లక్ష కొలువులేవి?
- ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ, కాంగ్రెస్
- ఖాళీ పోస్టుల్లో నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏమైంది?
- సర్కారు దాటవేత వైఖరి అవలంబిస్తోంది ..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది ప్రభుత్వ తీరు
- ఎప్పుడు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్
- మా చిత్తశుద్ధిని శంకించలేరు: మంత్రి ఈటల రాజేందర్
- 11 వేల పోస్టులు భర్తీ చేశాం.. మరో 50 వేల ఉద్యోగాలిస్తాం
- శాఖల నుంచి 58,831 ఖాళీలు మాత్రమే అందాయని వివరణ
సాక్షి, హైదరాబాద్: ఖాళీ ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీని కుదిపేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో నియామకాలను ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రభుత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ నిలదీశాయి. ఖాళీ పోస్టులను ఎప్పుడు, ఎలా, ఎన్ని భర్తీ చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టాయి. రాష్ట్రం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించాయి. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ శాసనసభ పక్ష నేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ఈ అంశాన్ని లేవనెత్తారు.
విపక్షాల విమర్శలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. పోస్టుల భర్తీ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఇప్పటికే 11 వేల పోస్టులు భర్తీ చేశామని, మరో 18 వేల పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చామని, డీఎస్సీ ద్వారా కొత్తగా 10 వేల పోస్టులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2,400 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మొత్తంగా 50 వేల ఉద్యోగాలివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించాయని, శ్రమదోపిడీకి గురి చేశాయని విమర్శించారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తిచెందని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఉద్యోగ భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు.
గతంలో లక్ష ఉద్యోగాలని ఇప్పుడు 57 వేలంటారా?: కె.లక్ష్మణ్
తొలుత ఉద్యోగ ఖాళీలపై బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును విమర్శించారు. ‘‘ఉద్యోగ కల్పనపై ఎన్నిమార్లు అడుగుతున్నా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తోంది. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు 1.07 లక్షలు ఉన్నాయని గతంలో చెప్పారు. ఇప్పుడేమో కేవలం 57 వేలు మాత్రమే అంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
రేషనలైజేషన్ పేరిట టీచర్ పోస్టులను కుదించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పక్కన పెట్టారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అలాకాకుండా ఎన్ని ఉద్యోగులను భర్తీ చేస్తారు, ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు? ఎప్పట్లోగా, ఎలా భర్తీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి’’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
వారందరినీ ఎలా ఆదుకుంటారో చెప్పాలి: డీకే అరుణ
ఎన్నికల ముందు ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పిందని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఐకేపీ మహిళలు, కాంట్రాక్టు ఉద్యోగులు, కేంద్ర పథకాల పరిధిలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎందరో ఉద్యమంలో పాల్గొని స్ఫూర్తినిచ్చారు. వారందరినీ ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలి’’ అని ఆమె పేర్కొన్నారు.
మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు: ఈటల
విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్రంలో మొత్తంగా 5,23,679 పోస్టులు ఉండగా.. అందులో 1,07,744 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయా శాఖల నుంచి 58,831 ఖాళీలు మాత్రమే ప్రభుత్వానికి అందాయి. ఈ విషయంలో అంకెల గారడీ చేయట్లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 11,100 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 18,423 పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. డీఎస్సీ ద్వారా మరో 10,927 పోస్టులు భర్తీ చేయాలని ఇటీవలే కేబినెట్లో నిర్ణయం చేశాం. మొత్తంగా 50 వేల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. గతంలో కొన్ని వందలసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాల్లో పాల్గొన్న తమకే నిరుద్యోగులపై ప్రేమ ఎక్కువుంటందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ చిత్తశుద్ధిని శంకి ంచాల్సిన అవసరం లేదన్నారు.
‘‘కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణలో ప్రతిబంధకాలను కూడా పరిశీలిస్తున్నాం. వారిని క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు రూపొందించాం. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 25,589 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించాం. కనీస వేతనాలు పెంచడం ద్వారా 50 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాం. దీనిద్వారా రాష్ట్రంపై రూ.310 కోట్ల భారం పడింది’’ అని వివరించారు. అంగన్వాడీలకు కేంద్రం తన నిధుల్లో కోతలు పెట్టినా రాష్ట్రం పెంచిందని, ఆశా వర్కర్ల జీతాల పెంపు కోసం పార్టీ ఎంపీల బృందం కేంద్ర పెద్దలను కలిసిందని తెలిపారు.
మైక్ ఇచ్చేందుకు నిరాకరించిన స్పీకర్.. విపక్షం నిరసన
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు.. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయితే ప్రశ్నోత్తరాల్లో నిరసనలకు సమయం ఇవ్వలేమంటూ మైక్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు సైతం తమ స్థానాల్లోంచి నిలుచున్నారు. మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభకు టీ బ్రేక్ ప్రకటించారు.