టాలీవుడ్లో అడుగుపెట్టి.. అప్పుడే పదేళ్లు!
కొన్ని అద్భుతమైన పాత్రలు.. మరికొన్ని ఫర్వాలేదనిపించేవి.. మరికొన్ని నిరాశ పరిచినవి.. వెరసి మొత్తమ్మీద నవదీప్ టాలీవుడ్లో అడుగుపెట్టి అప్పుడే పదేళ్లు అయిపోయింది. పరిశ్రమలో ఎలాగోలా నిలదొక్కుకున్నా.. అతడికి మాత్రం ఇంకా సంతృప్తి మాత్రం లేదు. వాస్తవానికి తాను ఇంకా మంచి స్థానంలో ఉండాల్సిందని, మరికొన్ని మంచి హిట్లు సాధించాల్సిందని అన్నాడు. అయితే.. మరికొందరు ఇతర నటులతో పోల్చుకుంటే మాత్రం.. విజయవంతంగా ఇన్నాళ్ల పాటు పరిశ్రమలో నిలదొక్కుకుని, ఇప్పటికీ ఆఫర్లు పొందుతున్నందుకు మాత్రం కొంత సంతోషంగానే ఉందన్నాడు. చందమామ, ఆర్య2 లాంటి సినిమాలతో మంచి హిట్లు సాధించిన నవదీప్ ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీసు వద్ద మరీ అంత పెద్ద విజయాలు సాధించలేదు.
అయినా కూడా.. తన ప్రవర్తనా తీరు కారణంగానే తాను ఇప్పటికీ బిజీగా ఉన్నానని, చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం తెలుగులో నటుడు, అంత సీన్ లేదు, అంతా నీ మాయలోనే లాంటి మూడు చిత్రాల్లో నవదీప్ చేస్తున్నాడు. బాగా విజయవంతమైన కొన్ని తమిళ సినిమాల్లో కూడా అతడు నటించాడు. కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువగా చేస్తున్నాడు. నవదీప్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడు నటించిన తమిళ చిత్రం 'అరింతుమ్ అరియమూలం' విడుదలై భారీ విజయం సాధించింది. తనకు 25 ఏళ్ల వయసులో అలాంటి విజయం వచ్చి ఉంటే అక్కడ కూడా నిలబడేవాడిననని నవదీప్ అన్నాడు. 2004లో 'జై' చిత్రంతో తెలుగులో అడుగుపెట్టాడు.