హరీష్‌తో పంచాయితీ పెట్టుకునే టైం లేదు
- ఇద్దరమూ కష్ట పడుతున్నాం.. ఇద్దరికీ మద్దతుంది
- పార్టీపై అనుమానాలు పటాపంచలు చేయగలిగాం
- గ్రేటర్లో ప్రజల మద్దతును ఓట్లుగా మలుచుకుంటాం
- 'సాక్షి'ముఖాముఖిలో ఐటీ మంత్రి కేటీ రామారావు
సాక్షి, హైదరాబాద్: 'మంత్రి హరీష్‌రావుతో పంచాయితీ పెట్టుకునేంత సమయం నాకు లేదు. పంచాయితీ పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఇద్దరమూ 24 గంటలు కష్టపడి పనిచేసినా.. సరిపోనంత పని ఉంది. ఇద్దరమూ కష్టపడి చేస్తున్నం.. ఇద్దరికీ ప్రజల మద్దతు ఉంది' అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం 'సాక్షి'తో మాట్లాడారు.
'రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొందరు మాపై ఎన్నో అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంతాల వారిని వెళ్లగొడుతారని, వేరే రాష్ట్ర్రాల వారు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వుండదని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు ఉండవని దుర్మార్గ ప్రచారం చేశాం. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు.. పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లాం. ట్రాఫిక్, తాగునీటి సమస్యలపై మేమేం చేస్తామో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజల మనసులను గెలుచుకుని, వారి నుంచి వస్తున్న సానుకూలతను ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకుంటాం' అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్, తాగునీరు వంటి మౌళిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దష్టి పెట్టింది. ప్రజల నుంచి కూడా మద్దతు పెరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆయన వెల్లడించిన మరికొన్ని అంశాలు..
అమరావతి శంకుస్తాపన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే కేసీఆర్‌కే ఎక్కువ కరతాళ ధ్వనులు లభించాయని ఓ ఆంధ్ర ప్రాంత మంత్రి అన్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామంటూ సరదాగా వ్యాఖ్యానించా. దానిని చిలువలు పలువలు చేయడం సరికాదు. రాజకీయాల్లో మరీ ఇంత సీరియస్‌గా ఉంటే కష్టం.
నగరంలో నలుగురు మంత్రులున్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చూస్తారు. ఐటీ మంత్రిగా ఈ రంగంతో ఉన్న అనుబంధం, స్థానికంగా నాకున్న పరిచయాల కారణంగా గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఏ పని అప్పగించినా కార్యకర్తగా.. ఆ పని చేయడం నా బాధ్యత.
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో మరో వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పార్టీ ముఖ్యులు త్వరలో భేటీ అయి మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తారు.
అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరుగుతుంది. అన్ని కోణాల్లో పరిశీలించి విస్తత ఏకాభిప్రాయ సాధన తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఇప్పటికే డివిజన్ల వారీగా మూడు సర్వేలు నిర్వహించాం. ఎంత మంది పోటీ పడుతున్నా 150 మందికి మాత్రమే అవకాశం ఇవ్వగలం.
గ్రేటర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రెండు లేదా మూడు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం వుంది. మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి జరపాలనే ఆలోచన కూడా ఉంది. మేయర్ అభ్యర్థిని ముందే నిర్ణయించే సాంప్రదాయం మా పార్టీలో గతంలో లేదు. ఇప్పుడూ వుండదు. గెలిచిన వారే మేయిర్ ఎవరనేది నిర్ణయిస్తారు.