
బెంగళూరు: ఉల్లి ఉంటే మల్లి కూడా వంటలక్కే అని ఊరికే అనలేదు. ఏ వంటకమైనా ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ఇక టిఫిన్లు, చాట్లపై ఉల్లిపాయ చల్లకపోతే ముద్ద దిగదనుకోండి. అలాంటిది ఉల్లి రేటు చుక్కలనంటడంతో ఇంట్లో ఉల్లి కనిపించకుండా పోయింది. సరే, కనీసం హోటళ్లలోనైనా తిందామనుకుంటే అక్కడా ఉల్లిని బ్యాన్ చేసిన పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఉల్లి ధరల దెబ్బకు బెంగుళూరులోని పలు రెస్టారెంట్లలో ఉల్లి దోశను మెనూ నుంచి తీసేశారు. అంతేకాదు.. కొన్ని వంటకాల్లో ఉల్లి ఊసెత్తకుండా మమ అనిపిస్తుంటే మరికొన్ని వంటకాల్లో మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు.
ఈ విషయంపై బెంగళూరులోని ఓ హోటల్ యాజమాని మాట్లాడుతూ.. ‘ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా ఉల్లి దోసెను మెనూలోంచి తీసేశాం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వంటకాల ధరలు పెంచవచ్చు. కానీ దీనివల్ల సగటు మధ్యతరగతి వాళ్లపై భారం పడుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాం. అయితే కొన్నింటిలో ఉల్లిపాయ లేకుండా వంటకాలు చేయలేం కాబట్టి మోతాదును మాత్రం తగ్గించామని పేర్కొన్నారు. దీనిపై భోజనప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లిపాయ లేకుండా చేసిన వంటలు బాగుండట్లేదని ఓ వినియోగదారుడు బాధను చెప్పుకొచ్చాడు. ఇక ఓ బాలుడు మాట్లాడుతూ ఉల్లిపాయ లేకపోతే వంటకాల రుచి దెబ్బతింటోందని, ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బెంగళూరులో కిలో ఉల్లిపాయ ధర రూ.100 పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment