ఎంత పని చేశావు తల్లీ? | How much work did you mother? | Sakshi
Sakshi News home page

ఎంత పని చేశావు తల్లీ?

Published Wed, Apr 6 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

How much work did you mother?

గుత్తి(అనంతపురం): వారిద్దరు. వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. చిన్ని కుటుంబం. చింతల్లేకుండా సాగిపోతోంది. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి మరో మహిళ దెయ్యంలా ప్రవేశించింది. వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ఆమె భర్తను తనవైపు తిప్పుకుని ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను అతను నిర్లక్ష్యం చేసేలా చేసింది. తమ వైవాహిక జీవితంలో ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ఆమె నాలుగేళ్ల కిందట ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత భర్తను మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఈ జీవితం వద్దనుకుందా ఇల్లాలు. తనతో పాటే తన ఇద్దరూ బిడ్డలనూ తీసుకెళ్లింది. గుత్తిలో మంగళవారం జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

 
గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు.

 
వివాహేతర సంబంధం వద్దన్నా...

హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. దాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు.

 
మొదట పిల్లలకు ఉరేసి..
ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చున్నీలు వేసిన నేత్రావతి, వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరివేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు.  అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు.  మురారి గుత్తి ఆర్‌ఎస్‌లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నారు.

 
పోలీసులకు తప్పుడు ఫిర్యాదు

కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతోందని అందులో పేర్కొన్నాడు. అందుకు తాను అంగీకరించకపోవడంతో ఇలా చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement