ntr colony
-
భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష
కర్నూలు, ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య దీక్షకు కూర్చున్న సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు రాములమ్మ మాట్లాడుతూ మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దళిత రాములమ్మ ఎమ్మిగనూరులో డిగ్రీ చదివే సమయంలో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ పద్మశాలి వీరేష్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే రాములమ్మకు తెలియకుండా కోసిగికి చెందిన లక్ష్మిని వీరేష్ వివాహం చేసుకున్నాడు. ఎలాగైనా తనను వదలించుకోవాలని వీరేష్ వేధించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఇంట్లో నుంచి బయటకు పంపాడు. దీంతో రాములమ్మ గతేడాది డిసెంబర్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో బాగా చూసుకుంటానని ఇంట్లోకి పిలుచుకున్నాడు. మూడు రోజుల క్రితం దివ్యాంగ పింఛన్ తీసుకొచ్చాక డబ్బులు తీసుకొని ఇంటి నుంచి గెంటివేశాడని రాములమ్మ వాపోయింది. ఆరు నెలల పసిబిడ్డ ఉందని వేడుకున్నా వెళ్లగొట్టాడని, రెండు రోజుల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని కన్నీరు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వస్తే తాళం వేసి ఉందని, తనను ఇంట్లోకి పిలుచుకునే వరకు ఇక్కడే కూర్చుంటానని భీష్మించుకుంది. -
డెంగ్యూతో మహిళ మృతి
గుడివాడ టౌన్ (కృష్ణా జిల్లా): గుడివాడ పట్టణానికి చెందిన ఓ మహిళ డెంగ్యూతో మృతి చెందింది. వివరాల ప్రకారం.. స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన మర్రాపు లక్ష్మీకుమారి(45) గత మంగళవారం జ్వరంతో బాధపడుతూ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళారు. వైద్య పరీక్షల అనంతరం గురువారం మెరుగైన వైద్యం కోసం తేలప్రోలులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి సోకిందని, దాని తీవ్రత అధికంగా ఉందని, ప్లేట్లెట్లు ఎక్కించాలని వైద్యులు సూచించారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా ఆమె శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆదివారం ఉదయం తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
స్నేహితుడే నిందితుడు
తాండూరు: యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడి పట్టుకొని రిమాండుకు తరలించారు. స్నేహితుడే నిందితుడని తేల్చారు. శుక్రవారం తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తన కార్యాలయంలో ఎస్ఐ చతుర్వేదితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. బాల్య మిత్రులు.. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చాంద్‌పాషా స్థానిక లారీ పార్కింగ్ వద్ద చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈయన కొడుకు షేక్ సలీం అలియాస్ మత్తు(23) వైట్నర్, కల్లుకు బానిసయ్యాడు. ఇందిరానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం(22), షేక్ సలీం చిన్నప్పటి నుంచి స్నేహితులు. గతంలో పలు సెల్‌ఫోన్ చోరీలు, జేబు దొంగతనాలు చేశారు. కొన్ని నెలల క్రితం పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో లారీ బ్యాటరీని చోరీ చేసి ఇద్దరూ జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై తిరిగి వచ్చారు. మళ్లీ చోరీలకు పట్టుబట్టిన సలీం.. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ అయిన సలాం మంచిగా బతకాలని నిర్ణయించుకున్నాడు. కాగా వైట్నర్, కల్లుకు బానిసైన సలీం మళ్లీ చోరీలు చేద్దామని తరచూ సలాంతో చెబుతూ పట్టుబట్టేవాడు. ఇటీవల ఇందిరానగర్‌లోని ఓ మసీద్‌లో సలీం సెల్‌ఫోన్ చోరీ చేశారు. అతడిని స్థానికులు పట్టుకోగా సలామ్ పేరు కూడా చెప్పడంతో వారు ఇద్దర్నీ చితకబాదారు. ఁచోరీలు చేద్దాం, లేకపోతే నేను దొంగతనాలకు పాల్పడి నీ పేరు చెబుతాను* అంటూ సలీం తన స్నేహితుడు సలాంను బె దిరించసాగాడు. సలీంతో ఉంటే అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటానని భావించిన సలాం అతణ్ని ఎలాగైనా అంతమొందించేందుకు పథకం వేశాడు. ఇలా చంపేశాడు.. ఈక్రమంలో ఈనెల 27న రాత్రి సలాం తన ఆటోలో ప్రయాణికులను పాతతాండూరులో దించేశాడు. అనంతరం బస్వన్నకట్ట వద్దకు రాగా అక్కడ సలీం కనిపించాడు. ఇద్దరు కలిసి కల్లు తాగారు. పథకం ప్రకారం సలాం తక్కువ మోతాదులో కల్లు తాగాడు. అనంతరం ఈ రాత్రి చోరీ చేద్దామని సలీం మళ్లీ సలాంతో పట్టుబట్టాడు. ఇంటికి వెళ్దామని సలాం ఎంత చెప్పినా సలీం వినలేదు. అప్పటికే వైట్నర్, కల్లు తాగి నడవలేని స్థితిలో ఉన్న సలీంను సలాం తన ఆటోలో తీసుకొని విలియంమూన్ మైదానం వెనుకాల ఉన్న ఓ గుంతలోకి తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశమైన అక్కడ సలా.. సలీం చొక్కాతోనే అతని రెండు చేతులు కట్టేసి బండరాయితో తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గుంతలో పడేసి, మరోసారి బండరాయితో మోది అంతమొందించాడు. సలాం బండరాయిని చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సలీ హత్య విషయం వెలుగుచూసింది. లారీ పార్కింగ్ వద్ద హోటల్లో ఉన్న సలీ సోదరుడు మౌలానా ఘటనా స్థలానికి వచ్చి చనిపోయింది తన సోదరుడు అని గుర్తించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. క్లూ దొరికిందిలా... హత్య జరిగిన రోజు చివరిసారిగా సలీంను సలాంతో చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈకోణంలో పోలీసులు సలాంను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా హత్యానేరం అంగీకరించి పైవిషయాలు తె లిపాడు. ఈమేరకు నిందితుడిని రిమాండుకు తరలించినట్లు సీఐ వెంకట్రామయ్య వివరించారు. కేసును ఒక్కరోజులోనే చేధించడంలో కృషి చేసిన కానిస్టేబుళ్లు దస్తప్ప, రామకృష్ణ్ణ, శివకుమార్ , అంజిలయ్య, కృష్ణారెడ్డి, రఫిక్లను సీఐ ఈసందర్భంగా అభినందించారు. -
యువకుడి దారుణ హత్య
తాండూరు రూరల్: గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పట్టణంలోని విలియం మూన్ హైస్కూల్ మైదానం వెనకాల గురువారం వెలుగుచూసింది. స్థానికులు, పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు సమీపంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చాంద్‌పాషా కుమారుడు షేక్ సలీం అలియాస్ మత్తు(23) ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. గురువారం ఉదయం ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని విలియం మూన్ హైస్కూల్ మైదానం వెనకాల ఓ గుర్తుతెలియని యువకుడు మృతదేహంగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సీఐ వెంకట్రామయ్య తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానికులను ఆరా తీసి హతుడు ఎన్టీఆర్ కాలనీకి చెందిన యువకుడు సలీంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సలీం రెండు చేతులను మెడకు చుట్టేసి పదునైన ఆయుధంతో తలపై దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. హతుడి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని దారుణంగా చంపేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సలీం హత్యతో గురువారం తాండూరులో తీవ్ర కలకలం రేగింది. హతుడి అన్న షేక్ మౌలనా ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రామయ్య పేర్కొన్నారు. -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
నిడదవోలు, న్యూస్‌లైన్ : తల్లీకూతుళ్ల మధ్య గొడవతో మనస్తాపం చెందిన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం తాడిమళ్ళ ఎన్టీఆర్ కాలనీలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన ఏటూరి సుధారాణి(16)కి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. 13 ఏళ్లక్రితం తండ్రి చనిపోగా, ఐదు నెలల క్రితం సోదరుడు కృష్ణ కామెర్ల వ్యాధితో మృతిచెందాడు. ప్రస్తుతం ఇంట్లో తల్లి మంగతాయారు, సుధారాణి మాత్రమే ఉంటున్నారు. గతేడాది పదో తరగతి పూర్తిచేసిన సుధారాణి గ్రామంలో ఉన్న జిరాక్స్ సెంటర్లో పనిచేస్తుంది. ఇదిలావుండగా తల్లీకూతుళ్లు తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం కూడా గొడవ పడ్డారని చెప్పారు. అరుుతే ఎప్పటిలానే తల్లి మంగతాయూరు పక్క ఊరిలో ఉన్న పీచు పరిశ్రమలో పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధారాణి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. పక్కింట్లో ఉండే ఏడేళ్ల చిన్నారి జడ వేయించుకోవడానికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న సుధారాణిని చూసి కంగారుపడుతూ స్థానికులకు చెప్పింది. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న తల్లి కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమిశ్రగూడెం ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.