ఫేస్బుక్ ద్వారా వేధింపులు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమను నిరాకరించిన తోటి విద్యార్థినిపై కక్షగట్టిన ఓ బీఎస్సీ విద్యార్థి ఆమె పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరచి వేధింపులకు దిగాడు. ఆమె తరపు బంధువులకు అసభ్యకర సందేశాలు పంపసాగాడు. చివరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతని ఆటకట్టించారు. క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మియాపూర్‌కు చెందిన ఓ యువతి బెంగుళూరులో కంప్యూటర్ కోర్స్ చేస్తున్న సమయంలో కర్ణాటకలోని తుముకూర్ జిల్లాకు చెందిన ఎన్.సంతోష్‌కుమార్ అలియాస్ కిరణ్ (27)తో పరిచయం ఏర్పడింది. కిరణ్ ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో కక్ష కట్టిన అతను ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించాడు. ఆమె ఫొటో, పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచాడు.
దీని ద్వారా ఆమె బంధువులు, స్నేహితలకు అసభ్యకర మెయిల్స్ పంపాడు. వారి ఫొటోలను సైతం డౌన్లోడ్ చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు మధుసూదన్ సైబర్ క్రైమ్ ఏసీపీ డి.ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో క్రైమ్ డీసీపీ ఎస్.రంగారెడ్డి, అదనపు డీసీపీ జానకీషర్మిల సహకారంతో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎమ్.నరేందర్‌రెడ్డి, ఎస్ఐ ఎస్.రాఘవేందర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. సంతోష్‌ను నిందితుడిగా తేల్చారు. దీంతో ప్రత్యేక బృందం బెంగళూరు వెళ్లి సంతోష్‌ను అరెస్టు చేసింది. నిందితుడి నుంచి రెండు సిమ్‌కార్డులు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.