అతడి కోసం ఆమె
హృదయం: ‘పాశ్చాత్యులకు ఎమోషన్స్ ఉండవు’, ‘వివాహ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వరు’, ‘జీవిత భాగస్వామి కోసం త్యాగాలు చెయ్యరు’, ‘ఎవరి జీవితాలు వాళ్లవి’... ఇలాంటి అభిప్రాయాలు చాలానే ఉంటాయి మనకు. ఈ అభిప్రాయాలు నిజమే అవడానికి ఉదాహరణలు కూడా బోలెడు కనిపిస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన జాన్ - నికోలాల కథ తెలుసుకున్నాక, మన అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సిందే.
తొలి చూపులోనే ప్రేమ గురించి వింటుంటాం. కంటుంటాం! కానీ జాన్ - నికోలాలది తొలిచూపు ప్రేమ కాదు, తొలిచూపు పెళ్లి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, తనే నా జీవిత భాగస్వామి అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడమే కాదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ పరస్పర అంగీకారంతో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. కొన్ని రోజులకే వాళ్లిద్దరి పెళ్లయిపోయింది.
వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు. రెండు వారాలపాటు ప్రపంచాన్ని మరిచిపోయారు జాన్, నికోలా. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జీవిత కాలానికి సరిపడా అనుభూతులతో ఇంటికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత దైనందిన జీవితం మొదలైంది. ఇంట్లోనూ రోజూ హనీమూన్లాగే గడిచింది. ఓవైపు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూనే ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగించారు. కానీ, ఆ సంతోషానికి రెండు వారాల్లోనే తెరపడింది. ఓ రోజు జాన్ రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. షాక్ తిన్న నికోలా అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు. జాన్‌కు ట్యూమర్ ఉందని. అది ముదిరి క్యాన్సర్‌గా మారిందన్నాడు. ఇద్దరూ నిలువునా కూలిపోయారు. కొన్ని రోజులు గడిచాక, జాన్ ఎక్కువ కాలం బతకడన్న చేదు నిజాన్ని కూడా చెప్పారు వైద్యులు. అయినా చికిత్స మొదలుపెట్టారు. జాన్, నికోలాలకు ఆసుపత్రే ఇల్లయింది.
జాన్ మృత్యు పోరాటం మొదలైంది. జాన్‌కు కూడా తన పరిస్థితి అర్థమైంది. చికిత్స సాగుతుండగా నికోలాను పిలిచి, తన జీవిత కాల కోరిక గురించి చెప్పాడు. తండ్రి కావడమే ఆ కోరిక. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నికోలాకు. అయినా దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. నిజానికి జాన్ పరిస్థితి చూస్తే, ఏ అమ్మాయీ తల్లి కావడం గురించి ఆలోచించదు. కానీ నికోలా జాన్ కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఎవరెంత వారించినా, వినకుండా తాను తల్లి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది.
వైద్యులకు విషయం చెబితే, జాన్‌కు కీమోథెరపీ చేశాక పిల్లలు పుట్టే అవకాశం తక్కువని భావించి, అతడి వీర్య కణాలు తీసుకున్నారు. వాటితో నికోలాను తల్లిని చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అది విజయవంతమైంది. ఆమె గర్భం దాల్చింది. స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్నది కవలలని కూడా తేలింది. అయితే ఇంత సంతోషకరమైన వార్త తెలిసేసరికే జాన్ మృత్యువుకు మరింత చేరువైపోయాడు. కదల్లేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. అయినా భార్య ఆ సంగతి చెప్పగానే, చిన్న మూలుగు ద్వారా తన సంతోషాన్ని వెల్లడించాడు. అయితే ఆ వార్త వినడం కోసమే అన్ని రోజులు ఆగాడో ఏమో... అది తెలిసిన రెండో రోజుకే జాన్ ప్రాణాలు వదిలాడు.
ప్రాణంలా ప్రేమించిన భర్త దూరమైనా, అతడి ఆఖరు కోరిక తీర్చడం కోసం గుండె దిటవు చేసుకుంది నికోలా. అతడి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తూ కడుపులోని చిన్నారుల్ని క్షేమంగా బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఐదు నెలలు గడిచాయి. అప్పుడామెకు ఆరో నెల. అంతా సవ్యంగా సాగిపోతుండగా, నికోలాకు వినికిడి సమస్య మొదలైంది. విపరీతమైన తలపోటు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే, మళ్లీ ఓ పిడుగులాంటి వార్త. ఆమెకు కూడా ట్యూమర్ ఉందన్నారు వైద్యులు.
తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది నికోలా. అప్పటికే ఎంతో పోరాడిన తాను, ఇక పోరాటం చేయలేననుకుంది. కడుపులోని బిడ్డల్ని, జాన్‌ను తలుచుకుని కొన్ని రోజులపాటు ఏడ్చింది. దేవుణ్ని నిందించింది. కానీ చివరికి భర్త ఆఖరు కోరికను గుర్తుచేసుకుంది. కడుపును తడిమి చూసుకుంది. వాళ్లకోసమైనా బతకాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు అండగా నిలిచారు. అందరి సహకారంతో ట్యూమర్‌పై పోరాటం సాగించింది.
ఆ పోరాటం సాగుతుండగానే, ఆమె ఇద్దరు పండంటి మగ కవలల్ని ప్రసవించింది. ఇప్పుడామెకు ప్రాణాపాయం తప్పింది. కానీ ట్యూమర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. పిల్లల్ని చూసుకున్నాక, ఆమెకు జీవితంపై మరింత ఆశ కలిగింది. జాన్ ఆలోచనలు తెలిసిన నికోలా... అతడి ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా జీవన పోరాటం సాగిస్తోంది. అంతేకాదు.. ట్యూమర్, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఓ ట్రస్టు ఆరంభించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తోంది. జాన్ తన ఆఖరు కోరిక గురించి చెప్పకపోయి ఉంటే... ఈపాటికి తాను కూడా మృత్యు ఒడికి చేరేదాన్నని, జాన్ కోసం, పిల్లల కోసం పోరాడటం వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని అంటుంది నికోలా.