Onion Dosa
-
మెనూలో ఉల్లి దోశ మాయమైంది!
బెంగళూరు: ఉల్లి ఉంటే మల్లి కూడా వంటలక్కే అని ఊరికే అనలేదు. ఏ వంటకమైనా ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ఇక టిఫిన్లు, చాట్లపై ఉల్లిపాయ చల్లకపోతే ముద్ద దిగదనుకోండి. అలాంటిది ఉల్లి రేటు చుక్కలనంటడంతో ఇంట్లో ఉల్లి కనిపించకుండా పోయింది. సరే, కనీసం హోటళ్లలోనైనా తిందామనుకుంటే అక్కడా ఉల్లిని బ్యాన్ చేసిన పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఉల్లి ధరల దెబ్బకు బెంగుళూరులోని పలు రెస్టారెంట్లలో ఉల్లి దోశను మెనూ నుంచి తీసేశారు. అంతేకాదు.. కొన్ని వంటకాల్లో ఉల్లి ఊసెత్తకుండా మమ అనిపిస్తుంటే మరికొన్ని వంటకాల్లో మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు. ఈ విషయంపై బెంగళూరులోని ఓ హోటల్ యాజమాని మాట్లాడుతూ.. ‘ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా ఉల్లి దోసెను మెనూలోంచి తీసేశాం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వంటకాల ధరలు పెంచవచ్చు. కానీ దీనివల్ల సగటు మధ్యతరగతి వాళ్లపై భారం పడుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాం. అయితే కొన్నింటిలో ఉల్లిపాయ లేకుండా వంటకాలు చేయలేం కాబట్టి మోతాదును మాత్రం తగ్గించామని పేర్కొన్నారు. దీనిపై భోజనప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లిపాయ లేకుండా చేసిన వంటలు బాగుండట్లేదని ఓ వినియోగదారుడు బాధను చెప్పుకొచ్చాడు. ఇక ఓ బాలుడు మాట్లాడుతూ ఉల్లిపాయ లేకపోతే వంటకాల రుచి దెబ్బతింటోందని, ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బెంగళూరులో కిలో ఉల్లిపాయ ధర రూ.100 పలుకుతోంది. -
ఉల్లి దోసెకు విరామం
* గుంటూరు, కృష్ణా జిల్లాల హోటళ్ల యజమానుల నిర్ణయం * ధర దిగొచ్చే వరకూ ఇదే పరిస్థితి * బెంబేలెత్తిస్తోన్న ఉల్లి సాక్షి, విజయవాడ బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల నుంచి ఉల్లి దోసె దొరకడం గగనమైంది. ఉల్లి దోసె, సమోసాల విక్రయాలకు పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు తాత్కాలిక విరామం పలికారు. ‘సారీ సార్... ఉల్లి దోసె వేయడం లేదు’ అని సమాధానమిస్తున్నారు. మార్కెట్లో ఉల్లి ధర చుక్కలనంట డమే దీనికి కారణం. ధర దిగొచ్చే వరకూ ఉల్లి దోసె కష్టమేనని బదులిస్తున్నారు. దీంతో ఉల్లిదోసె ప్రియులకు కష్టమొచ్చి పడినట్లయ్యింది. వీరు నోరు కట్టేసుకుని ఇడ్లీ, సాదా దోసెలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోని హోటళ్లలో రోజుకు సగటున 20 క్వింటాళ్ల ఉల్లిపాయల వాడకం ఉంటుందని అంచనా. గుంటూరు నగరంలో ఉల్లితో తయారు చేసే తినుబండారాల ద్వారా రోజుకు రూ. 30 లక్షల నుంచి 35 లక్షల వ్యాపారం ఉంటుందని సీనియర్ హోటల్ వ్యాపారి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.20 లకే సరఫరా చేస్తున్నా, అవన్నీ గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఇక హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఎక్కడ దొరుకుతాయని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధిక ధర పెట్టి ఉల్లిపాయలు కొని ఉల్లి దోసెను అందుబాటులో ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న దోసె రేటును రెట్టింపు చేయాల్సి ఉంటుందనీ, ఆ విధంగా రేటు పెంచితే కస్టమర్లు రారని, దీంతో వాటికివిరామం ఇచ్చామని చెబుతున్నారు.