'టెక్కీలకు ట్రైనింగ్ పెద్ద కష్టమేమి కాదు'
టెక్నాలజీ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల్లో చాలామంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనంటూ క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఇండస్ట్రీ నిపుణుడు, మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ టీవీ మోహన్ దాస్ పాయ్ స్పందించారు. శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశీయ వర్క్‌ఫోర్స్ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండటంతో ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగాలు కోల్పోతుందన్నారు. దీనివల్ల చాలామంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా మారుతున్నారని గుర్తుచేశారు.. 60-65 శాతం మంది దేశీయ ఐటీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కష్టమేనని అనడం పూర్తిగా తప్పుడు ప్రకటనగా పేర్కొంటూ శ్రీనివాస్ కందుల వ్యాఖ్యలను పాయ్ ఖండించారు.
దేశీయ ఐటీ ఉద్యోగుల సగటు వయస్సు 27 సంవత్సరాలు, అదే అమెరికా, జర్మనీలో అయితే ఈ ఉద్యోగుల సగటు వయసు 40కి పైనే ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు వీరికి ట్రైనింగ్ ఇస్తుండటంతో భారత్ ఐటీ పరంగా చాలా విజయం సాధిస్తోందని చెప్పారు. క్లౌడ్ లేదా బిగ్ డేటా లేదా మరే ఇతర వాటిపైనన్న భారతీయులకు ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాకల్టీ సిలబస్‌లో మార్పులు చేయాల్సినవసం ఉందన్నారు. గ్లోబల్ యూనివర్సిటీలో సిలంబస్లను చాలా త్వరగా మార్చుతుంటారని, ప్రభుత్వం రావాలి, చెప్పాలి అనేది వారికి ఉండదని వివరించారు.