New Director General
-
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తామని, ప్రజల రోజువారీ జీవనంలో భాగమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైద్యం, ఆరోగ్యం సహా అన్ని రంగాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం తమ ప్రధాన కర్తవ్యమని వివరించారు. ఆరోగ్యకరమైన వినోదానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని తెలిపారు. స్థానిక, గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు స్టేషన్ స్థాయిలో వక్తృత్వ, సంగీత తదితర పోటీలు నిర్వహించడం ద్వారా రేడియోను పాఠశాలల స్థాయి వరకు చేరువ చేస్తామని వేణుధర్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఆయన తాజాగా డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎరిజెర్ల గ్రామానికి చెందిన వేణుధర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) 1988 బ్యాచ్ అధికారి. 1990–2000 కాలంలో అకాశవాణి, దూరదర్శన్‌లో న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన ఆయన 2009–17 మధ్య సమాచార ప్రసార శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా, 2017–21 మధ్య కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
ఎన్ఐఏ కొత్త డీజీగా వైసీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం రెండు కీలక నియమాలను చేపట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న శరద్ కుమార్ పదవి బాధ్యతలు అక్టోబర్ 30తో ముగియనుంది. 1984 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మోదీ గుజరాత్ అల్లర్ల కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందంలో సభ్యుడిగా పని చేశారు. మరోవైపు సహస్ర సీమ బల్ కు చీఫ్‌గా రజనీకాంత్ మిశ్రాను కేంద్రం నియమించింది.