
ఇంటి సేల్ అగ్రిమెంట్‌ను ఎమ్మెల్యే ఆర్కే చేతుల మీదుగా అందుకుంటున్న అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావు దంపతులు
సాక్షి, మంగళగిరి: ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి నా భర్తకు ప్రాణం పోస్తే నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చి నీడ కల్పించార’ని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. పట్టణంలోని పీఎంఏవై వైఎస్సార్ జగనన్న నగర్‌లో మంగళవారం టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్‌లు అందజేశారు.
అపార్ట్‌మెంట్‌లోని బీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వృద్ధ దంపతులు అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావుల వద్దకు ఆయన వచ్చినప్పుడు వారు కన్నీరు పెట్టుకున్నారు. 2008లో తనకు గుండెపోటు రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3 లక్షల విలువయ్యే గుండె ఆపరేషన్‌ను కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా చేయించి, ప్రాణం నిలబెట్టారని చెప్పారు. నేడు రూ.20 లక్షల విలువయ్యే ఇంటిని ఆ మహానుభావుడి కుమారుడు, సీఎం వైఎస్ జగన్ ఒక్క రూపాయికే ఇచ్చి నీడ కల్పించారని ఆనందభాష్పాలతో చెప్పారు. మగ్గం నేస్తూ వచ్చిన ఆదాయం కుటుంబ పోషణ, అద్దెలకు అంతంత మాత్రంగానే సరిపోయేదన్నారు. వైఎస్సార్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చదవండి: (దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు)
ఇంటి పట్టా అందుకున్న కంఠమనేని శ్రీనివాసరావు
చంద్రబాబు వద్ద ఎన్నోసార్లు మొత్తుకున్నాం
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలువూరులో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో పట్టాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ఒకసారి పేదలందరం కలిసి ఇళ్లు వేసినా, వాటిని కూల్చివేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నా. ఇలాంటి సంక్షేమ పథకాలను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయం.
– కంఠమనేని శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ కార్యకర్త, చిలువూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment