జవాన్ వెనకుండి నడిపిస్తా
–‘దిల్’ రాజు
‘‘ బీవీయస్ రవి, కృష్ణ... ఈ ముగ్గురికీ మా సంస్థతో మంచి అనుబంధం ఉంది. వీళ్లను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ కౌర్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘జవాన్’. ‘ఇంటికొక్కడు’ ఉపశీర్షిక. ఈ చిత్రం సోమవారం మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిన్న ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రకథను రవి రెండేళ్ల కిందట చెప్పాడు.
మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో ఉంటుంది. నాతో అనుబంధం ఉన్న వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న చిత్రానికి నా వంతుగా కథ, టెక్నీషియన్స్ ఫైనలైజ్ చేశా. మా సంస్థ నుంచి వచ్చే సినిమాలా ‘జవాన్’ ఉండేలా వారి వెనకుండి నడిపిస్తున్నా’’ అన్నారు. ‘‘మంచి కథ, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో రాబోతున్నాం’’ అని సాయిధరమ్ చెప్పారు. ‘‘దేశానికి సైనికుడులా.. ప్రతి ఇంటికి ఒక సమర్థుడైన కొడుకు అవసరం. దేశానికి సమస్య వస్తే జవాన్ నిలబడతాడు.. ఇంటికి సమస్య వస్తే కొడుకు నిలబడతాడు అన్నదే కథాంశం’’ అని బీవీఎస్ రవి చెప్పారు. ‘‘నేను పనిచేసిన సినిమాలకు బీవీయస్రవిగారూ ఒక పార్ట్. ఆయన సినిమాకి పాటలివ్వ డం సంతోషం. సాయితో నాకిది మూడో సినిమా’’ అని తమన్ అన్నారు.