తల్లీకూతుళ్ల మధ్య గొడవతో మనస్తాపం చెందిన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం తాడిమళ్ళ ఎన్టీఆర్ కాలనీలో గురువారం జరిగింది.
నిడదవోలు, న్యూస్‌లైన్ :
తల్లీకూతుళ్ల మధ్య గొడవతో మనస్తాపం చెందిన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం తాడిమళ్ళ ఎన్టీఆర్ కాలనీలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన ఏటూరి సుధారాణి(16)కి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. 13 ఏళ్లక్రితం తండ్రి చనిపోగా, ఐదు నెలల క్రితం సోదరుడు కృష్ణ కామెర్ల వ్యాధితో మృతిచెందాడు. ప్రస్తుతం ఇంట్లో తల్లి మంగతాయారు, సుధారాణి మాత్రమే ఉంటున్నారు. గతేడాది పదో తరగతి పూర్తిచేసిన సుధారాణి గ్రామంలో ఉన్న జిరాక్స్ సెంటర్‌లో పనిచేస్తుంది. ఇదిలావుండగా తల్లీకూతుళ్లు తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు.
గురువారం ఉదయం కూడా గొడవ పడ్డారని చెప్పారు. అరుుతే ఎప్పటిలానే తల్లి మంగతాయూరు పక్క ఊరిలో ఉన్న పీచు పరిశ్రమలో పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధారాణి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. పక్కింట్లో ఉండే ఏడేళ్ల చిన్నారి జడ వేయించుకోవడానికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న సుధారాణిని చూసి కంగారుపడుతూ స్థానికులకు చెప్పింది. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న తల్లి కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమిశ్రగూడెం ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.