New Zealand Women Cricket Team
-
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు..
లండన్: 3 టీ20లు, 5 వన్డేల సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. లీసెస్టర్ వేదికగా న్యూజిలాండ్ మహిళలు, ఇంగ్లండ్ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దృవీకరించాయి. కివీస్ బృందం బస చేస్తున్న హోటల్‌ను బాంబు పెట్టి పేల్చేస్తామని సదరు అగంతకుడు కివీస్ మేనేజ్మెంట్లోని ఓ వ్యక్తికి మెయిల్ చేశాడు. అయితే ఈ బెదిరింపు నమ్మదగదిగా లేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొట్టిపారేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఇటీవల కివీస్ పురుషుల జట్టు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా బెదిరింపులు వచ్చి ఉండవచ్చని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు బెదిరింపు తర్వాత కివీస్ మేల్ క్రికెటర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టేడియం బయట తమ ఆటగాళ్లపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కివీస్ ప్రధాని జెసిండా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్ జట్టు వైదొలిగిన తర్వాత ఇంగ్లండ్ జట్టు సైతం పాక్ టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..! -
క్రికెట్ చరిత్రలో ఈ రోజు: వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు
వన్డే క్రికెట్ చరిత్రలో జూన్ 8కి ఓ ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇవాల్టి రోజున న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్(490/4) నమోదు చేసి చరిత్ర సృష్టించింది. సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు. కానీ, పురుష క్రికెటర్లకు సైతం సాధ్యం కాని ఈ అద్భుతమైన రికార్డును కివీస్ మహిళా జట్టు ఆవిష్కరించింది. ఇప్పటివరకు పురుషుల క్రికెట్లో(ఆస్ట్రేలియాపై 2018లో 481/6) కాని మహిళా క్రికెట్లో కాని ఇదే అత్యుత్తమ స్కోర్‌గా కొనసాగుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. 2018 జూన్ 8న న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ వేదికగా జరిగిన వన్డే పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. కివీస్ జట్టులో ఓపెనర్ సుజీ బేట్స్(94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ ప్లేయర్ మ్యాడీ గ్రీన్(77 బంతుల్లో 121; 15 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకాలతో చెలరేగగా ఆఖర్లో అమేలియా కెర్(45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేసింది. మరో ఓపెనర్ జెస్ వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో రాణించింది. దీంతో న్యూజిలాండ్ జట్టు వన్డేల్లో చారిత్రక స్కోర్ నమోదు చేసింది. అనంతరం 491 పరుగుల అతి భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ఆతిధ్య ఐర్లాండ్ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగలకే చాపచుట్టేసింది. ఐర్లాండ్ జట్టులో కెప్టెన్ లారా డెలానీ అత్యధికంగా 37 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 347 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. చదవండి: పొట్టి క్రికెట్లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం -
ఆసీస్ అదుర్స్...
బ్రిస్బేన్: టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆస్ట్రేలియా క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో ఆసీస్ జట్టుకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. తదుపరి రెండు వన్డేల్లోనూ గెలిస్తే 2003లో 21 వరుస విజయాలతో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును మహిళల జట్టు సమం చేస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 181 పరుగుల విజయలక్ష్యాన్ని 33.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (70 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... ఓపెనర్లు రాచెల్ హేన్స్ (62 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్), అలీసా హీలీ (27 బంతుల్లో 26; 5 ఫోర్లు) రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు 49.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కేటీ పెర్కిన్స్ (32; 3 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (35; 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా, జెస్సికా, సోఫీ మోలినెక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
సెమీస్‌లో అడుగుపెట్టిన ఆసీస్
మెల్బోర్న్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాటం వృథా అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ బీఎల్ మూనీ 50 బంతుల్లో 60 పరుగులు సాధించగా, బౌలింగ్‌లో వేర్హామ్, షుట్‌లు మూడేసి వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లడ్ జట్లు సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) -
సెమీస్ రేసులో కివీస్...
గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. తొలుత న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో లే కాస్పెరెక్, హేలీ జేన్సన్ మూడేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా... రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ తలపడతాయి. -
కివీస్‌ను గెలిపించిన డివైన్
పెర్త్: కెప్టెన్ సోఫీ డివైన్ (55 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జెన్సెన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. కెప్టెన్‌కు తోడుగా మ్యాడీ గ్రీన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. డివైన్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20ల్లో డివైన్ వరుసగా ఆరో మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. విండీస్ చేతిలో థాయ్‌లాండ్ ఓటమి... తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో చుక్కెదురైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (3/13, 37 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ముందుగా థాయ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. అనంతరం విండీస్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసింది. -
ఇలా కూడా ఔట్ అవుతారా?
-
ఇదెక్కడి ఔట్రా నాయనా!
సిడ్నీ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన నామమాత్రపు వన్డే మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తే.. ఇలా కూడా ఔట్ అవుతారా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అవును యావత్ క్రికెట్ ప్రపంచంలోనే ఇలాంటి ఔట్ ఇప్పటి వరకు జరిగుండదు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ హెథర్ గ్రహమ్ తీసిన వికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కివీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో ఆ జట్టు బ్యాటర్ కాటీ పెర్కిన్స్ స్ట్రేట్ షాట్ ఆడింది. కానీ బంతి నాన్ స్ట్రైకర్‌గా ఉన్న కాటీ మార్టిన్ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. ఈ బంతిని పేసర్ హెథర్ అందుకోవడంతో కాటీ పెర్కిన్స్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేరింది. అయితే ఇది ఔటా లేదా అనే విషయంలో మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్లు సైతం గందరగోళానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహా ఔట్‌తో మైదానంలో నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. ఇదెక్కడి ఔట్రా నాయనా ! అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 323 పరుగుల చేయగా.. ఆతిథ్య ఆసీస్ గవర్నర్ జనరల్ ఎలెవన్ జట్టు 157 పరుగులకే కుప్పకూలింది. -
మిథాలి మెరిసినా ఓడిన భారత్
సావర్(బంగ్లాదేశ్): మిథాలి రాజ్ అర్థ సెంచరీ చేసినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలయింది. మహిళా టి20 ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మిథాలి సేన 17 పరుగులతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మిథాలి 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 53 పరుగులు చేసింది. కౌర్ 27, గోస్వామి 10, మదానా 11 పరుగులు చేశారు. ముగ్గురు డకౌటయ్యారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.