oldage couple
-
'ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు.. కాసింత బువ్వ పెట్టండ్రా'
అనంతపురం క్రైం: ‘ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. కాసింత బువ్వ పెట్టండ్రా అంటే కడుపున పుట్టిన బిడ్డలే కాదంటున్నారు. ఓ పిడికెడు అన్నం పెట్టించండి సారూ..’ అంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన గఫూర్, ఖాజాబీ దంపతులు వేడుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వారు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. కొడుకులు పట్టించుకోకపోవడంతో అనంతపురంలోని రాణీనగర్‌లో ఉంటున్న కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు వివరించారు. వృద్ధ దంపతుల సమస్యపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ శ్రీసత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయానికి సిఫారసు చేశారు. వివిధ సమస్యలపై పోలీసు స్పందన కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. వీటిని ఎస్పీతో పాటు ఏఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ చక్రవర్తి స్వీకరించి, పరిశీలించారు. 2017లో తన భర్త చనిపోయిన తర్వాత అతని పేరుపై ఉన్న ఆస్తి మొత్తాన్ని అత్తింటి వారు కాజేసి అన్యాయం చేశారని, తనకు న్యాయం చేయాలంటూ పెనకచెర్లకు చెందిన మొలకల సువర్ణ ఫిర్యాదు చేసింది. చదవండి: (ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య) -
మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..
సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు): నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్‌చంద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఆలకించి, అర్జీలు స్వీకరించారు. మొత్తం 97 అర్జీలు అందాయి. అనంతరం సబ్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్పందన అర్జీలన్నింటిని పునఃపరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ►‘నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నా. మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవు. 74 సెంట్లు, 43 సెంట్ల స్థలాలను నా పెద్ద కుమారుడు బర్రె వెంకటేశ్వరరావు తన పేరుతో రాయించుకున్నాడు. స్థలాలు ఇస్తే మా బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఇప్పుడు స్థలాలు కాజేసి మోసం చేశాడు. ఆ స్థలాలను తిరిగి ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన వృద్ధురాలు బర్రె నాగమణి అర్జీ ఇచ్చి వేడుకున్నారు. బాధితుల సమస్యలను ఆలకించి, అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్ ప్రవీణ్‌చంద్ ►తమ కుమారుడు పొలం మీద వచ్చే పంట గానీ డబ్బు గానీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని కవులూరు గ్రామానికి చెందిన వృద్ధులు నాగేంద్రమ్మ, ఆమె భర్త కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం అక్కెడే చెట్టు కింద ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు. ►వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 217/1లో తాను కొనుగోలు చేసిన 76సెంట్ల భూమికి సర్వే చేయాలని రెండు సార్లు మీ–సేవలో దరఖాస్తు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని, తన పొలం సర్వే చేసి హద్దులు చూపించాలని కంచికచర్ల గ్రామానికి చెందిన ఎస్కే చాందిని అర్జీ ఇచ్చారు. ►గత వారం స్పందనలో అర్జీ ఇచ్చిన విజయవాడకు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన ఎం.శ్రీనివాస్‌కు సబ్‌కలెక్టర్ పెన్షన్ మంజూరు చేసి, వీల్‌చైర్ అందజేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్పీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
తనకంటే ముందే తనువు చాలించాలని..
సాక్షి, రాయికోడ్(అందోల్): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్‌పూర్ సర్పంచ్ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
తాగుబోతు మారణహోమం.. ఇద్దరిని హతమార్చి, మరో నలుగురిని..
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకా నవిలూరు గ్రామంలో ఓ తాగుబోతు మారణహోమానికి పాల్పడ్డాడు. వేట కొడవలిని తీసుకుని ఎదురింట్లో ఉండే వృద్ధ దంపతులను హతమార్చి, మరో నలుగురిని గాయపరిచాడు. మద్యానికి బానిసైన ఇతడు తరచూ ఇరుగుపొరుగుతో గలాటాలు పడేవాడు. బుధవారం రాత్రి నిందితుడు ఈరయ్య (38)కు, ఎదురింటి మాదయ్య (60), భార్య నింగమ్మ (50)తో గొడవ జరిగింది. ఈరయ్య ఇంట్లోని వేట కొడవలిని తీసుకుని మాదయ్య, నింగమ్మలను నరికి చంపాడు. చదవండి: ('లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..) అడ్డుకోబోయిన ఈరయ్య భార్య మహాదేవమ్మ, తల్లి, తండ్రితో పాటు మరో వ్యక్తి సురేష్ పైనా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి గౌరమ్మ, సురేష్లను బెంగళూరుకు తరలించారు. భార్య మహాదేవమ్మను గర్భవతి అని కూడా చూడకుండా గాయపరిచాడు. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టి ఇళ్ళకు తలుపులు వేసుకున్నారు. నంజనగూడు పోలీసులూ ఈరయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని చేతన్, డీఎస్పి గోవిందరాజు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) -
తండ్రి ప్రాణం నిలబెడితే.. కొడుకు నీడనిచ్చాడు
సాక్షి, మంగళగిరి: ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి నా భర్తకు ప్రాణం పోస్తే నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చి నీడ కల్పించార’ని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. పట్టణంలోని పీఎంఏవై వైఎస్సార్ జగనన్న నగర్లో మంగళవారం టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్లు అందజేశారు. అపార్ట్మెంట్లోని బీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో వృద్ధ దంపతులు అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావుల వద్దకు ఆయన వచ్చినప్పుడు వారు కన్నీరు పెట్టుకున్నారు. 2008లో తనకు గుండెపోటు రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3 లక్షల విలువయ్యే గుండె ఆపరేషన్‌ను కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా చేయించి, ప్రాణం నిలబెట్టారని చెప్పారు. నేడు రూ.20 లక్షల విలువయ్యే ఇంటిని ఆ మహానుభావుడి కుమారుడు, సీఎం వైఎస్ జగన్ ఒక్క రూపాయికే ఇచ్చి నీడ కల్పించారని ఆనందభాష్పాలతో చెప్పారు. మగ్గం నేస్తూ వచ్చిన ఆదాయం కుటుంబ పోషణ, అద్దెలకు అంతంత మాత్రంగానే సరిపోయేదన్నారు. వైఎస్సార్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చదవండి: (దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు) ఇంటి పట్టా అందుకున్న కంఠమనేని శ్రీనివాసరావు చంద్రబాబు వద్ద ఎన్నోసార్లు మొత్తుకున్నాం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలువూరులో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో పట్టాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ఒకసారి పేదలందరం కలిసి ఇళ్లు వేసినా, వాటిని కూల్చివేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నా. ఇలాంటి సంక్షేమ పథకాలను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయం. – కంఠమనేని శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ కార్యకర్త, చిలువూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
కొడుకు చేరదీయక..దయనీయస్థితిలో
సాక్షి, మెదక్ : వృద్ధ దంపతులు..అందులోనూ దివ్యాంగులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ముఖం చాటేశాడు. తినడానికి తిండిలేక, ఉండటానికి కూసింత చోటు లేక పశువుల ఆసుపత్రిలో అష్టకష్టాలు పడుతున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన నాగయ్య అంజమ్మ అనే వృద్ధ దంపతులు ఒకప్పుడు బాగానే బతికారు కానీ ఆస్తులు కరిగిపోయిన తర్వాత కొడుకు ముఖం చాటేయడంతో కష్టాలు మొదలయ్యాయి. అంజమ్మ అంధురాలు. నాగయ్య నడవలేడు దీనికి తోడు వినికిడి లోపం. భిక్షాటన చేస్తూ వాళ్లు పెడితే తినడం లేకపోతే పస్తులుండటం. ఇంతటి దయనీయ స్థితిలో పాడుపడిన పశువుల ఆసుపత్రిలో జీవనం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొడుకు మాత్రం పట్టించుకోకుండా ఇలా వదిలేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అతనిపై రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్‌కు పిలిపించిన పోలీసులు అతన్ని మందలించి ఇప్పటికైనా కాసింత సాయపడాల్సిందిగా కోరారు. ఇప్పటివరకు ఎలాంటి పెన్షన్ అందట్లేదని ఈ సందర్భంగా వృద్ధదంపతులు పోలీసులకు చెప్పగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. -
కరోనా బాధితులపై సీఎం జగన్ శ్రద్ధ బాగుంది
సాక్షి, శావల్యాపురం(వినుకొండ): కరోనా బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధ చాలా బాగుందని వైరస్ బారిన పడి కోలుకున్న దంపతులు సోమవారం తెలిపారు. శావల్యాపురానికి చెందిన వేలూరు మస్తాన్, ఆయన భార్య అసానమ్మలకు పది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అరవయ్యేళ్ల వయసుదాటిన వీరిద్దరూ ఇప్పటికే పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా, కరోనా తోడవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వారిని తరలించారు. ఆస్పత్రిలో పది రోజులపాటు కరోనాతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు తాము ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి వచ్చామంటే ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులతో కూడిన వైద్య సేవలు అందించి మంచి పోషకాహారం సకాలంలో క్రమం తప్పకుండా ఇవ్వడం వల్లేనన్నారు. -
భోజనం పెట్టేలా చూడండయ్యా...
సాక్షి. చౌటుప్పల్(మునుగోడు) : కుమారులు పట్టించుకోవడం లేదని రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆర్డీఓ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు పాలెం సత్తయ్య(80), అండాలు(70)లకు కుమారులు, కోడళ్లు ఉన్నారు. అయినా బుక్కెడు బువ్వకు నోచుకోవడం లేదు. నడవలేని స్థితిలో ఉన్న వారికి కుటుంబ సభ్యులు కనీస సేవలు సైతం చేయడం లేదు. నోరు తెరిచి అడిగినా పట్టించుకోకపోగా చీదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పరిస్థితిలో మార్పు వస్తుందని ఎంతో కాలంగా ఎదురుచూసినా మార్పు రాకపోవడంతో చట్ట ప్రకారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన మోర గోపాల్, మోర వెంకటేశ్‌ల సహాయంతో ఆటోలో స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉండడంతో అధికారులే ఆటో వద్దకు వచ్చి దంపతుల వివరాలను సేకరించారు. సత్తయ్య–అండాలు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు బాలయ్య మృతిచెందగా కోడలు యశోధ గ్రామంలోనే ఉంటుంది. రెండో కుమారుడు అంజయ్య–యాదమ్మ, మూడో కుమారుడు స్వామి–శోభ ఉన్నారు. రెండో కుమారుడు చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో పని చేస్తుండగా, మూడో కుమారుడు స్థానికంగా కారోబార్‌గా పని చేస్తున్నాడు. వృద్ధ దంపతులకు 1.06 ఎకరాల ప్రభుత్వ భూమి, నివాస గృహం ఉంది. ఆస్తుల పంపిణీ జరిగింది. చిన్నకుమారుడి వాటా ఇంట్లో కేటాయించిన గదిలో వృద్ధులు ఉంటున్నారు. వృద్దులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుత్తా వెంకట్‌రెడ్డి వృద్ధులు కూర్చున్న ఆటో వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కుమారులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా కోడళ్లు నిరాకరిస్తున్నారని వృద్ధులు బోరున విలపించారు. గతంలో ఇద్దరు కుమారులు నెలకు 500రూపాయల చొప్పున ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ ద్వారా వచ్చే రూ.2000తోనే పూటవెళ్లదీసుకుంటున్నామని తెలిపారు. జీవిత చరమాంకంలో ఉన్న తమకు భోజనం పెట్టించడంతో పాటు సేవలు అందించేలా చూడాలని వేడుకున్నారు. ఈ ప్రకారంగా కుమారులు, కోడళ్లకు ఆదేశాలు చేసి తమకు మేలు చేయాలని కోరారు. కాగా కుమారులకు నోటీసులు జారీ చేస్తామని గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపారు. -
మరణంలోనూ వీడని బంధం..!
70 ఏళ్ల వైవాహిక జీవితం ఒడిదుడుకుల ప్రయాణం చలించని మనోధైర్యం ప్రేమానురాగాలు అనంతం అలసి ఆగెను ఓ హృదయం విలవిల్లాడెను మరో ప్రాణం ఆ హృదయాన్నే అనుసరించిన వైనం ఓడి గెలిచిన మూడుముళ్ల ‘బంధం’. వారిదో ఉన్నతమైన కుటుంబం. వ్యాపారాలతో మంచి స్థాయికి ఎదిగిన ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే. పలువురికి మార్గదర్శకంగా ఉంటూ అందరినీ ముందుకు నడిపించిన ఆ పెద్దాయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈక్రమంలో ఏడు దశాబ్దాల పైచిలుకు జీవనయానంలో తోడూ–నీడలా ఉన్న భర్త మరణాన్ని ఆ ఇల్లాలు జీర్ణించుకోలేకపోయింది. భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతూ రెండు రోజుల తరువాత సాంగ్యం పెడుతున్న సమయంలో అలాగే ఒరిగిపోయి కన్నుమూసింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనతో నడిచిన ఏడడుగుల బంధాన్ని గుర్తుచేసుకుని కుమిలిపోయింది. రెండో రోజు భర్తబాటలోనే తనువు చాలించింది. ఈ విషాద ఘటన యాదమరి మండలం కీనాటం పల్లెలో గురువారం చోటు చేసుకుంది. సాక్షి, యాదమరి: మండలంలోని కీనాటంపల్లెకు చెందిన రామచంద్రనాయుడు(96)ది పే..ద్ద కుటుంబం. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, ఐదుగురు మనవరాళ్లు, ముగ్గురు మనవళ్లు, మునివరాళ్లు ముగ్గురు ఉన్నారు. పెద్దకుమారుడు సుబ్రమణ్యం కీనాటంపల్లెలోనే వ్యవసాయంతో స్థిరపడ్డారు. రెండవ కొడుకు కృష్ణమూర్తి తండ్రి తాలూకు వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్తూరులో మామిడి కాయల మండీ వ్యాపారిగా స్థిరపడ్డారు. కృష్ణమూర్తికి రామచంద్రనాయుడు వ్యాపారపరంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. వివాహాల అనంత రం వేర్వేరు ప్రాంతాల్లో కుమారులు, కుమార్తె స్థిరపడినా ప్రతి పండగకూ అందరూ తమ పిల్లలతో సహా వచ్చి కలవాల్సిందే. కీనాటంపల్లెలో బంధువులు, ఆత్మీయుల మధ్య సందడి చేయాల్సిందే. ఇదీ రామచంద్రనాయుడి నియ మం. ఊరిపెద్దగా ఉన్న ఆయన గ్రామానికి సైతం తనవంతు సేవ చేశారు. ‘కీనాటంపల్లె పెద్దాయన’గా పేరు తెచ్చుకున్నారు. రామచంద్రనాయుడు దంపతులను చూస్తే పార్వతీపరమేశ్వరులను చూసినట్టు ఉంటుందని గ్రామస్తులు వారి అన్యోన్య దాంపత్యం గురించి చెప్పడం కద్దు! ఈ నేపథ్యంలో ఈ నెల 19న సోమవారం అనారోగ్యంతో ఆ పెద్దాయన కన్నుమూశారు. గ్రామం పెద్ద దిక్కును కోల్పోయింది. మంగళవారం దహనక్రియలు నిర్వహించారు. బుధవా రం పాలు పోశారు. తన భర్త చనిపోయిన రోజు నుంచి అచ్చమ్మ(87) తీవ్రంగా కుంగిపోయిం ది. నిద్రపట్టేది కాదు. ఎక్కడో శూన్యంలోకి ఆమె చూపులు నిర్వికారంగా! ఆమె కళ్లల్లో ఎప్పుడూ దుఃఖమేఘాలే. ఈ నేపథ్యంలో అచ్చమ్మకు పుట్టింటినుంచి గురువారం సాంగ్యం తెచ్చారు. పసుపు, కుంకుమ, గాజుల సాంగ్యం ఆమెకు పెడుతుండగా భర్త జ్ఞాపకాలతో ఆమె గుండె పగిలింది. నుదుట పాత రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు పెట్టి, ముఖానికి, చేతులకు పసుపు రాస్తుండగా కన్నీటిపర్యంతమవుతూ ఆమె పక్కకు ఒరిగిపోయింది. వెంటనే ఆమెను హుటాహుటిన చిత్తూరు ఆసుపత్రికి తరలించా రు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామం మరోసారి శోకసంద్రమైంది. ఇలాంటి సంఘటన మూడోసారి.. కీనాటంపల్లెలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇది మూడవది. ఐదేళ్ల క్రితం డాక్టర్ గోపాల్‌నాయుడు భార్య గుర్రమ్మ అనారోగ్యంతో చనిపోయారు. 13వ రోజు కర్మక్రియలు చేస్తున్న రోజే ఆమె భర్త కూడా ఇలాగే బంధువుల నడుమ ప్రాణం విడిచారు. రెండేళ్ల క్రితం గ్రామంలో పార్థసారథి నాయుడు అనారోగ్యంతో చనిపోగా, అదే రోజు సాయంత్రం అతని అన్న జయశంకర్ నాయుడు తమ్ముడినే తలచుకుని కుమిలిపోతూ చనిపోయారు. ప్రస్తుతం రామచంద్రనాయుడు, అతని భార్య అలాగే చనిపోవడం యాధృచ్ఛికమే అయినప్పటికీ గుండె లోతుల్లో గూడుకట్టుకున్న ప్రేమానుబంధాలకు, పది మందికీ పంచే ఆత్మీయతానురాగాలకు నిలువెత్తు దర్పణమే. ఈ ఉదంతాల నుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవాల్సిందే ఎంతో ఉందని అన్యాపదేశంగా చెప్పినట్లే ఉంది. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: ప్రభుత్వం నుంచి నెలనెలా అందే వృద్ధాప్య పింఛను ఆగిపోయిందని, ఇంటి పట్టా రద్దు అయిందన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు మునిసిపల్ కార్యాలయం ఎదుట జరిగింది. శ్రీనివాసులు(65), భానుమతి 12వ వార్డులో ఉండేవారు. టీడీపీ కౌన్సిలర్ అంజద్ మస్తాన్ యాదవ్ తమకు వచ్చే ఫించనుతో పాటు, ఇంటి పట్టాను రద్దు చేయించాడంటూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.