కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్.. ఉర్జిత్ పటేల్ సంతకంతో ప్రజల చేతుల్లో మిలమిలాడుతున్న 2వేల రూపాయల నోటుపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేసిన ఈ తాజా నోట్లలో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ పొందుపరచలేదన్న వార్త కలకలం రేపుతోంది. సరిపడా సమయంలేక భద్రతా లక్షణాలను పాత రూ. 500 నుంచి రూ. 1,000 నోట్ల మాదిరిగా ఉంచినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ ను జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని, ఈ ప్ర్రక్రియకు కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వివరించారు.
ఇలాంటి ఎక్స్ర్సైజ్ చివరిసారి 2005 లో చేపట్టారన్నారు. వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్త చిత్రం లాంటి ఇతర భద్రతా ఫీచర్స్ చేర్చడానికి అనేక అనుమతులు, ఫైనల్ గా క్యాబినెట్ ఆమోదం అవసరమని తెలిపారు. నూతన నోట్ల నిర్ణయం ఆరు నెలల క్రితం జరిగిందనీ , దీంతో భద్రతా లక్షణాలు మార్చే సమయం చాలక, డిజైన్ మార్చినా, భద్రతా లక్షణాలను పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు ఆ అధికారి తెలిపారు.
మరోవైపు కొత్త కరెన్సీ నోట్లకు పాకిస్తాన్ నుంచి పొంచి వున్న నకిలీ ముప్పుపై ప్రశించినపుడు.. అసాధ్యమని తేల్చి పారేశారు..డిజైన్ మాత్రమే మార్చబడింది తప్ప భద్రతా లక్షణాలు అలాగే ఉన్నాయన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ముద్రణాలయంలో నకిలీ నోట్లు ప్రింట్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.