లక్డీకాపూల్ ఇకసిగ్నల్ ఫ్రీ
=కీలక మార్పులు చేసిన ట్రాఫిక్ పోలీసులు..
=నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు
=అధ్యయనం తర్వాత అవసరమైన మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కీలకమైన లక్డీకాపూల్ జంక్షన్ గురువారం నుంచి ‘సిగ్నల్ ఫ్రీ’ కానుంది. అంటే.. ఏ మార్గం నుంచి వచ్చే వారైనా ఇక్కడ ఆగాల్సిన పనిలేదు. ఎవరికి కేటాయించిన మార్గాల్లో వారు వెళ్లవచ్చు. గురువారం ఉదయం నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. అమల్లో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధ్యయనం చేశాక అవసరమైన మార్పుచేర్పులు చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అమిత్‌గార్గ్ నిర్ణయించారు. లక్డీకాపూల్ జంక్షన్ వద్ద అందుబాటులోకి వచ్చిన రెండు వంతెనల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న చిన్నపాటి ఇంజనీరింగ్ లోపాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
ఇప్పుడున్న పద్ధతి ఇదీ...
లక్డీకాపూల్ వద్ద కొత్త వంతన ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చింది. పాత వంతెనను నిరంకారి భవన్ వైపు వెళ్లే వాహనాలకు, కొత్త వంతెనను మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లే వాటికి కేటాయించారు. ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లాల్సిన వ్యక్తి పొరపాటున పాత వంతెన ఎక్కితే తిరిగి తన మార్గంలోకి చేరడానికి చాలాదూరం ప్రయాణించాలి. నిరంకారి భవన్, రంగారెడ్డి కలెక్టరేట్, సైఫాబాద్ పాత ట్రాఫిక్ పోలీసుస్టేషన్ మీదుగా చుట్టూ తిరిగి కొత్త వంతెన మీదికి చేరుకోవాలి. మరోపక్క ప్రస్తుతం లక్డీకాపూల్ జంక్షన్లో రంగారెడ్డి కలెక్టరేట్‌తో పాటు డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు సైతం సిగ్నల్ దగ్గర కొద్దిసేపు ఆగాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న రెండు వంతెనల్లో పాతది వెడల్పు ఎక్కువ, కొత్తది తక్కువగా ఉన్నాయి. దీంతో నిత్యం పాత వంతెనపై తక్కువ రద్దీ, కొత్తదానిపై ఎక్కువ ఉంటున్నాయి.
నేటి నుంచి ప్రయోగాత్మక అమలు ఇలా...
లక్డీకాపూల్ చౌరస్తా (వంతెనల వద్ద)లో ఇకపై సిగ్నల్స్ ఉండవు. అటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఇటు డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు సైతం ఇక్కడ ఆగాల్సిన పని లేకుండా డిజైన్ చేశారు
ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లాలంటే కచ్చితంగా కొత్త వంతెనే ఎక్కాలి. అయితే గురువారం నుంచి పాత వంతెన ఎక్కినా కంగారు పడాల్సిన పనిలేదు. ఇందు కనువుగా వంతెనలు దాటాక అయో ధ్య చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిమెం ట్ దిమ్మెల వద్ద దారి చేస్తున్నారు
నిరంకారి మార్గం వైపు వెళ్లాల్సిన వారు పొరపాటున కొత్త వంతెన ఎక్కి తే... నేరుగా పీటీఐ బిల్డింగ్ (భారీ వాహనాలైతే మాసబ్‌ట్యాంక్ చౌరస్తా) వరకు వెళ్లి ‘యూ’ టర్న్ తీసుకోవాలి
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లాలంటే లక్కీ రెస్టారెంట్ సమీపంలో ఎడమ వైపుగా ప్రయాణించి ఐలాండ్ ను తొలగించిన ప్రాంతంలో ఆగాలి. సిగ్నల్‌కు అనుగుణంగా కొత్త వంతెన మీదుగా ముందు కు సాగాలి. తాజా విధానం ప్రకారం వీరు కొత్త వంతెన ఎక్కనవసరం లేకుండా సిగ్నల్ వద్ద బారికేడింగ్ వేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ కోసమూ ఆగనక్కర్లేదు. కుడివైపుగా పాత వంతెనపై నుంచి ముందుకెళ్లవచ్చు. వంతె న దాటాక అయోధ్య చౌరస్తా వద్ద సిమెంట్ దిమ్మెల్ని తొలగించి ఏర్పాటు చేస్తున్న మార్గం ద్వారా మాసబ్‌ట్యాంక్ రూట్లో కలవవచ్చు
ఈ వంతెనలు దాటిన తరవాత సైఫాబాద్ ఠాణా, పెట్రోల్ పంప్ మధ్య ప్రాంతం విశాలంగా ఉండటం తో అక్కడ వాహనాలు ఇటు-అటు మారే అవకాశం ఉందని అంచనా
లక్డీకాపూల్ వంతెనతో పాటు బజార్‌ఘాట్, ఫ్యాప్సీల వైపు నుంచి వచ్చి నిరంకారి వైపు వెళ్లే వాహనాలు అయోధ్య జంక్షన్ వద్ద దిమ్మెల్ని తొలగించి ఏర్పాటు చేసే మార్గాన్ని ఎంచుకోకూడదు. వీరు కచ్చితంగా మాసబ్‌ట్యాంక్ మార్గంలో ప్రయాణించి పీటీఐ బిల్డింగ్, మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్దే ‘యూ’ టర్న్ తీసుకుని గమ్యం చేరాల్సి ఉంటుంది.