కరోనా పీడలో ఎన్నికల పంచాయతీ!
ఇంట్లోనో, ఆఫీసులోనో స్థిరంగా పొట్టలో నీళ్లు కదలకుండా కూర్చున్న వాడికి ఉన్న సుఖం.. కరోనా బాధల మధ్య నిత్యం పనిచేయాల్సిన సిబ్బందికి, సేవలందించే క్యాడర్‌కు, గ్రామీణ కార్యకర్తలకు ఉండదు. 2018లోనే జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి 2019 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన 3 లక్షల 60 వేలమంది యువతీయువకులకు రానున్న ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన దుర్మార్గపు పాలకులు మిగిల్చిన తప్పుడు వారసత్వానికి కొనసాగింపే– నిమ్మగడ్డ మొండితనం. బహుశా ఈ రహస్యాన్ని గౌరవ సుప్రీం ధర్మాసనం కూడా కనిపెట్టబట్టే ‘తాము తలదూర్చలేం’ అని సరిపెట్టుకుంది. సమన్వయంతో పనిచేయమని కోరింది. అంటే ప్రభుత్వంతో కలిసి, ప్రభుత్వంతో సంప్రదించి మరీ ముందుకు సాగాలనీ ‘పెద్దమనిషి సలహా’గా చెప్పింది.
‘‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వ హణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో మేం జోక్యం చేసుకోలేము, ఆ విషయంలో మేం తలదూర్చలేం. సమన్వయంతో పని చేసుకోవాలి’’. – సుప్రీంకోర్టు, ద్విసభ్య ధర్మాసనం ఉవాచ
‘‘గోవాలో ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ వేసే, వేయించుకునే దశలో ఉన్నందున ఎన్నికలు ఏప్రిల్ దాకా వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ సి. గార్గ్ ప్రకటించారు.
రాను రాను ‘ప్రజాస్వామ్యం’ పేరిట మన వ్యవస్థ ఏ దశకు చేరు కుందంటే ‘గొడ్డలి ఎక్కడ పెట్టావురా అంటే, కొట్టేసే చెట్టు దగ్గర, ఇంతకీ కొట్టే చెట్టెక్కడుందిరా అంటే, గొడ్డలి దగ్గర’ అనే వరకూ వచ్చింది. యావత్తు దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా భీకర వ్యాధికి సుమారు ఏడువేలమందికి పైగా ప్రజలు బలైపోయారు. రకరకాల వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉండి, ఒక కొలిక్కి రాలేదు. వచ్చిన కోవాగ్జిన్లు, కోవిషీల్డ్‌లు వేయించుకున్న వారంతా పూర్తిగా స్వస్థతలోనే ఉన్నారని చెప్పగల ధీమా పూర్తిగా ఏర్పడలేదు. ఈ దశలో పదిలక్షలమంది ప్రజలకు వ్యాక్సిన్లు దశలవారీగా వేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, దానికి సహకరిస్తున్న వేలాదిమంది వైద్య, అగ్రగామి దళ సిబ్బంది విసుగూ విరామం లేకుండా రెండు మాసాలుగా నిద్రాహారాలకు నోచుకోకుండా తలమునకలై పనిచేస్తు న్నారు. ప్రభుత్వ సేవల్లో ఉంటూ కరోనా బారినపడి చనిపోయిన వారిలో పోలీసులు వందకుమించిన సంఖ్యలోనే ఉన్నారు. నర్సులు, ఇతర మహిళా సేవకులూ రాత్రింబ వళ్లు ప్రజా సేవలో మగ్గిపోతున్న దశ. ఈ బాధలు, బాదరబందీలూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కనపడవు. తనూ, తన ఉద్యోగం పదిలంగా ఉంటే చాలనుకున్నారు. అది కూడా మార్చిదాకా. అదైనా చంద్రబాబు పతనం కాకముందు ఆయన వెలగబెట్టిన హయాం నుంచి అప్పనంగా అబ్బిన ఎలక్షన్ కమిషనర్ పదవి.
అయినా రాష్ట్రంలో ప్రజలు, వివిధ దశల్లో కరోనాతో భయం భయంగా గడుపుతూ వ్యాక్సినేషన్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలి యక భీతిల్లుతున్న సమయంలో, యావన్మంది సిబ్బంది, గ్రామ సేవకులు కరోనా నివారణ ప్రక్రియల్లో చేదోడు వాదోడు అవుతున్న సమయంలో– పంచాయతీ ఎన్నికలు నిర్వహించ డానికి కమిషనర్‌కు చేతులొచ్చాయంటే ఆ ‘బుర్ర’ ఎంత గొప్పదై ఉండాలో అర్థమవుతోంది. ఎందుకంటే, పట్టుమని అరడజను కరోనా కేసులు కూడా లేని లేదా నిర్ధారణ కాని దశలో ముందుగా నిర్వహిం చవలసిన జిల్లా పరిషత్, మండల స్థాయి ఎన్నికలను జరపకుండా ‘ఎగనామం’ పెట్టి (ప్రోద్బలం చంద్రబాబుదని అనకండి), ముమ్మ రంగా కరోనా ముంచుకొచ్చిన దశలో పంచాయతీ ఎన్నికలంటూ ‘సందట్లో సడే మియా’గా వచ్చి, ‘నాలుగు పరిగెల్ని’ బాబుకి ఏరిపెడ దామన్న భ్రమలో పడిపోయి నిమ్మగడ్డ పంచాయతీ కుంపటి తెరవాలనుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను ఏకపక్షంగా జారీ చేశారు. ప్రభుత్వంతోగానీ, చీఫ్ సెక్రటరీతోగానీ విధిగా సంప్రదించి చేయవల సిన నిర్ణయాన్ని ఒక్క కలంపోటుతో జారీచేసి కూర్చున్నారు.
బ్యూరాక్రసీ అంటే నిరంకుశాధికార వర్గమని పేరుంది, అలాగని బ్యూరాక్రాట్లే గర్వంగా చెప్పుకున్న రోజులూ, వ్యవహరించిన, వ్యవహ రిస్తున్న రోజులూ మనం చూశాం. బహుశా అందుకే కేంద్ర స్థాయిలో సీబీఐ అత్యున్నతాధికారిగా, ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పేరొం దిన ‘కా’ (కెఏడబ్ల్యూ) ఆమధ్య కాలంలో బ్యూరోక్రసీని ఆ పేరుతో పిలవడం మానేస్తే మంచిదని భావించి సరికొత్త పేరు– ‘బ్యూరోక్రేజీ’ అని పేరుపెట్టి ఆ పేరుతోనే ఓ విమర్శనాత్మక పుస్తకం రాసి ప్రచురిం చారు. ఆ ‘మోజు’లో (క్రేజ్) పడిన తర్వాత ప్రజలపట్ల నిర్వహించా ల్సిన బాధ్యతాయుత ధర్మాల్ని మానేసి, రాజకీయ నాయకులకు, పాలకులకు కాకాలుపట్టి బాకాలు పట్టడం నిరంకుశాధికార వర్గం పనిగా మారిందని ‘కా’ నిర్వచించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న ఈ ఉన్నతాధికారి బాబు హయాం నుంచీ నిర్వహిస్తూ వచ్చిన అనంతర కర్మకాండంతా ఇదే మరి. ఈ బాదరబందీని బహుశా తాము పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనిగా కనబడటం లేదని ధర్మాసనం భావించిందో ఏమో మరి.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా ఉన్న దశలో, మరి అరవై రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే టీకాల కార్యక్రమంలో యావన్మంది రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పాల్గొనాల్సి ఉన్న సమయం చూసుకుని స్థానిక ఎన్నికల సంఘం కమిషనర్ నిరం కుశ నిర్ణయం చేశారు. అయితే ప్రభుత్వ సిబ్బంది తమ ప్రాణాలను ఒక ఉన్నతాధికారి మొండితనానికి బలిపెట్టుకోలేరు. అందుకనే జాతీ యోద్యమం రోజుల్లో వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభుత్వ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇంట్లోనో, ఆఫీసులోనో స్థిరంగా పొట్టలో నీళ్లు కదలకుండా కూర్చున్న వాడికి ఉన్న సుఖం.. కరోనా బాధల మధ్య నిత్యం పనిచేయాల్సిన సిబ్బందిని, సేవలందించే క్యాడర్‌కు, గ్రామీణ కార్యకర్తలకు ఉండదు. 2018లోనే జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి 2019 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన 3 లక్షల 60 వేల మంది యువతీయువ కులకు రానున్న ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన దుర్మా ర్గపు పాలకులు మిగిల్చిన తప్పుడు వారసత్వానికి కొనసాగింపే– నిమ్మగడ్డ మొండితనం.
బహుశా ఈ రహస్యాన్ని గౌరవ సుప్రీం ధర్మాసనం కూడా కనిపెట్టబట్టే ‘తాము తలదూర్చలేం’ అని సరిపెట్టుకుంది. సమన్వ యంతో పనిచేయమని కోరింది. అంటే ప్రభుత్వంతో కలిసి, ప్రభు త్వంతో సంప్రదించి మరీ ముందుకు సాగాలని ‘పెద్దమనిషి సల హా’గా చెప్పింది. ఎందుకంటే, ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంప్రదించే సంప్ర దాయాన్నే పూర్తిగా వదులుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఇంతకు ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది కూడా ఈ ప్రవర్తన గురించేనని మరవరాదు. అంతేగాదు, అంతకన్నా అత్యంత కీలకమైన, విలువైన సలహాను, ఆదేశాన్ని కరోనా వ్యాప్తి అయిన తరు వాత సుప్రీంకోర్టు (18.12.2020) తీర్పు రూపంలో ప్రకటించిందని మనం మరచిపోరాదు. ఎందుకంటే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ‘కరోనా విలయతాండవంతో ప్రపంచంలో ప్రతిఒక్కరూ భీతిల్లి బాధపడుతున్నారు. నేడు జరుగుతున్నది కోవిడ్–19పై సాగు తున్న ప్రపంచ యుద్ధం.
ప్రభుత్వ–ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలి. ప్రజారోగ్య రక్షణ పౌరుల ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ఆ హక్కును ప్రజలకు కల్పించింది. ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యం ఆ మేరకు వారికి దక్కాలి. ఎందుకంటే, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కూడా సామాన్య స్థితిలో ఆర్థికంగా అనేక విధాల కుంగిపోయి ఉంటాడు కాబట్టి. ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేసే ఫీజులపైన విధిగా నియంత్రణ ఉండాలి. పౌరుల రక్షణ, ఆరోగ్య బాధ్యతలకు ఏ ఇతర విషయాలకన్నా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పౌరులు తీసు కోకుండా ఉంటే, ఆ పరిస్థితి ఇతర సామాజికులకు కూడా హాని కల్గించడమే అవుతుంది. తద్వారా ఇతరుల హక్కులను హరించడమే అవుతుంది. అంతేగాదు, గత ఎనిమిది నెలలకు పైగా ఆరోగ్య రక్షణలో అగ్రగామి దళంగా పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర కార్మిక సిబ్బంది శారీరకంగా, మానసికంగా డస్సిపోయారు. వారికి మధ్యమధ్యలో అవ సరమైన విశ్రాంతి కల్పించగల మార్గం విధిగా చూడాల్సి ఉంటుంది. అంతేగాదు, దేశవ్యాప్తంగా కరోనా వల్ల బాధలు అనుభవిస్తున్న రోగుల సంఖ్య ప్రతి రోజూ పెరగడం వింటున్నాం. అందుకే పరీక్షలు ఉధృతంగా నిర్వహించాలి’ అని పేర్కొంది. అదీ బాధ్యత అంటే, వ్యక్తికైనా, వ్యవస్థకైనా!
ఇంతకూ అసలు సమస్య–పంచాయతీ ఎన్నికల్లో సుప్రీం జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది కాదు. గత డిసెంబర్లో త్రిసభ్య ధర్మా సనం చేసిన విలువైన హెచ్చరికల్ని మనం పరిగణనలోకి తీసుకోవా ల్సిన అవసరం ఉందా లేదా అన్నది మాత్రమే. మనం సమస్యల్ని మర చిపోతున్నట్టే, మన బుద్ధుల్ని వంచాల్సిన సామెతలనూ మరుస్తు న్నాం: ‘కోర్టుకెక్కినవాళ్లు ఒకరు ఆవుకొమ్మును, ఇంకొకళ్లు తోకను పట్టుకుంటే, మధ్యలో లాయరు పొదుగు దగ్గర కూర్చుంటాడ’ట! కావలసిన ఇంగితం కోర్టులకెక్కినంత మాత్రాన కలగదు సుమా! ‘ఎలాగూ మేం తలదూర్చలేమ’ని సుప్రీంకోర్టు తేల్చేసింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చి కాగల కార్యాన్ని కాస్త సానుకూలం చేసు కోవచ్చు.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in