one lakh rupees
-
నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!
Mutual Funds: ఆధునిక కాలంలో సంపాదించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలనీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఆలా అనుకునే వారికి మ్యుచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అనే చెప్పాలి. ఈ కథనంలో బెస్ట్ ఫండ్ ఏది? ఎంత పెట్టుబడికి ఎంత వస్తుందనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో పెట్టుబడికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీరు తప్పకుండా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మ్యుచువల్ ఫండ్ సిస్టమాటిక్ ప్లాన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను అందుకోవాలనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటర్న్స్.. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే డబ్బుని బట్టి మీ రిటర్న్స్ ఉంటాయని తప్పకుండా గుర్తుంచుకోవాలి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిటర్న్స్.. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ వ్యాల్యూ రూ.10 ఉన్న ఒక లక్ష యూనిట్లను కొనుగోలు చేశారనుకుంటే.. మీ పెట్టుబడి రూ. 10 లక్షలు (1,00,000×10) అవుతుంది. మీరు నెలకు రూ. 10000 రిటర్న్ పొందాలంటే.. మొదటి నెలలో ఎన్ఏవీ రూ. 10 ఉన్నప్పుడు 1000 యూనిట్లను విక్రయించి అనుకున్న పదివేలు తిరిగి పొందుతారు. అంటే అప్పుడు మీ వద్ద 99,000 యూనిట్లు మిగిలి ఉంటాయి. రెండవ నెలలో ఫండ్ ఎన్ఏవీ విలువ రూ.12కు పెరిగితే ఆ నెలలు మీకు పదివేలు ఇవ్వడానికి కేవలం 833 యూనిట్లను (10,000/12) మాత్రమే విక్రయించడం జరుగుతుంది. దీంతో మీ ఖాతాలో 98,167 యూనిట్లు ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రతి నెలా లెక్కించుకోవచ్చు. ఫండ్ మంచి పనితీరుని కనపరిస్తే పెట్టుబడి అలాగే ఉంటుంది, డబ్బులు వస్తూనే ఉంటాయి. పనితీరు మందగిస్తే పెట్టుబడి కరిగిపోతూ వస్తుంది. నెలకు రూ. 1 లక్ష.. ఈ విధంగా మీకు నెలకు రూ. 1 లక్ష.. 25 సంవత్సరాలు పాటు రావాలంటే ఒకే సారి రూ. 1,55,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన 8 శాతం వార్షిక రిటర్న్స్ వచ్చాయంటే ప్రతి నెలా రూ. 1 లక్ష అందుకోవచ్చు. ఇలా 25 సంవత్సరాల తరువాత కూడా మీ పెట్టుబడి ఖాతాలో అలాగే ఉంటుంది. అంతే కాకుండా పాతికేళ్లు నెలకు 1 లక్ష వస్తూనే ఉంటుంది. Disclaimer: ఇలాంటి మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, తప్పకుండా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గమనించగలరు. -
జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరాటం..!!
వరంగల్: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు. మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు. మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున.. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్ లేదా ప్లస్ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు. వారంలో పంపిణీకి సిద్ధం జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు. రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దళారులను నమ్మొద్దు.. రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -
24 గంటలు గడవక ముందే బాధితునికి అందిన సాయం
సాక్షి, వైఎస్సార్ కడప: కడప జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం రోజున భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులు భరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ రోజు (శనివారం) ఉదయం బాధితుల కుటుంబానికి డిప్యూటీ సీఎం అంజాబాద్, కడప నగర మేయర్ సురేష్ బాబు, జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సిద్ధవటం యానాదయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యానశాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు&డివిజన్ ఇంఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
ఫోర్జరీ సంతకంతో లక్ష గోల్మాల్
సంతమాగులూరు: ఫోర్జరీ సంతకంతో డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష రూపాయలు గోల్‌మాలైన సంఘటన మండలంలోని మిన్నెకల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ గ్రూపునకు చెందిన తన్నీరు అంజమ్మ, రాణిలు గ్రూపు లీడర్లుగా పనిచేస్తున్నారు. గ్రూపులోని మిగిలిన ఎనిమిది మంది సభ్యులకు తెలియకుండా తంగేడుమల్లి సిండికేట్ బ్యాంకులో లక్ష రూపాయలు తమ సొంత ఖర్చులకు వాడుకున్న విషయం బయటపడింది. ఇటీవల మిగిలిన ఎనిమిది మంది సభ్యులు రుణం కోసం బ్యాంకుకు వెళ్లారు. ఇటీవల రుణం తీసుకున్నారని.. మళ్లీ రుణం కోసం ఎందుకు వచ్చారంటూ మేనేజర్ ప్రశ్నించారు. దీంతో లీడర్ల అక్రమం బయట పడింది. అంతా కలిసి అధికారులను ప్రశ్నించేందుకు వెలుగు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులను లీడర్లు మోసం చేయడం అన్యాయమన్నారు. తమకు న్యాయం చేసేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే తమకు రుణం మంజూరు చేయాలని కోరారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు. -
బూట్లు కావాలా.. లక్ష కట్టు!
జైపూర్: బూట్ల కోసం లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోకండి. అలాగని ఇదేదో విదేశాల్లో జరిగిన వేలం పాటేమో అనే సందేహమూ వద్దు. అక్షరాలా మన దేశంలోనే జరిగింది. అసలు విషయానికొస్తే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రైతు తన మేనకోడలికి రెండో పెళ్లి నిశ్చయించాడు. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పంచాయతీ పెద్దలకు తెలియకుండా వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేస్తే పెద్దలు వచ్చి బూట్లను ఎత్తుకెళ్తారు. ఈ రైతు విషయంలోనూ అదే జరిగింది. గ్రామ నియమాల ప్రకారం బూట్లను పంచాయతీ పెద్దలు ఎత్తుకెళ్లారంటే.. వారు కుల బహిష్కరణకు గురయ్యారని అర్థం. దీంతో బహిష్కరణను తప్పించుకోవడానికి, తన బూట్లను తాను దక్కించుకోవడానికి ఆ రైతు రూ.లక్ష జరిమానా కట్టాలని తీర్పునిచ్చింది ఆ పంచాయతీ. -
పెళ్లికి వెళ్తే ఇళ్లు దోచేచారు...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపుర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన శీలం కిష్టయ్య ఇంట్లో గురువారం చోరీ జరిగింది. వివరాలు...బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. లక్ష నగదు, రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీరాంపూర్ సీఐ కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. (జైపుర్) -
బాలుడి ఖరీదు లక్ష రూపాయలు!
ఏలూరు: ఏ తల్లి కన్నబిడ్డో తెలీదుకానీ.. ముక్కుపచ్చలారని మూడు సంవత్సరాల బాలుడు వారం రోజులుగా అంగట్లో లక్షరూపాయల ఖరీదుకు అమ్మకానికి సిధ్దంగా ఉన్నాడు. వివరాలు.. ఏలూరు చిరంజీవి బస్ షెల్డర్ వద్ద ఉన్న వడ్డెరలకాలనీలో సుబ్బలక్ష్మీ అనే మహిళ ఇంట్లో వారం రోజులుగా ఈ బాలుడు దర్శనమిస్తున్నాడు. బాలుడు అమ్మకం, కిడ్నాప్ అంటూ వచ్చిన పుకార్లతో కాలనీకి చేరుకున్న పోలీసులు, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు.. బాలుడి గురించి ఆరాతీశారు. ఈమె బంధువు నాగరాజుకు, విజయవాడ బస్టాండ్‌లో ఓ బాలుడు దొరికాడంటూ తీసుకువచ్చి తమ వద్ద వదిలేశాడని చెబుతున్నారు. బాలుడు తన పేరు కార్తీక్, అమ్మపేరు దుర్గ, తండ్రిపేరు సుభానీ ఊరు గుంటూరు దగ్గర కంకరగుట్ట అని చెబుతున్నాడని అంటున్నారు. బాలుడిని వంగాయగూడెం మథర్ థెరిస్సా హోంకు తరలించామని ఛైల్డ్‌ప్రొటక్షన్ అధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి తెలిపారు. మిగిలిన విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉందని అన్నారు. ఇదిలా ఉంటే బాలుడు వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నా దొరికినట్లయితే పోలీసులకో, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులకో సమాచారం ఇవ్వకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు బాలుడిని ఇక్కడ వదిలిన నాగరాజును పట్టుకుని తమదైన శైలిలో విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు కనబడటం లేదు. -
కుటుంబానికి లక్ష మాఫీ!
రుణ మాఫీపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఒక కుటుంబంలో రెండుమూడు అకౌంట్లు ఉన్నా.. లక్షలోపు రుణం మాఫీ రూ. లక్ష దాటితే.. పై మొత్తాన్ని రైతులే భరించాలి రుణాల చెల్లింపుపై స్పష్టత కోరిన బ్యాంకర్లు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలు ఎన్ని ఉన్నా ఒక రైతు కుటుంబానికి లక్ష రూపాయలు మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రైతుపేరిట నాలుగైదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే.. ఆ అకౌంట్లలోని పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు, దీర్ఘకాలికం సహా అన్నీ కలిపి లక్ష రూపాయల లోపు ఉన్న వాటినే.. మాఫీ చేయాలని, అంతకు మించి రుణాలు ఉంటే.. రైతులే భరించేలా రుణ మాఫీని అమలు చేయాలని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించింది. రుణమాఫీ విషయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గురువారం తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశానికి నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) ప్రతినిధులతో పాటు ఇతర బ్యాంకర్లు, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఆప్కాబ్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు హాజరయ్యారు. రుణ మాఫీకి సంబంధించి రెండు మూడు రోజుల్లోగా మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు మొత్తం బకాయిలు రూ.17,337 కోట్లుగా అంచనా వేశారు. గ్రామాల వారీగా రైతులు, వారికున్న అకౌంట్లు ఎన్ని.? ఒకే రైతు ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నాడు? ఒక రైతు తీసుకున్న రుణాలు ఎన్ని.. వంటి అంశాలతో వివరాలను బ్యాంకర్లు సమర్పించాలని ఈ సందర్భంగా కమిటీ వారిని కోరింది. బ్యాంకర్లు, సహకార పరపతి సంఘాలు ఇచ్చే సమాచారం ఆధారంగా.. రైతుల డూప్లికేషన్ తొలగించి, అనర్హులకు ప్రయోజనం కలగకుండా పారదర్శకంగా, పకడ్బందీగా రుణ మాఫీని అమలు చేయాలని కమిటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే.. ఇద్దరికీ రుణ మాఫీని వర్తింప చేయాలా..? లేక ఒకరికేనా..? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు సూచించారు. ఒక రైతుకు రెండు అకౌంట్లలో కలిపి లక్షా ఇరవైవేల రుణం ఉంటే.. అందులో లక్ష మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుందని, మిగిలిన ఇరవై వేలు రైతు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో వివరించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రాలో రైతులకు కొత్త రుణాలు ఇస్తున్నట్టుగానే ఇక్కడా ఇవ్వాలని సమావేశంలో అధికారులు బ్యాంకర్లను కోరగా.. అక్కడి ప్రభుత్వం తమకు స్పష్టత ఇచ్చినందుకే రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరగా తేలిస్తే కొత్త రుణాలు ఇస్తామని వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని ఎలా సమకూరుస్తారో వివరించాలని బ్యాంకర్లు అధికారులను కోరారు. -
పట్టపగలు నడిబజారులో నగదు చోరీ
నూజివీడు, న్యూస్‌లైన్ : పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహ నం కవరులో ఉంచిన లక్ష రూపాయల నగదును దుండగుడు పట్టపగలు సినీఫక్కీలో అపహరించుకుపోయాడు. సేకరించిన, పోలీ సు లు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన షేక్ అబ్దుల్ షానవాజ్ జంక్షన్ రోడ్డులో సూపర్‌బజార్ నిర్వహిస్తుంటారు. వ్యాపారానికి సంబంధించి లక్ష రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు బ్యాగ్‌లో పెట్టుకుని ట్యాంక్ మీద కవర్లో దానిని ఉంచి ద్విచక్రవాహనంపై ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు. అక్కడ స్వైపింగ్ మిషన్ పనిచేయకపోవడంతో కళ్ళజోడు బాగుచేయిం చుకునేందుకు మైలవరం రోడ్డులోని అంబేద్కర్ సెంటరు ప్రాంతంలోని దుకాణం వద్దకు వెళ్లారు. నగదు ఉన్న బ్యాగ్‌ను బైక్ ట్యాంకుపైన కవర్లోనే ఉంచి కళ్లజోళ్ల షాపులోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగుడు బైక్‌పైన కవర్ తీసి నగదు బ్యాగ్‌ను చేజిక్కించుకున్నాడు. దీనిని షాపు యజమాని చూసి షానవాజ్‌ను అప్రమత్తం చేశారు. ఆయన బయటకు వచ్చి కేకలు వేస్తుండగా నంబరు లేని నలుపురంగు పల్సర్ బైక్ అక్కడకు వచ్చింది. దుండగుడు దానిపై ఎక్కగా, పెద్ద గాంధీబొమ్మ వైపు దూసుకుపోయింది. స్థాని కంగా సంచలనం కలిగించిన ఈ ఘటన గురిం చి బాధితుడు షానవాజ్ పట్టణ పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఐవీ నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వద్ద నుంచే వెంబడించిన దుండగులు? దుండగులు బ్యాంకు వద్ద నుంచి షానవాజ్‌ను వెంబడించి ఉంటారని భావిస్తున్నారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసే స్థితిలో ఉన్నట్లయితే పల్సర్ బైక్‌పై వెళ్లిన దుండగులను సులువుగా గుర్తించి, పట్టుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద నేరాలు జరి గినప్పడు హడావుడి చేయడం తప్ప మిగిలిన రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోకపోవడం పరిపాటైందని స్థాని కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆగంతకులు బ్యాం కులోనుంచి వెంబడించి ఉండి ఉంటే వారి ఆధారాలు అక్కడి సీసీ కెమెరాలలో లభ్యమయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.