సర్వే.. సందేహాలు
ఎలాంటి అపోహలకు గురికావద్దు
సామాజిక ఆర్థిక సర్వే మాదిరిగానే సమగ్ర కుటుంబ సర్వే
సర్వే అంశాల్లో పలుమార్పులు
నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే పట్ల ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పేర్కొన్న అంశాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ సర్వే కారణంగా రేషన్‌కార్డులు తొలగిస్తారా.. పెన్షన్లు రాకుండా పోతాయా.. ఒక ఇంటిలో ఒకే పొయ్యి ఉంటే వంట గదిని ప్రామాణికంగా తీసుకుని సర్వే చేస్తే గ్యాస్ కనెక్షన్లు రద్దు చేస్తారా..వంటి అనేక సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి.
సర్వేలో ఎన్యుమరేటర్ అడిగిన వివరాలన్నింటిని చెప్పకుండా రహస్యంగా ఉంచితే జరిగే నష్టం ఏమిటి..? లాంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి అపోహలు, అనుమానాలకు తెరదించుతూ ప్రభుత్వం సర్వే ముఖ్య ఉద్దేశాన్ని సవివరంగా పేర్కొంది. జిల్లా ప్రణాళిక విభాగం నిర్వహించే సామాజిక ఆర్థిక సర్వే తరహాలోనే సమగ్ర కుటుంబ సర్వే ఉంటుందని తేల్చిచెప్పింది.
దీనివల్ల రేషన్ కార్డులు తీసేయడం.. పెన్షన్లు రద్దు చేయడం..ఇతర సంక్షేమ పథకాల ఫలాలు అందకుండా పోతాయోమని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ శుక్రవారం జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించేందుకుగాను ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు కాకుండా అర్హులకు అందేలా ఈ సర్వే దోహదపడుతుంది.
మార్పులు.. చేర్పులు...
తొలుత జారీచేసిన నమూనాలో స్థానికత దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రానికి చెందిన వారి వివరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారనే అంశాలను చేర్చారు. కానీ తాజా సవరణలో ఆ కాలాన్ని పూర్తిగా తొలగించారు. దీంతోపాటు కుటుంబ వివరాల్లో సామాజిక వర్గంతోపాటు కులాన్ని తె లియజేయాలి. అదే విధంగా మాతృభాష కూడా తెలపాలి. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను మినహాయిస్తే మిగతా కుటుంబ సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే విద్యార్థులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు వివరాలను మాత్రం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనే వివరాలను నమోదు చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఉపాధి కోసం వలస వెళ్లిన వారు మాత్రం సర్వే రోజున సొంత గ్రామానికి రావాల్సి ఉంటుంది.
ఎన్యుమరేటర్ మీ వద్దకు వచ్చే సమయానికి మీ వద్ద దిగువ పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి
ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు
రేషన్‌కార్డు (తెలుపు/పింక్/అన్నపూర్ణ/అంత్యోదయ)
బ్యాంకు ఖాతా నంబరు
మొబైల్ నంబరు
గ్యాస్ కనెక్షన్ వివరాలు, నంబరు
పెన్షన్ పుస్తకం (వృద్ధాప్య/వితంతువు/వికలాంగులు/చేనేత/కల్లుగీత కార్మికులు)
వయసు ధ్రువీకరణ పత్రాలు (పిల్లలు చదువుకున్న వారయితే)
ఓటరు ఐడీ నంబర్లు
వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు (సదరమ్ సర్టిఫికెట్ కలిగి ఉంటే)
వ్యవసాయ భూమి వివరాలు (పాస్ బుక్/టైటిల్ డీడీ)
పశుసంపద వివరాలు
సొంత స్థిర, చరాస్తుల వివరాలు
దీర్ఘకాలిక వ్యాధుల వివరాలు
కరెంటు మీటరు నంబర్
భూమి, వాహన వివరాలు కచ్చితంగా నమోదు చేయించుకోవాలి. భవిష్యత్తులో ఆ.. ఆస్తులను వారసులకు ఇవ్వాలన్నా లేదా అమ్మాలన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.