one Year period
-
ఏడాది పూర్తయినా ఇంకా పోరాటమే...
వాషింగ్టన్: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆమె వ్యవహారదక్షతపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడితో ఆమె సఖ్యతపై ప్రశ్నలు ఓవైపు, ఉపాధ్యక్ష పదవికి సరైన పరిశీలన లేకుండానే ఎంపిక చేశారన్న ప్రత్యర్థుల ఆరోపణలు మరోవైపు.. శ్వేతసౌధం నుంచి సరైన మద్దతు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ల మధ్య ఆమె ఏడాది పాలన సాగింది. సాధారణ రోజుల్లోనే ఉపాధ్యక్ష బాధ్యతలో రాణించడం చాలా కష్టం... కరోనా మహమ్మారి సమయంలో అది మరింత సంక్లిష్టంగా మారింది. అధ్యక్షుడికి అంతర్గతంగా సలహాలు, సూచనలు ఎన్ని చేసినా, రోజువారీ ఘటనలపై ఆమె స్పందనపై విమర్శలొస్తున్నాయి. ఓటింగ్ హక్కుల బిల్లును ఆమోదించడం, మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలను నిరోధించి, పరిష్కార చేయడం వంటి కీలక బాధ్యతలను బైడెన్, కమలాహారిస్‌కు అప్పగించారు. వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను ముందుకు తీసుకెళ్లడం, స్పేస్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం వంటివి ఆమె ముందున్నాయి. వీటన్నింటిలో ముఖ్యంగా వలసలనే రిపబ్లికన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె సరిగా పనిచేయకపోవడంవల్లే వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రగతిశీలమైన ధిక్కార గొంతుగా భావించిన ఆమె మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతేడాది గ్వాటెమాల, మెక్సికోలో పర్యటన సందర్భంగా వలసదారులనుద్దేశించి ‘‘ఎవ్వరూ రావొద్దు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై యునైటెడ్ లాటిన్ అమెరికన్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ బాధ్యతల నిర్వహణపై డిసెంబర్లో ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరపగా ఆమెకు మద్దతుగా 44శాతం ఓట్లు, వ్యతిరేకంగా 54శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడికి సైతం దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. హ్యారిస్‌ను చిత్రీకరించడంలో మీడియా ఆమె స్టైల్మీదనే శ్రద్ధ పెట్టిందని డెమొక్రాటిక్ వ్యూహకర్త కరేన్ ఫిన్నే అభిప్రాయపడ్డారు. మధ్యంతర ముప్పు తప్పదా!? జో బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. కరోనా, పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, దేశీయ విధానాలు, విదేశీ ఒప్పందాల విషయంలో ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని పరిష్కారమయ్యాయి. కొన్ని ప్రగతిలో ఉన్నాయి. ఇంకొన్నింటినీ నిలబెట్టుకోలేకపోయారు. వీటన్నింటిలోనూ ఇప్పుడు అతిపెద్ద ముప్పు కోవిడ్–19. అమెరికాలో 61 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని సైతం ఛేదించే దశలో ఉన్నారు. అయినా అది చూపిన ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. బైడెన్‌ను ఆమోదించే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. దీన్ని పరిష్కరించలేకపోతే మధ్యంతరం ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు విశ్లేషకులు. -
జస్ట్ ఆ పది మంది సంపాదనే 400 బిలియన్ డాలర్లు!
సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్ మస్క్ కావడం మరో విశేషం. ఎలన్ మస్క్.. ఆయన సంపాదన 277 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్ఎక్స్ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం సంపద 176 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్ డాలర్లు. యూరప్ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్ కంపెనీ పేరున్న ఎల్వీఎంహెచ్కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. లారీ పేజ్.. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, గూగుల్ కో-ఫౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్. ఈ గూగుల్ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. సెర్గె బ్రిన్.. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్(48) మొత్తం సంపాదన 125 బిలియన్ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్ కంపెనీలో 38 మిలియన్ షేర్లు ఉన్నాయి. స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో. ఎన్బీఏ లాస్ ఏంజెల్స్ క్లిపర్స్ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్ డాలర్లు సంపాదించాడు స్టీవ్ బాల్మర్(65). ల్యారీ ఎల్లిసన్ ఒరాకిల్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ(ఫేస్బుక్) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్ జుకర్‌బర్గ్. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్(37). వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఎలన్ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్.. ఈ ఏడాది అమెజాన్ సీఈవో పగ్గాల నుంచి దిగిపోవడంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!. -సాక్షి, వెబ్ స్పెషల్ -
అనంతపై 'సత్య' బాణం
ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం... నకిలీ దందాలకు చెక్ ... మిస్టరీ కేసుల ఛేదింపు... ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది బదిలీ.. సవాళ్లు ఎదురైనా చట్టాల అమలు... ఖాకీల సంక్షే మానికి పెద్దపీట.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు జిల్లా ఎస్పీ బీ సత్యయేసుబాబు. జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – అనంతపురం క్రైం: 9 మందిపై పీడీ యాక్ట్.. ‘అనంత’ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమనేది ఒకప్పటి మాట. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి చట్టాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వ ఆదేశాలను ఎస్పీ సత్యయేసుబాబు తూచా తప్పకుండా అమలు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఫ్యాక్షన్, దందాలకు పాల్పడిన 9 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 539 మట్కా కేసులు నమోదు చేసి రూ.45,56,327 స్వాధీనం చేసుకున్నారు. 9485 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి రూ.1,63,53,130 స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో 11 కేసులు నమోదు చేసి 51 మందిని అరెస్టు చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో 1439 మందిని అరెస్టు చేశారు.అలాగే జిల్లాలో 1887 కార్డెన్, సెర్చ్ ఆపరేషన్లు, 5999 పల్లె నిద్రలు, 67,939 సార్లు గ్రామ పర్యటనలు, 12,379 గ్రామ సభలు, 23,327 వాహనల తనిఖీలు చేపట్టారు. 18,474 మందిని బైండోవర్ చేశారు. 20,257 విజుబుల్ పోలీసింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గ్లెన్ అక్రమాలకు చెక్.. గత ముప్పై ఏళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు ఫ్యాక్షనిస్టులను అందులో భాగస్వామ్యులను చేసుకుని అక్రమాలకు పాల్పడ్డాడు గుంతకల్లుకు చెందిన గ్లెన్బ్రిక్స్. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలోని ఇతనిపై 15కు పైగా కేసులున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న గ్లెన్ను ఓ హత్య కేసులో అరెస్టు చేసి లోతుగా విచారణ చేయగా నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరి 2న గ్లెన్‌తో పాటు మరో ఐదుగురుని అరెస్టు చేశారు. చివరికి గ్లెన్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి కటకటాల వెనక్కు పంపారు. చదవండి: భరత్ అనే నేను.. మిస్టరీల చేధింపు.. జిల్లాలో సంచలనం రేపిన మిస్టరీ హత్యల చేధింపునకు ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కదిరి కొర్తికోట ట్రిపుల్ మర్డర్ కేసు చేధింపు ఓ మైలురాయి అని చెప్పాలి. గతేడాది తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో గుప్తనిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా చంపిన కేసు, అలాగే తాడిపత్రిలో భారీ మొత్తంలో జరిగిన బంగారం దోపిడీ కేసునూ చేధించారు. సంక్షేమానికి పెద్దపీట.. పోలీసు సంక్షేమానికి ఎస్పీ పెద్దపీట వేశారు. 55 ఏళ్లు పైబడిన వారిని కోవిడ్ విధుల నుంచి తొలగించారు. దాదాపుగా 450 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది మాస్క్‌లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందించారు. మృతి చెందిన 11 మంది హోంగార్డుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 7551 పిటిషన్లు స్వీకరించి 6,909 కేసులను పరిష్కరించి 593 మందిపై కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడితే వేటే.. లాక్డౌన్ సమయంలో ఎస్పీ దాదాపుగా ఐదుగురిపై వేటు వేశారు. హిందూపురం, గుంతకల్లులో ఏఆర్ కానిస్టేబుళ్లు, గుత్తిలో ఓ హెడ్‌కానిస్టేబుల్, సోమందేపల్లిలో కానిస్టేబుల్, శెట్టురులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఓ కానిస్టేబుల్‌పై ఎస్పీ వేటు వేశారు. ఈ నెల 7న గుత్తిలో లంచం తీసుకున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను జైలుకు పంపారు. డీజీపీ మన్ననలు.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేశారని, అందులో ఎస్పీ బీ సత్యయేసు బాబు ముఖ్య పాత్ర పోషించారని డీజీపీ గౌతం సవాంగ్ ఎస్పీ సత్యయేసు బాబును విలేకరుల సమావేశంలో అభినందించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఎస్పీ వందల సంఖ్యలో పర్యటనలు చేశారు. దాదాపుగా 15 వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడంతో ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 800 మంది బదిలీ.. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా మట్కా జరిగేది. దీని ద్వారా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం కేంద్రాల్లోని మట్కా కంపెనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా కొందరు పోలీసుల సహకారం ఉందని తేలడంతో ఏళ్లుగా పాతుకు పోయిన 800 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు. అదే విధంగా గుట్కా విక్రయాలు జరగకుండా అధిక సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం ‘శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిసారించాం. ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి నేరాలు అదుపులోకి రావడానికి చట్టాలను కఠినంగా అమలు చేశాం. కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అవినీతి తావు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఫ్యాక్షన్, దందాలు, అక్రమాలు, మట్కా , గుట్కా నియంత్రణకు కృషి చేశాం. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కోవిడ్ నేపథ్యంలో పోలీసులు తమవంతు బాధ్యతను నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నాం. – బీ సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ -
వోడాఫోన్ బంపర్ ఆఫర్ : ఆ సేవలు ఏడాది ఉచితం
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్, టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఇండియా తమ కస్టమర్లకు సువర్ణావకాశాన్ని అందిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తట్టుకునే వ్యూహంలో ప్రధాన ప్రత్యర్థి జియోకి షాకిచ్చేలా ఎయిర్టెల్ నిర్ణయం తీసుకోగా తాజాగా.. ఎయిర్‌టెల్‌ను వోడాఫోన్‌ను ఫాలో అవుతోంది. టీవీ, వీడియో సర్వీసులను ఉచితంగా అందించే ప్రణాళికలో అమెజాన్ ప్రైమ్‌తో ఒక భాగస్వామ్యం కుదర్చుకుంది. ఇందులో భాగంగా వోడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు వెయ్యి రూపాయల విలువైన అమెజాన్ ప్రీమియం వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్లో వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ.399 నుంచి ప్రారంభం. వోడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకున్న కస్టమర్లకు వెయ్యి రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ ఉచిత చందాను అందిస్తోంది. వోడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యి స్పెషల్ వోడాఫోన్ అమెజాన్ ఆఫర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఆటోమేటిగ్గా అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్షిప్ వస్తుంది. వేలకొద్దీ సినిమాలు, వీడియోలు, టీవీషోలు, సంగీతంలాంటి 999రూపాయల విలువైన ప్రీమియమ్ సేవలను వోడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించనున్నామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ భాగస్వామ్యంతో వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు షాపింగ్‌తో పాటు వినోదాన్నికూడా అందించడం ఆనందంగా ఉందని అమెజాన్ ప్రైమ్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ సాహి చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు విలువైన సేవలను అందించనున్నామని వోడాఫోన్ ఇండియా డైరెక్టర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. -
గల్ఫ్ ఏజెంట్ మోసం
కామారెడ్డి : పట్టణంలోని అశోక్‌నగర్ ప్రధాన రోడ్డులో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గల్ఫ్ ఏజెంట్‌గా చెలామణి అయిన దోమకొండ మండలానికి చెందిన ఒకరు 60 మందిని మోసగించిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది నుంచి గల్ఫ్ దేశాలకు పంపించేందుకు రూ. 40 లక్షల వరకు వసూలు చేశాడు. ఏడాది కాలంగా ఏజెంట్ చుట్టూ తిరిగిన బాధితుల్లో 16 మందిని రష్యా దేశానికి పంపించాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి వెనుదిరిగిన బాధితులు ఏజెంట్‌ను నిలదీయగా డబ్బులు ఇస్తానని మభ్యపెట్టాడు. చివరకు ఐపీ నోటీసులు పంపించడంతో బాధితులు లబోదిబోమన్నారు. శుక్రవారం కామారెడ్డి కోర్టుకు హాజరైన బాధితులంతా తమ గోడును వెల్లబోసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను విన్నవించారు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలతో ఏజెంట్‌పై కేసునమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.