టెక్ మహీంద్రా లాభం 3 రెట్ల వృద్ధి
చెన్నై: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,010 కోట్లకు చేరింది. టెలికం, ఫైనాన్షియల్, తయారీ రంగ విభాగాలలో సాధించిన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.గతేడాది(2012-13) ఇదే కాల ంలో కేవలం రూ. 322 కోట్ల లాభాన్ని ఆర్జి ంచింది. ఇక ఈ కాలంలో ఆదాయం సైతం దాదాపు 34% పుంజుకుని రూ. 4,898 కోట్లను అధిగమించింది. అంతక్రితం రూ. 3,668 కోట్ల ఆదాయం నమోదైంది.
డాలర్లలోనూ...: డాలర్ల ప్రాతిపదికన కూడా కంపెనీ ఆదాయం 17%పైగా వృద్ధితో 79.1 కోట్ల డాలర్లను తాకింది. నికర లాభం 16.31 కోట్ల డాలర్ల నుంచి 17.57 కోట్ల డాలర్లకు చేరింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యూహాలను, పెట్టుబడులను వినియోగిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ చెప్పారు. డిజిటల్ ఎంటర్ప్రెజెస్కు అవసరమైన సొల్యూషన్లు అందించడంపై దృష్టిపెట్టడం ద్వారా వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించారు.
మరిన్ని విశేషాలివీ...
క్యూ3లో నికరంగా 2,165 మందికి ఉద్యోగాలిచ్చింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 87,399కు చేరింది.
ఉద్యోగుల్లో 57,601 మంది సాఫ్ట్వేర్ సేవల్లోనూ, 23,213 మంది బీపీవో కార్యకలాపాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.