ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడా?
కొలంబో: ది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికేఉన్నాడా?. శ్రీలంక తమిళ్ నేషనల్ అలయన్స్ నాయకుడు ఎమ్ శివలింగం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని పరికించి చూపిస్తున్నాయి. ఆచూకీ కనిపించకుండా పోయిన వారి కోసం శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్(ఓఎమ్ పీ)కు ప్రభాకరన్ పేరును సూచించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఓఎమ్ పీలో పేరును నమోదు చేయాలనుకుంటే తాను వారికి అండగా నిలుస్తానని అన్నారు.
మే 19, 2009న ప్రభాకరన్(54)ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ విషయాలను శ్రీలంకలోని తమిళులు కొట్టిపారేశారు. యుద్ధప్రాంతం నుంచి ప్రభాకరన్ తప్పించుకున్నారని కొంతమంది వాదించారు కూడా. యూఎన్ మానవహక్కుల పాలక సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఓఎమ్ పీని స్థాపించనున్న శ్రీలంక ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఓఎమ్ పీ స్థాపన ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమేనని అవి అంటున్నాయి. 2009లో ఎల్టీటీఈతో పోరు ముగిసిన తర్వాతి నుంచి ఇప్పటివరకు దాదాపు 16వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు.