిపోతోంది. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి మరో మహిళ దెయ్యంలా ప్రవేశించింది. వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ఆమె భర్తను తనవైపు తిప్పుకుని ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను అతను నిర్లక్ష్యం చేసేలా చేసింది. తమ వైవాహిక జీవితంలో ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ఆమె నాలుగేళ్ల కిందట ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత భర్తను మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఈ జీవితం వద్దనుకుందా ఇల్లాలు. తనతో పాటే తన ఇద్దరూ బిడ్డలనూ తీసుకెళ్లింది. గుత్తిలో మంగళవారం జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. దాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చున్నీలు వేసిన నేత్రావతి, వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరివేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతోందని అందులో పేర్కొన్నాడు. అందుకు తాను అంగీకరించకపోవడంతో ఇలా చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.