పాతకక్షలతోనే దళిత యువకులపై దాడి?
రాజ్‌కోట్: దేశవ్యాప్తంగా నిరసలతోపాటూ, పార్లమెంట్‌ను సైతం దద్దరిల్లేలా చేసిన ఉనా ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. నలుగురు దళితులను చితక్కొట్టిన ఘటనలో పాతకక్షలే కారణమని తెలుస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ధళిత్ అధికార్ మంచ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ, సంఘటన జరిగిన ప్రాంతాల్లో వివరాలు సేకరించింది. 8మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఉనా సమీపంలోని మోటా సమదియాల గ్రామంలో పర్యటించింది. బాధితుల్లో ఒకరి తండ్రి బాలు భాయ్‌ను కలుసుకుంది. ఆరు నెలల కిందట అదే గ్రామంలోని అగ్ర కులానికి చెందిన సర్పంచ్, తమ వృత్తి నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని బాలు భాయ్ పేర్కొన్నారు. గోవులతో వ్యాపారం చేయకూడదని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు నిజనిర్ధారణ బృందం సభ్యులకు బాలు భాయ్ తెలిపారు.
'జూలై11న చనిపోయిన గోవులను తీసుకెళ్లాల్సిందిగా రెండు గ్రామాలను నుంచి సమాచారం రావడంతో నా కుమారుడితో పాటూ మరో ముగ్గురిని పంపంపించాను. వారు తిరిగి వస్తుండగా రెండు వాహానాల్లో కర్రలు, ఐరన్ పైపులతో వచ్చిన కొందురు నా కుమారిడితోపాటూ ముగ్గురుపై దాడికి దిగారు. వారు వచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ డీడీ 03 ఎఫ్ 1294గానూ, వాహనం వెనక వైపు ప్రెసిడెంట్- శివసేన- గిర్ సోమనాథ్ అని రాసి ఉంది' అని నిజనిర్ధారణ బృందం సభ్యులకు తెలిపారు.
అనంతరం వారిని వాహనానికి కట్టేసి, అసభ్య పదజాలంతో దూషించారని, తాము ఆవులను చంపలేదు, చచ్చిన గోవుల చర్మాన్ని వలవడమే మా వృత్తి అని దళిత యువకులు ఎంత మొత్తుకున్నా వారిని విడిచి పెట్టకుండా నాలుగు గంటలపాటు బట్టలూడదీసి కొట్టారని తెలిపారు. నేను, నా భార్య సంఘటన స్థలం చేరుకోగానే మమ్మల్ని కూడా దూషిస్తూ, దాడికి పాల్పడ్డారని బాలు బయ్యా వారికి వివరించారు.